
- విషయాన్ని దాచి పెట్టిన యువకుడి తల్లిదండ్రులు
- ఉదయమే ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్న వధువు, బంధువులు
- హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో ఘటన
హుజురాబాద్ రూరల్, వెలుగు : ఓ అమ్మాయితో పెండ్లి నిశ్చయం చేసుకున్న యువకుడు.. వివాహానికి ముందు రోజు మరో యువతిని పెండ్లి చేసుకొని పారిపోయాడు. ఈ విషయం తెలియక వధువుతో పాటు ఆమె బంధువులు ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. తీరా యువకుడు పారిపోయిన విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కుంట మధుకర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి కాట్రపల్లికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చమైంది. యువతి కుటుంబ సభ్యులు రూ. 40 లక్షల విలువైన అర ఎకరం భూమి, 10 తులాల బంగారం, రూ. 6 లక్షలు ఇచ్చి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
శుక్రవారం ఉదయం 9.30 గంటలకు హుజూరాబాద్‌లోని సాయిరూప ఫంక్షన్‌హాల్‌లో వివాహం జరగాల్సి ఉంది. వధువుతో పాటు ఆమె బంధువులంతా ఉదయమే ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. కానీ వరుడు, అతడి కుటుంబసభ్యులు కనిపించలేదు. వరుడి కుటుంబసభ్యులను ఆరా తీయగా... అతడు గురువారమే మరో యువతిని పెండ్లి చేసుకొని పారిపోయాడని తెలిసింది. వధువు కుటుంబసభ్యులు, బంధువులు యువకుడి తల్లిదండ్రులను నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.