
స్వా తంత్య్ర దినాన ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు 20 రోజుల్లో రూపుదిద్దుకొని దీపావళికన్నా ముందుగానే నవరాత్రుల మొదటిరోజు నుంచే అమలులోకి రావడం శుభపరిణామం. ఈ సంస్కరణలు సామాన్యులకు ఊరట కల్పిస్తూ వ్యాపారస్తులకు ఊతమిస్తాయి. కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసినా మొత్తం మీద అంగీకారం కుదిరింది.
జీఎస్టీ పన్నుల వ్యవస్థలో కీలక సంస్కరణలతో జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన సరళీకృతమైన రెండు స్లాబుల విధానం అమలవుతుంది. అమెరికాకు భారత ఎగుమతులు 50% సుంకాలను ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తేవడం ముదావహం.
అమెరికా సుంకాల భారం భారత ఆర్థిక వ్యవస్థపై 0.6 శాతం పాయింట్ల వరకు ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చేమో కానీ దేశీయంగా వస్తు సేవల వినిమయాన్ని పెంపొందించడం వల్ల ఈ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది. చాలావరకు రోజువారి ఖర్చులలో భాగమైన వినియోగ వస్తువులు, ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ పన్నుల తగ్గింపువలన దేశీయంగా వినిమయం పెరుగుతుంది. చిన్న మొత్తాల పొదుపుకు అవకాశం కలిగి స్థానిక పెట్టుబడులు పెరుగుతాయి.
వస్తూత్పత్తికి పెరగనున్న డిమాండ్
నూతన జీఎస్టీ విధానాల్లో ఇన్‌పుట్ ఖర్చులు తగ్గడంతో ఉత్పత్తి ఖర్చులు దిగిరావడం, మరోవైపు వినిమయ వస్తువుల ధరలు తగ్గడంతో డిమాండ్ పెరిగి దేశీయ తయారీ పుంజుకొని మేకిన్ ఇండియా బలోపేతం అవుతుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడడానికి వ్యాపారులకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. సిమెంట్, స్టీల్ పై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గి, కొనుగోళ్లు పెరిగి రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది.
కార్లు, మోటార్ సైకిళ్ల కొనుగోళ్లు పెరిగి ఆటోమొబైల్ ఇండస్ట్రీ వృద్ధి చెందుతుంది. పన్నుల భారం తగ్గించడంతో ఇప్పటికే పలు రంగాల షేర్లకు ఊతం లభించి స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది. ఇన్సూరెన్స్‌పై పన్ను తగ్గినా, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ప్రభావాల సాకుతో కంపెనీలు వినియోగదారులకు ఏమేరకు ప్రయోజనం కల్పిస్తాయో చూడాలి.
ప్రీమియం గనక చెప్పుకోదగ్గస్థాయిలో తగ్గితే సాధారణ బీమా, జీవిత బీమాలపై కవరేజ్ పెరుగుతుంది. తద్వారా అల్పాదాయ వర్గాలు కూడా ప్రైవేట్ ఆస్పత్రులలో వైద్య సదుపాయాన్ని పొందవచ్చు. తగ్గిన ఆహార పదార్థాల ధరలతో మధ్య, దిగువ తరగతి ప్రజలు కూడా మంచి నాణ్యత గల ఆహారం తినే వెసులుబాటు ఉంటుంది. ప్రజల ఆరోగ్యం, జీవన నాణ్యత పెరుగుతుంది.
జీడీపీపై ప్రభావం
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలలో పెరిగే డిమాండ్‌తో బ్యాంకుల వ్యాపారం కూడా ఊపందుకుంటుంది. ఆదాయపు పన్ను తగ్గిస్తే పన్ను కట్టేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా వినియోగ వస్తువుల ధరలు తగ్గితే కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా పెరిగే డిమాండ్, సరఫరాకు తగ్గట్టు వస్తూత్పత్తి పెరుగుతుంది.
