కరోనాతో పెరుగుతున్న ప్లాస్టిక్ వేస్ట్

కరోనాతో పెరుగుతున్న ప్లాస్టిక్ వేస్ట్

న్యూఢిల్లీ: మహమ్మారి కారణంగా ప్లాస్టిక్, బయో మెడికల్ వేస్ట్‌‌‌‌లు భారీగా పేరుకుపోతున్నాయి. ఒకవైపు దేశం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బిజీగా ఉండగా, ప్రమాదకరమైన, విషపూరిత వ్యర్థాలు పేరుకుపోతూనే ఉన్నాయి. కరోనా కేసులు భారీగా వస్తుండటంతో ఆస్పత్రుల్లో రోజుకు 2,03,000 కిలోల బయోమెడికల్ వేస్ట్ పోగవుతోంది. దేశంలో గత నెల పోగుబడిన బయోమెడికల్ వేస్ట్‌‌‌‌లో సగం కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ  కర్ణాటక నుంచే వస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత నెలలో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే బయోమెడికల్ వేస్ట్‌‌‌‌లు నాన్- కోవిడ్ బయోమెడికల్ వేస్ట్‌‌‌‌లలో సుమారు 33 శాతం ఉన్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌‌‌‌మెంట్ 'స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్‌‌‌‌మెంట్ 2021' పేరుతో విడుదల చేసిన రిపోర్టు పేర్కొంది. మే నెలలో పోగైన బయోమెడికల్ వేస్ట్ అంతకుముందు నెలతో పోలిస్తే 46 శాతం ఎక్కువ.  ఏప్రిల్‌‌‌‌లో రోజుకు 1.39 లక్షల కిలోలకు వేస్ట్ పోగయింది.  మార్చి నెలలో రోజూ 75,000 కిలోల ప్లాస్టిక్, బయోమెడికల్ వేస్ట్ తయారయింది.  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) లెక్కల ప్రకారం.. 2020 జూన్– 2021 మే మధ్య 45,308 టన్నుల కరోనా బయోమెడికల్ వేస్ట్ పోగుపడింది. కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక లో ఈ సమస్య ఎక్కువ ఉందని పేర్కొంది. 

శుభ్రం చేస్తున్నది చాలా తక్కువ..
2017 లో రోజుకు ఉత్పత్తి అయ్యే బయోమెడికల్ వేస్ట్‌‌‌‌లలో బరువు 5.59 లక్షల కిలోలు దాటలేదు. అప్పుడు ప్రతిరోజూ  దాదాపు 519 కిలోల వేస్ట్‌‌‌‌ను శుభ్రం చేసేవారు.  2019 లో రోజు 6.19 లక్షల కిలోల బయోమెడికల్ వేస్ట్‌‌‌‌లను ఉత్పత్తి చేసి, రోజుకు 545 కిలోలను శుద్ధి చేశారు. ఇండియాలో ఇప్పటికీ 12శాతం  ఆసుపత్రి వేస్ట్‌‌‌‌లను బీహార్, కర్ణాటక రాష్ట్రాలు శుభ్రం చేయకుండా పారబోస్తున్నాయి.  "2019 లో బయోమెడికల్ వేస్ట్‌‌‌‌లలో 88శాతం వరకు శుద్ధి చేశారు. ఇది 2017 లో 92.8శాతం వరకు ఉండేది’’ అని మండలి రిపోర్టు పేర్కొంది.  మెడికల్ కల్చర్లు, ఇన్ఫెక్షన్ ఏజెంట్లు, సంబంధిత బయోలాజికల్స్, మనిషి రక్తం,  బ్లేడ్ల వంటి పదునైన వస్తువులు, తొలగించిన మానవ శరీర భాగాలు, ఐసోలేషన్ వేస్ట్‌‌‌‌ను బయోమెడికల్ వేస్ట్ అంటారు. వీటిని తగిన రీతిలో శుభ్రం చేయకుంటే,  మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందని మెడికల్ ఎక్స్పర్టులు చెబుతున్నారు.