పసికందు ఏడుపునకు చలించిన ఓ పోలీసు భార్య

పసికందు ఏడుపునకు చలించిన ఓ పోలీసు భార్య

ఓ పసికందును కసాయి తల్లిదండ్రులు పొదల్లో వదిలేసి వెళ్లారు. ఆ పసికందు ఏడుపునకు.. ఓ పోలీసు భార్య చలించిపోయింది. వెంటనే దగ్గరికి తీసుకుని పాలిచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. 

డిసెంబరు 20న గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలో పొదల్లో గుడ్డలో చుట్టి ఉన్న చిన్నారి కనిపించింది. పసికందు ఏడుపులు ఓ పోలీసు భార్యకు వినిపించాయి. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చలి కారణంగా పసికందు పరిస్థితి విషమించింది. బిడ్డ ఆకలితో, చలికి తట్టుకోలేక ఏడుస్తోంది.

పాపకు తల్లి పాలు తప్ప మరేమీ ఇవ్వలేమని పోలీసులకు తెలుసు. కానీ వారు ఏమీ చేయలేకపోయారు. ఇది చూసిన SHO భార్య జ్యోతి సింగ్ చలించిపోయింది. స్వచ్ఛందంగా పాలిచ్చింది. అనంతరం చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. విడిచిపెట్టిన తల్లిదండ్రుల గురించి తమకు సమాచారం లేదని పోలీసులు తెలిపారు. ‘ఇలాంటి పని ఎలా చేయగలిగారో అర్థం కాలేదు, పాపను చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఆకలితో ఏడుస్తుంటే నిలబడలేకపోయాను. తల్లిపాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఎవరైనా తమ పిల్లలను చూసుకోవడంలో సమస్య ఉంటే వారిని అనాథాశ్రమం, ఎన్జీవోలో చేర్పించండి’ అని జ్యోతి సింగ్ సూచించారు.