గ్రూప్ 4 పోస్టులు.. ఆందోళనలో అభ్యర్ధులు

గ్రూప్ 4 పోస్టులు.. ఆందోళనలో అభ్యర్ధులు

గ్రూప్ 4 పోస్టుల నియామకాల తీరిది
కొన్ని పోస్టులకు డిగ్రీలో 50% మార్కులు..కొన్నింటికి బీకాం అర్హత
సగానికి పైగా పోస్టులు నాలుగైదు జిల్లాల్లోనే 
ఆందోళనలో ఇతర జిల్లాల అభ్యర్థులు

హైదరాబాద్ : గ్రూప్ 4 పోస్టులకు డిగ్రీ పాసైతే చాలు అనే మాట పాతదై పోయింది. టీఎస్​పీఎస్సీ తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్​తోనే ఈ విషయం స్పష్టమైంది. పోస్టు ఒక్కటే ఉన్నా.. క్వాలిఫికేషన్లు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. సాధారణంగా సివిల్స్​ పరీక్షలకే మినిమమ్ డిగ్రీ పాస్ అనే అర్హత ఉంటే.. గ్రూప్ 4 కు మాత్రం నాలుగైదు రకాలుగా క్వాలిఫికేషన్లు పెట్టడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క నోటిఫికేషన్​లో ప్రకటించిన పోస్టులకు.. డిటైల్డ్  నోటిఫికేషన్​లో పేర్కొన్న పోస్టులకు 1100లకు పైగా పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఇందులో సగానికి పైగా పోస్టులు నాలుగైదు జిల్లాల్లోనే ఉండటంతో, మిగిలిన జిల్లాల అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. 

ఒకే పోస్టుకు రకరకాల అర్హతలు.. 
టీఎస్​పీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్4 నోటిఫికేషన్​లో పలు పోస్టుల్లో క్వాలిఫికేషన్లు వేర్వేరుగా ఉన్నాయి. ఒకే రకమైన పోస్టులున్నా.. ఒక్కో డిపార్ట్‌‌మెంట్ ఒక్కో అర్హత పెట్టింది. దీనిపై అభ్యర్థుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్, ట్రెజరరీ అండ్ అకౌంట్స్, హెచ్ఎండీఏ  డిపార్ట్‌‌మెంట్లలో జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు, స్టేట్ ఆడిట్ డిపార్ట్​మెంట్‌‌ లో జూనియర్ ఆడిటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ చదివితే అర్హులని ప్రకటించారు. కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌లోని అవే పోస్టులకు బీకాం చదివిన వాళ్లే అర్హులని పేర్కొన్నారు. సివిల్ సప్లయ్స్​ డిపార్ట్‌‌మెంట్‌‌లోని జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులుండాలని, ఎస్సీ, ఎస్టీలకు మినిమమ్ 40 శాతం ఉండాలనే నిబంధన పెట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్స్​ అండ్ సీవరేజ్​ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ (పీ అండ్ ఏ) పోస్టులకు నార్మల్ డిగ్రీ పెట్టగా, జూనియర్ అసిస్టెంట్(ఎఫ్ అండ్ ఏ) పోస్టులకు మాత్రం బీకాం కంప్యూటర్ క్వాలిఫికేషన్ పెట్టారు. ఇలా ఒకే రకమైన పోస్టులకు ఒక్కో క్వాలిఫికేషన్ పెట్టడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. 

జిల్లాల్లోనే ఎక్కువ
గ్రూప్‌‌ 4 నోటిఫికేషన్‌‌ పలు జిల్లాల్లోని అభ్యర్థులకు నిరాశనే మిగిల్చింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్‌‌ కన్నా డిటైల్డ్  నోటిఫికేషన్‌‌కు వచ్చేసరికి వెయ్యికిపైగా పోస్టులకు కోత పెట్టారు. ఏ జిల్లా పోస్టులు ఆ జిల్లాకు అంటూ సర్కారు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ దానికి అనుగుణంగా ఆయా జిల్లాల్లో పోస్టులు కనిపించట్లేదు. టీఎస్​పీఎస్సీ ప్రకటించిన పోస్టుల్లో సగానికి పైగా ఉద్యోగాలు నాలుగైదు జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలో గ్రూప్- 4 అంటేనే జిల్లాస్థాయి పోస్టులతో ఉంటుంది. కానీ ఈసారి జిల్లాస్థాయితో పాటు స్టేట్ కేడర్, కంటిగ్యూస్ పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ ఒకటిన రిలీజ్ చేసిన గ్రూప్ 4 ప్రిలిమినరీ నోటిఫికేషన్‌‌లో 9,168 పోస్టులు నింపుతామని ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి రిలీజ్ చేసిన పూర్తి నోటిఫికేషన్‌‌లో మాత్రం 8,039 పోస్టులే అని ప్రకటించారు. ఈ లెక్కన 1,129 పోస్టులు తగ్గిపోయాయి. లోకల్ అభ్యర్థులకే 95 శాతం పోస్టులు అని ప్రకటించినా, చాలా జిల్లాల్లో  వంద, వందయాభైలోపే ఉన్నాయి. స్టేట్ కేడర్ కేటగిరీలో(యూనివర్సిటీల్లో) 600 వరకు పోస్టులున్నాయి. జిల్లాస్థాయి పోస్టులు 7 వేలకు పైగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే ఎక్కువగా పోస్టులున్నాయి. దీంతో మిగిలిన జిల్లాల అభ్యర్థులు నిరాశలో మునిగారు.