
మనదేశంలో ఉన్న అతి ముఖ్యమైన సమస్య జల కాలుష్యం. మురుగునీరు దేశంలోని వివిధ పట్టణాల నుంచి రోజుకు 7236.8 కోట్ల లీటర్లు ఉత్పత్తి అవుతోంది. అంటే ఒకరోజుకు 2.6 టీఎంసీ. ప్రతిఏటా మనదేశంలోని పట్టణాల నుంచి దాదాపు 933.04 టీఎంసీ మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. రోజూ జీహెచ్ఎంసీ పరిధిలో 0.058 టీఎంసీ మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. ఒక కోటి జనాభా నుంచి సంవత్సరానికి 21.17 టీఎంసీ మురుగునీరు ఉత్పత్తి అవుతుంది.
తెలంగాణ జనాభా దాదాపు 4కోట్లు. మనదేశ జనాభా 140 కోట్లు. చిన్న పల్లె నుంచి రాజధాని ఢిల్లీ వరకు మనద్వారా ప్రతి ఏటా ఉత్పత్తి అయ్యే మురుగునీటి పరిమాణం 2963.8టీఎంసీలు. ప్రస్తుతం అన్ని నదులు, ఉప నదులు ద్వారా సముద్రాలు విపరీత కాలుష్యానికి లోనవుతున్నాయి. మురుగునీటి శుద్ధీకరణ, వినియోగం, నదుల కాలుష్య నియంత్రీకరణ చాలా అవసరం. ప్రతి నివాస గృహం తనవంతు మురుగునీటిని ఉత్పత్తి చేయటంలో పాలుపంచుకుంటున్నాయి.
మత్స్యపరిశ్రమకు ఏటా రూ.17,440 కోట్ల నష్టం
మురుగునీరు ఏర్పడడానికి తప్పనిసరి కారణాలు మనం రోజూ వాడే వాషింగ్ పౌడర్లు, డిటర్జెంట్కేకులు, బాత్ సోప్స్, షాంపూలు, ఫినాయిల్, మౌత్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మేకప్ ఐటమ్స్ మొదలైనవి. మురుగునీటిని మంచినీటిగా మార్చలేమా. మార్చగలం. నదులు మురికినీటి కలుషితం అవుతున్నాయి. భారత మత్స్య పరిశ్రమ ఏటా రూ.17,440 కోట్లు నష్టపోతోంది. కలుషిత నీటివలన డయేరియా ప్రబలి మన ఆర్థిక వ్యవస్థ రూ.2.145 కోట్లు నష్టపోతోంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం స్వచ్ఛమైన నీరు లభించక దాదాపు రెండు లక్షలమంది చనిపోతున్నారు.
మురుగునీటి వలన నేల కూడా విపరీత కాలుష్యానికి గురి అవుతున్నది. భారలోహాలతో భూగర్భం కలుషితం అవుతున్నది. ప్రస్తుతం మన మురికి కాలువలు 90శాతం మట్టి, మురుగుతో నిండి ఉన్నాయి. సంబంధిత పనివారు కేవలం కాలువ పైభాగంలోని ఒక పొరను తొలగిస్తున్నారు. దశాబ్దాల మురికి ఈ కాలువలలో నిక్షిప్తమైంది. ఇది లక్షల క్యూబిక్ ఫీట్స్‌తో సమానం. చిన్న వర్షానికే మురికి కాలువలు పొంగిపొర్లుతున్నాయి.
మురుగునీటికి సంప్హౌస్అవసరం
మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రాధాన్యమిచ్చి ఒక గ్రామాన్ని లేదా రెండు మూడు గ్రామాలను ఒక యూనిట్‌గా చేసి శుభ్రపరచాలి. గ్రామాలలో, చిన్న పట్టణాల్లో మురుగునీటిని శుభ్రపరచడం కొంతవరకు సులభంగా ఉంటుంది. కొత్తగా నిర్మించే గృహాలు, అపార్ట్ మెంట్స్సెప్టిక్ ట్యాంక్, సంప్హౌస్తోపాటుగా మురుగునీరును నింపుటకు మురుగునీటీ సంప్‌హౌస్ కూడా భూగర్భంలో నిర్మించాలి.
ఘన వ్యర్థాలు, పాక్షిక ఘన వ్యర్థాలు అదే ట్యాంక్‌లో ఉండి కాల క్రమేణా మట్టిగా మారతాయి. మన వాష్రూంలలోని నీరు నేరుగా మురికి కాలువలో కలవకుండా మురుగునీటి సంప్ హౌస్‌లోకి వెళ్లి కాలువలోనికి చేరుతుంది. ప్రతి లీటరు మురుగు ఎక్కడిదక్కడే శుద్ధి జరగాలి. అప్పుడు నదులు తద్వారా సముద్రాలు క్రమక్రమంగా 100 సంవత్సరాల కిందటి స్వచ్ఛతను తిరిగి పొందుతాయి. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి, పర్యావరణం దెబ్బ తింటోంది. ఆరోగ్యవంతమైన తల్లి గర్భం నుంచి ఆరోగ్యవంతమైన శిశువు జన్మిస్తుంది. జన నాశనం అనులోమానపాత ధర్మాన్ని పాటిస్తాయి. జన సాంద్రతను క్రమబద్ధీకరించి ప్రకృతి తన ఉనికిని కాపాడుకుంటుంది. ప్రకృతి శాశ్వతమైనది.
- నరెడ్ల వేణుగోపాల్, ఉపాధ్యాయుడు