మూలధనంపై పెట్టుబడి పెరిగే కొద్దీ దేశీయ జీడీపీ పెరిగి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఆ విధంగా దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతం అయితే దాని ప్రయోజనాలు దేశ ప్రజలకే చెందుతాయి. జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో సామాన్య ప్రజలు, రైతులు, మహిళలు, యువత, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
కొత్త విధానంతో ఆత్మనిర్భర్ భారత్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. పొగాకు, పాన్ మసాలా, ఏరేటేడ్ కూల్ డ్రింక్స్, విలాస వస్తువులు వంటి సిన్ గూడ్స్‌పై మాత్రమే 40% పన్ను భారం పడుతుంది. అటువంటి ఉత్పత్తులను, వాటి వినియోగాన్ని పరోక్షంగా నియంత్రించే చర్యలు
చేపట్టడం ఆమోదయోగ్యమే.
రిటైల్ మార్కెట్‌కు ఊతం
రిటైల్ ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉంది. దేశ జీడీపీ వృద్ధిలో మన ఎగుమతుల వాటా పెద్దగా లేదు. ట్రంప్ సుంకాల ప్రభావం 30 నుంచి 90 బేసిస్ పాయింట్ల మధ్య మాత్రమే ఉండొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
రిటైల్ ఉత్పత్తులు, వినియోగం వేగంగా విస్తరిస్తూ 2024 నాటికి అంతర్జాతీయంగా మూడో అతిపెద్ద రిటైల్ మార్కెట్‌గా భారత్ స్థిరపడుతుంది. కాబట్టి, దేశీయ వినియోగ ఆధారిత ఆర్థికవ్యవస్థగా భారత్ ఎదిగి తీరుతుంది. అయితే, కొన్ని రంగాలలో స్వావలంబన సాధించలేక దిగుమతులపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది.
పెట్రోలు డీజిల్, రక్షణ రంగ పరికరాలు, వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇవే కాకుండా బంగారు నగల వాడకం పెరిగిపోయి అనుత్పాదక బంగారాన్ని కూడా దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులు పెరిగితే, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతాయి, రూపాయి విలువ క్షీణిస్తుంది. వాణిజ్య లోటు పెరుగుతుంది.
రాష్ట్రాల ఆర్థిక స్థిరత్వానికి చేయూత
సామాన్యులకు మేలు కలిగించే జీఎస్టీ తగ్గింపు రాష్ట్రాలకు కీడు కలిగించకూడదు. తగ్గిన జీఎస్టీ పన్నుల వల్ల ఆశించే అధిక వృద్ధిరేటు, డిమాండ్ ప్రభావంతో లోటుని కొంతమేర పూడ్చగలిగినా, ఆదాయ లోటు భారీగానే ఉంటుంది. సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునే వనరులు రాష్ట్రాలకు కుదించుకుపోతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వమే ఆ లోటుని భర్తీ చేయవలసిన అవసరం ఉంది.
2017 – 2022 మధ్య కాలంలో రాష్ట్రాల జీఎస్టీ ఆదాయం 14% కంటే తగ్గితే, ఆ నష్టాన్ని కేంద్రం జీఎస్టీ పరిహార గ్రాంట్ల ద్వారా భర్తీ చేసింది. ఆ విధానాన్ని పునరుద్ధరిస్తూ రాష్ట్రాలకు కొంతమేరకు పరిహారం అందించాలి. అందు నిమిత్తం సిన్ వస్తువులపై విధించిన పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయవచ్చు.
కేంద్రం తన పన్ను ఆదాయంలో రాష్ట్రాలతో పంచుకుంటున్న 41 శాతాన్ని మార్చి రాష్ట్రాలకు అనుకూలంగా సవరించే ప్రయత్నం చేయాలి. రాష్ట్రాల ఆర్థిక సమస్యను పరిష్కరించకపోతే అది దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. జీఎస్టీ వ్యవస్థపై రాష్ట్రాల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కూడా రాష్ట్రాల ఆదాయాన్ని పరిరక్షించడం చాలా అవసరమని కేంద్రం గుర్తించాలి.
- ఆర్ సి కుమార్,సోషల్ ఎనలిస్ట్–