BBK 12: బిగ్ బాస్ హౌస్ రీ ఓపెన్.. డిప్యూటీ సీఎం జోక్యం.. అభిమానులకు వీకెండ్‌లో ఊరట!

BBK 12: బిగ్ బాస్ హౌస్ రీ ఓపెన్.. డిప్యూటీ సీఎం జోక్యం.. అభిమానులకు వీకెండ్‌లో ఊరట!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ షో వస్తుందంటే చాలు టీవీల ముందు కూర్చుండిపోయారు. అలాంటిది సెప్టెంబర్ 28న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ కన్నడ 12వ సీజన్.. కేవలం పది రోజుల్లోనే అనూహ్యంగా నిలిచిపోయింది. ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న ఈ పాపులర్ రియాలిటీ షోకు కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) సీల్ వేయడంతో షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఈ షో భవిత్వంపై అనిశ్చితి నెలకొంది.   అటు తాత్కాలికంగా షో నిలిచిపోవడంతో అభిమానుల్లో కలవరం నెలకొంది. చివరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె శివకుమార్ జోక్యంతో మళ్లీ ప్రసారాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

అసలేం జరిగింది?

బెంగళూరు శివార్లలోని బిడది ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్ లో ఈ సీజన్ కోసం నిర్మించిన బిగ్ బాస్ హౌస్‌ను పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు సీజ్ చేశారు. స్టూడియోలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ (STP) సరిగా పనిచేయకపోవడం, శుద్ధి చేయని మురుగు నీటిని బయటికి వదలడం, అలాగే ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు పారవేయడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలను KSPCB అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, స్టూడియో యాజమాన్యం సరైన అనుమతులు తీసుకోలేదని కూడా తేలింది. దీనిపై గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. స్టూడియోకు సీల్ వేశారు.

ఈ పరిణామంతో హౌస్‌లో ఉన్న 17 మంది కంటెస్టెంట్లను రాత్రికి రాత్రే ఖాళీ చేయించారు.  గోప్యంగా వారిని సమీపంలోని ఈగల్‌టన్ రిసార్ట్‌కు తరలించారు. కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటికి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు రూ. 5 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన బిగ్ బాస్ సెట్‌ను సీజ్ చేయడంతో..  షో నిర్వాహకులు డైలమాలో పడ్డారు. ప్రభుత్వంతో పెద్దలతో చర్చలకు దిగివచ్చారు. 

డిప్యూటీ సీఎం జోక్యం... 

అయితే, ఈ వ్యవహారంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తక్షణమే జ్యోకం చేసుకున్నారు. బిగ్ బాస్ కన్నడ చిత్రీకరణ జరుగుతున్న బిడదిలోని జాలీవుడ్ ప్రాంగణంపై సీల్‌ను ఎత్తివేయాలని బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. పర్యావరణ నిబంధనలకు కట్టుబడి ఉండటం అత్యంత ప్రాధాన్యత అయినప్పటికీ, కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉల్లంఘనలను సరిదిద్దుకోవడానికి స్టూడియోకు అవకాశం ఇవ్వాలని తెలిపారు.  బిగ్ బాస్ వంటి వినోద కార్యక్రమాలు అవసరం. ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాలి. తప్పు జరిగితే, సరిదిద్దాలి అని శివకుమార్ మీడియాకు తెలిపారు.

 

కిచ్చా సుదీప్ రియాక్షన్.. 

డిప్యూటీ సీఎం డి.కె శివకుమార్ జోక్యంతో స్టూడియోకు తమ ఉల్లంఘనలను సరిదిద్దుకోవడానికి అధికారులు గడువు ఇచ్చారు. తాత్కాలికంగా షూటింగ్ కొనసాగించేందుకు అనుమతి లభించింది. ఈ నిర్ణయం పట్ల బిగ్ బాస్ హోస్ట్ నటుడు కిచ్చా సుదీప్ వెంటనే స్పందించారు. ఈ ఇలాంటి క్లిష్ట సమయంలో మద్దతు ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ సర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బిగ్‌బాస్ ఈ గందరగోళంలో భాగం కాదని గుర్తించిన అధికారులకు కూడా ధన్యవాన్యాలు. #BBK12 ఇక్కడే ఉంటుంది అని ట్వీట్ చేశారు.

 

షో ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుంది?

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాలతో స్టూడియోపై సీల్‌ను ఎత్తివేశారు. దీంతో, బిగ్ బాస్ కన్నడ 12 తిరిగి పట్టాలెక్కింది. తాత్కాలికంగా రిసార్ట్‌కు వెళ్లిన కంటెస్టెంట్లు మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు.  అక్టోబర్ 10, శుక్రవారం నుంచి ఈ షో యథావిధిగా రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. ఈ సీజన్‌లో మొదటి వారమే ఆర్‌జే అమిత్, కరిబసప్ప ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు, ఈ విరామం తర్వాత మిగిలిన 17 మంది కంటెస్టెంట్లు తమ బిగ్ బాస్ జర్నీని కొనసాగించనున్నారు. తాత్కాలికంగా షో నిలిచిపోవడంతో కలవరపడ్డ అభిమానులు, షో పునఃప్రారంభం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.