యాసంగి సాగుకు బేఫికర్..​ సింగూర్ ప్రాజెక్ట్ కింద పంటలు వేసేందుకు గ్రీన్​ సిగ్నల్​

యాసంగి సాగుకు బేఫికర్..​ సింగూర్ ప్రాజెక్ట్  కింద పంటలు వేసేందుకు గ్రీన్​ సిగ్నల్​
  •     సర్కార్​ ఆమోద ముద్ర పడిన వెంటనే రిలీజ్​
  •     సంగారెడ్డి జిల్లాలో 50 వేల ఎకరాలకు, మెదక్​​ జిల్లాలో 25 వేల ఎకరాలకు నీరు
  •     మంజీరానది పరివాహక ప్రాంతం రైతులకు మేలు

మెదక్, సంగారెడ్డి, వెలుగు: ఈ యాసంగి సీజన్ లో ప్రాజెక్ట్​ ల కింద పంటల సాగుకు గ్రీన్​ సిగ్నల్​ వచ్చింది. బుధవారం హైదరాబాద్ లో ఇరిగేషన్ ఇంజనీర్​ ఇన్​ చీఫ్​ (ఈఎన్ సీ)  మురళీధర్​​అధ్యక్షతన జరిగిన  స్టేట్​లెవల్​ కమిటీ ఫర్​ ఇంటిగ్రేటెడ్​ వాటర్​ మేనేజ్​ మెంట్​ (శివమ్) మీటింగ్ లో గోదావరి బేసిన్​లో ప్రాజెక్ట్​ల కింద యాసంగి  పంటల సాగు కు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సింగూర్​ ప్రాజెక్ట్​ ద్వారా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రత్యక్షంగా 75 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. పరోక్షంగా మంజీరా నదీ వెంట ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల కింద, నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు మరో పది వేల ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగుకు అవకాశం కలుగనుంది. శివమ్​ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన వెంటనే ఆన్, ఆఫ్​ పద్దతిలో నీరు విడుదల చేసేందుకు ఇరిగేషన్​ ఆఫీసర్లు సన్నద్దం అవుతున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో 50 వేల ఎకరాలకు..

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులో 28.8 టీఎంసీల నీటి నిల్వ ఉండగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.  ఇందులో కుడి, ఎడమ కాలువల ద్వారా 35 వేల ఎకరాలు, సింగూరుకు అనుసంధానంగా ఉన్న 166 చెరువులకు కాల్వలను లింక్ చేసి మరో 10వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఈ యాసంగికి 2 టీఎంసీల నీటిని దశలవారీగా విడుదల చేసేందుకు ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు.

గత ఏడాది ఈ సీజన్ టైంలో ఆరు దఫాలుగా వ్యవసాయానికి నీరు అందించారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వ్యవసాయ అవసరాల మేరకు సాగునీటిని అందిస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వ్యవసాయానికే కాకుండా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కూడా సింగూరు ప్రాజెక్టు ద్వారా  ప్రయోజనాలు కలుగుతున్నాయి.

నాలుగు మండలాల పరిధిలో..

వ్యవసాయరంగ ప్రాధాన్యం ఉన్నమెదక్ జిల్లాలో ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన వనదుర్గా ప్రాజెక్ట్ (ఘనపూర్ ఆనకట్ట) కింద  కొల్చారం, పాపన్నపేట, మెదక్ రూరల్, హవేలిఘనపూర్ మండలాలు, మెదక్ టౌన్ పరిధిలో సెటిల్డ్ ఆయకట్టు 21,625 ఎకరాలు ఉంది. అయితే ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు మాత్రమే కాగా, పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం 0.135 టీఎంసీలకు తగ్గింది.

స్థానికంగా భారీ వర్షాలు కురిసి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండినా నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉండడంతో ఆయకట్టు పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఎగువన సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ప్రభుత్వం నీటిని విడుదల చేస్తేనే వనదుర్గా ప్రాజెక్ట్ ఆయకట్టు పొలాలు సాగు చేసేందుకు అవకాశం ఉంది. సింగూర్​ ప్రాజెక్ట్​ లో పుష్కలంగా నీటి నిల్వ ఉండడంతో వనదుర్గా ప్రాజెక్ట్​ కింద యాసంగి సాగుకు నీరు విడుదల చేయనున్నట్టు ఇరిగేషన్​ జిల్లా సూపరింటెండెంట్​ఇంజనీర్​ ఏసయ్య తెలిపారు. అవసరాన్ని బట్టి విడతల వారీగా నీరు విడుదల చేస్తామని  చెప్పారు. 

నదీ పరివాహక ప్రాంతంలో..

 సింగూర్ నుంచి నీరు విడుదల కావడం వల్ల ఆ ప్రాజెక్ట్​ పరిధి 50 వేల ఎకరాలు, వనదుర్గా ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలోని 21,625 ఎకరాలతోపాటు,  సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్, ఆందోల్​, మెదక్ జిల్లాలోని  చిలప్ చెడ్, కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్, మెదక్, హవేలి ఘనపూర్ మండలాల పరిధిలోని మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో, చిలప్​ చెడ్​, కొల్చారం మండలాల పరిధిలోని లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీంల కింద కలిపి దాదాపు 10 వేల ఎకరాలు సాగు కానున్నాయి.