గ్రూప్–2 జనవరిలో ఉంటుందా.?. నిరుద్యోగుల్లో మొదలైన చర్చ

గ్రూప్–2 జనవరిలో ఉంటుందా.?. నిరుద్యోగుల్లో  మొదలైన చర్చ

హైదరాబాద్: ఎన్నికల మ్యానిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం ఏర్పడటంతో ఆ దిశగా చర్యలను ప్రారంభించింది. రాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీల వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్టం  వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎస్ పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ ల వివారాలతో రావాలని సీఎం సూచించారు. 

సీఎం సమీక్ష తర్వాత తమకు మంచి జరుగుతుందని  నిరుద్యోగులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉండే గ్రూప్‌ -1 ఉద్యోగ నియామకాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నాటికి, గ్రూప్‌ -2 నియామకాలు తొలి విడత ఏప్రిల్‌ 1 నాటికి, రెండో దశ డిసెంబర్‌ 15 నాటికి భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అలాగే, గ్రూప్‌- 3 నియామకాలు తొలి దశ జూన్‌ 1నాటికి, రెండో దశ డిసెంబర్‌ 1 నాటికి, గ్రూప్‌ -4 ఉద్యోగాలు తొలి విడత జూన్ 1, రెండో దశ డిసెంబర్‌ 1 నాటికి భర్తీ చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొంది.

గ్రూప్–2 జనవరిలో ఉంటుందా?

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షను 2024-జనవరిలో నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాచరణ మొదలు పెట్టింది. గ్రూప్-2లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.  ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి  ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ షెడ్యూలు విడుదల చేసింది. అయితే గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో టీఎస్‌పీఎస్సీ మరోసారి ఈ పరీక్షలను వాయిదావేసింది. 

వచ్చేఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కమిషన్ గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు పరిపాలన పరమైన ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాలు గుర్తించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. అయితే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పరీక్షల నిర్వహణకు నెలరోజుల సమయం కూడా లేకపోడంతో గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత నెలకొంది. మరోవైపు గ్రూప్-1, గ్రూప్-2తో పాటు ఇతర నియామక పరీక్షల తాజా పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.  ఈ సమీక్షలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశముంది.