సింగరేణి నుంచి .. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి : సీఎండీ శ్రీధర్

సింగరేణి నుంచి .. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి : సీఎండీ శ్రీధర్

కోల్​బెల్ట్/హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లోని హైడ్రోజన్ ప్లాంట్​ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్​గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్​.శ్రీధర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్​లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్ అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్​లో పలు అంశాలపై చర్చించారు. రామగుండం రీజియన్​లో మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్ అధికారులకు సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా..

మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్​లోని రెండు 600 మెగావాట్ల జనరేటర్ల హీట్ తగ్గించేందుకు హైడ్రోజన్​ను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ప్లాంట్ ఆవరణలో ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని నడుపుతున్నారు. సింగరేణి సాధారణంగా హైడ్రోజన్ ఉత్పత్తిని థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో ఉత్పత్తి చేస్తుంది. ఏడాదికి దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ 100 కిలో వాట్ విద్యుత్​ను వినియోగిస్తూ హైడ్రోజన్  వాయువును ఉత్పత్తి చేస్తున్నది. ఈ క్రమంలో పర్యావరణహిత చర్యగా ప్లాంట్​ను ఇకపై సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా నిర్వహించాలని, తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తూ, దాన్ని వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా దేశంలో నిలవాలని సింగరేణి సంస్థ భావిస్తున్నది. ఇందులో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ఆవరణలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్​ను ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంట్​కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని బుధవారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్ అధికారులను సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. థర్మల్ విద్యుత్​కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ ను పర్యావరణహిత ‘గ్రీన్ హైడ్రోజన్’ ఉత్పత్తి చేసే దేశంలోని తొలి సంస్థగా సింగరేణి గుర్తింపుపొందనుంది.

మరో ప్లాంట్ ఏర్పాటుకు ఆదేశాలు

ఎస్టీపీపీలోని హైడ్రోజన్​ ప్లాంట్​ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్​గా మార్చడంతో పాటు సొంతంగా రామగుండం రీజియన్​లో మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్ అధికారులను సీఎండీ ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్ వాయువును సింగరేణి, దాని సమీపంలోని ఎరువుల ఫ్యాక్టరీలతో పాటు ఇతర కర్మాగారాలకు విక్రయించే ఛాన్స్ ఉంది. లాభాల కన్నా ఒక మంచి పర్యావరణహిత చర్యగా ఈ ప్రాజెక్ట్  చేపట్టాలని సింగరేణి భావిస్తున్నది.

224 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్వహణ

సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం 224 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నడుపుతున్నది. ఈ ప్లాంట్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 170 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను ఉత్పత్తి చేసినట్లు సీఎండీ ఎన్​.శ్రీధర్ తెలిపారు. సోలార్ పవర్ ఉత్పత్తితో సింగరేణి సంస్థ తెలంగాణ ట్రాన్స్​కోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలిగిందని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న 76 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. రివ్యూ మీటింగ్​లో సింగరేణి డైరెక్టర్ (ఈఎం) డి.సత్యనారాయణ, జైపూర్ సింగరేణి థర్మల్​ పవర్ ప్లాంట్ సీటీసీ సంజయ్ కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జేఎన్​సింగ్, ఎస్టీపీపీ జీఎం చినబసివి రెడ్డి, సోలార్​మేనేజర్ జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్.వి.కె.రాజు, జీఎం (సివిల్) సూర్యనారాయణ, ఏజీఎం (సివిల్) ప్రసాద్, ఏజీఎం (ఎఫ్ అండ్ ఏ) సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.