గద్వాల ఎమ్మెల్యేపై లీడర్ల తీవ్ర అసంతృప్తి

గద్వాల ఎమ్మెల్యేపై లీడర్ల  తీవ్ర అసంతృప్తి

గద్వాల టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్య నాయకులకు మధ్య వైరం మరింత ముదురుతోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారిపై దాడితో వివాదాల్లో చిక్కుకున్నారు.

గద్వాల టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు  

గద్వాల టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తీరుతో పార్టీకి దూరమవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యేకు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరుకావటం లేదు. జడ్పీ చైర్ పర్సన్ సరిత గద్వాలలో క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు. గద్వాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని సరిత తిరుపతయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేతో అంటీ ముట్టనట్లుగా..

పార్టీ డైరెక్షన్ ను పక్కన పెట్టి.. సొంత డైరెక్షన్ లో ఎమ్మెల్యే వెళ్తున్నాడన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి  వరుసకు సోదరుడైన చంద్రన్న కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్నారు. మాజీ జడ్పీ చైర్మన్, ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్లు బండారి బాస్కర్, గట్టు తిమ్మప్పలు ఎమ్మెల్యేతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. లీడర్లంతా ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలకు ఎమ్మల్యే తమను ఆహ్వానించటం లేదని మండిపడుతున్నారు. దీంతో గద్వాల టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి.

అసంతృప్తిలో నేతలు

పార్టీని నమ్ముకున్న వారిని ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తున్నాడని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతో పొసగని వాళ్లంతా ఒక్కటయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆంజనేయులు గౌడ్ ను నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా ఎమ్మెల్యే చేశాడన్న విమర్శలున్నాయి. ఇద్దరు బామ్మర్దులను తప్ప ఇతరులెవరిని ఎమ్మెల్యే నమ్మే పరిస్థితి లేదన్న ఆరోపణలున్నాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు. మారిన రాజకీయ సమీకరణాలతో ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో సన్నిహితంగా ఉంటున్నారు.. ఎమ్మెల్యేతో పొసగని ఈ అసంతృప్త నేతలు టీఆర్ఎస్ లో ఎంత కాలం కొనసాగుతారన్నది చర్చనీయాంశంగా మారింది.