తెల్లారితే పెళ్లి.. వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి

తెల్లారితే పెళ్లి.. వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి

కాగజ్ నగర్, వెలుగు : పెండ్లి కోసం ఆ ఇంటిల్లిపాదీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగబోతుంది. ఇంటి ముందు టెంట్ వేశారు. డెకరేషన్ పూర్తి చేశారు. భోజనాలు వండుతున్నారు.. మేళతాళాలు వాళ్లూ వచ్చారు. ఇంతలో అనుకోని విషాదం నెలకొంది. పెళ్లి కొడుకు వడదెబ్బ తో చికిత్స పొందుతూ.. పెళ్లి రోజు కు ముందు జూన్ 13వ తేదీ అంటే.. మంగళవారం రాత్రి చనిపోయాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్లబొరీ గ్రామంలో  ఈ ఘటన విషాదం నింపింది.

 గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య _యశోద లకు ముగ్గురు కొడుకులు. ఇందులో గుండ్ల తిరుపతి (26) పెద్దకొడుకు. ఇతనికి ఇటీవల మంచిర్యాల జిల్లా భీమిని గ్రామానికి చెందిన యువతితో పెండ్లి నిశ్చయం అయింది. జూన్ 14వ తేదీ.. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పెండ్లి ముహూర్తం ఉంది. పెండ్లి పనుల్లో తిరుగుతున్న పెళ్లి కుమారుడు తిరుపతి సోమవారం వడదెబ్బకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న తిరుపతిని.. కుటుంబ సభ్యులు కాగజ్ నగర్ కు తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతుండగా.. మంగళవారం రాత్రి ఆరోగ్యం విషమించింది. దీంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం మంచిర్యాలకు తీసుకు వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు పెళ్లి కుమారుడు తిరుపతి. ఈఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. పెళ్లి కోసం చేసిన ఏర్పాట్ల దగ్గర మృతదేహం పెట్టాల్సి రావడం పై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. 

పెళ్లి కోసం వచ్చిన వారు.. తిరుపతి అంత్యక్రియల్లో పాల్గొనటం అనేది మరింత విషాధం. పెళ్లిలో ఆశీర్వదించాల్సిన వారు తిరుపతిని విగతజీవిగా చూస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.