రైల్వే సర్వీసులపై ఇక నో జీఎస్‌టీ

రైల్వే సర్వీసులపై ఇక నో జీఎస్‌టీ
  • ఫేక్ ఇన్‌‌వాయిస్‌‌ను అరికట్టేందుకు బయోమెట్రిక్ ఆధార్‌‌‌‌ అథెంటికేషన్‌‌
  • అన్ని రకాల మిల్క్ క్యాన్‌‌లు, కార్టన్‌‌ బాక్స్‌‌లపై 12 శాతం జీఎస్‌‌టీ
  • హాస్టల్ సర్వీస్‌‌లపై జీఎస్‌‌టీ మినహాయింపు  
  • 53వ జీఎస్‌‌టీ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయం

రైల్వే స్టేషన్లలో ప్లాట్​ఫామ్​ టికెట్లు, వెయిటింగ్​ రూమ్​, క్లాక్​ రూమ్, బ్యాటరీ కారు సేవలకు జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వాలని శనివారం జరిగిన 53వ మీటింగ్‌లో జీఎస్‌ టీ కౌన్సిల్ నిర్ణయించింది.

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్‌‌ సాధారణ ప్రజలకు అందిస్తున్న సర్వీస్‌‌లపై జీఎస్‌‌టీ మినహాయింపు ఇవ్వాలని శనివారం జరిగిన 53 వ మీటింగ్‌‌లో జీఎస్‌‌టీ కౌన్సిల్  నిర్ణయించింది. అంతేకాకుండా ఫేక్‌‌ ఇన్‌‌వాయిస్‌‌లను అరికట్టేందుకు  బయోమెట్రిక్‌‌తో కూడిన ఆధార్‌‌‌‌ అథెంటికేషన్‌‌ను  ఇక నుంచి ఉపయోగించడానికి ఆమోదం తెలిపింది.  

ప్లాట్‌‌ఫామ్‌‌ టికెట్లను అమ్మడం,  రిటైరింగ్‌‌ రూమ్‌‌లు, వెయిటింగ్ రూమ్‌‌లు, సామాన్లు దాచుకోవడానికి కల్పించే సర్వీస్‌‌లపై ఇక నుంచి  జీఎస్‌‌టీ మినహాయింపు ఉంటుందని జీఎస్‌‌టీ కౌన్సిల్ చైర్‌‌‌‌పర్సన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అలానే బ్యాటరీలతో నడిచే కార్ల సర్వీస్‌‌లపై జీఎస్‌‌టీ మినహా యింపు ఉంటుందని తెలిపారు.

దేశం మొత్తం మీద  బయోమెట్రిక్‌‌ అథెంటికేషన్‌‌ను ఉపయోగించడం ద్వారా ఫేక్ ఇన్‌‌వాయిస్‌‌లను అరికట్టడానికి వీలుంటుందని, మోసపూరితంగా ఇన్‌‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌‌లను క్లయిమ్‌‌ చేస్తున్నవారిని ఎదుర్కోవడం సులభమవుతుందని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్‌‌ పూర్తయ్యాక మరోసారి జీఎస్‌‌టీ మీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు.  ఎన్‌‌డీఏ ప్రభుత్వం  వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ నిర్వహించిన మొదటి జీఎస్‌‌టీ కౌన్సిల్ మీటింగ్ ఇది. 

కౌన్సిల్ తీసుకున్న ఇతర ముఖ్యమైన నిర్ణయాలు..

1. ఫైనాన్షియల్ ఇయర్స్‌‌ 2017–18, 2018–19, 2019–20 కు సంబంధించి సెక్షన్‌‌ 73 కింద అందుకున్న ట్యాక్స్ డిమాండ్‌‌లపై  వడ్డీని, పెనాల్టీని జీఎస్‌‌టీ కౌన్సిల్‌‌ రద్దు చేసింది. వచ్చే ఏడాది మార్చిలోపు చెల్లించే  డిమాండ్ నోటీసులకూ ఇది వర్తిస్తుంది.   

2. స్టీల్‌‌, అల్యూమినియం, ఐరన్ వంటి  వివిధ మెటల్స్‌‌తో తయారైన మిల్క్ క్యాన్‌‌లపై  12 శాతం జీఎస్‌‌టీ పడనుంది. ఈ క్యాన్‌‌లను ఎలా వాడినా విధించే జీఎస్‌‌టీలో మార్పు ఉండదు. అలానే అన్ని రకాల కార్టన్ బాక్స్‌‌లు, కేసులపై  జీఎస్‌‌టీ 18 శాతం నుంచి  12 శాతానికి తగ్గుతుంది. స్ప్రింక్లర్లు, సోలార్ కుక్కర్లను 12 శాతం  పరిధిలోకి తెచ్చారు.

3. విద్యా సంస్థలకు వెలుపల ఉన్న హాస్టల్స్ అందించే సర్వీస్‌‌లపై  జీఎస్‌‌టీ మినహాయింపు ఇచ్చారు. నెలకు హాస్టల్‌‌ ఫీజు ఒక వ్యక్తికి రూ.20 వేలు దాటకపోతేనే  ఈ మినహాయింపు అందుతుంది. 

4. ఫెర్టిలైజర్స్‌‌ సెక్టార్‌‌‌‌కు జీఎస్‌‌టీ మినహాయింపు ఇవ్వాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన సిఫార్సుపై కౌన్సిల్ మీటింగ్‌‌లో చర్చించారు. ఎరువుల తయారీ కంపెనీలకు మేలు చేసేందుకు న్యూట్రియంట్స్‌‌, రామెటీరియల్స్‌‌పై జీఎస్‌‌టీ తగ్గించాలని కెమికల్స్‌‌ అండ్ ఫెర్టిలైజర్స్‌‌ స్టాండింగ్ కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో సలహా ఇచ్చింది. ఈ అంశంపై కూడా కౌన్సిల్ మీటింగ్‌‌లో చర్చించారు. ప్రస్తుతం ఎరువులపై 5 శాతం జీఎస్‌‌టీ పడుతోంది. అదే సల్ఫ్యూరిక్ యాసిడ్‌‌, అమ్మోనియా వంటి రా మెటీరియల్స్‌‌పై 18 శాతం జీఎస్‌‌టీ వేస్తున్నారు. 45, 47 జీఎస్‌‌టీ కౌన్సిల్ మీటింగ్‌ల​లో కూడా ఎరువులపై జీఎస్‌‌టీ మినహాయింపు ఇవ్వడంపై చర్చలు జరిగాయి. తాజా మీటింగ్‌‌లో ఎరువులపై జీఎస్‌‌టీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. 

5. జీఎస్‌‌టీఆర్–4 ని ఫైల్ చేయడానికి జూన్ 30 వరకు డెడ్‌‌లైన్ పొడిగించారు.