GST వసూళ్లు: భారీగా పెరిగిన ప్రభుత్వ ఆదాయం

GST వసూళ్లు: భారీగా పెరిగిన ప్రభుత్వ ఆదాయం

కమర్షియల్‌ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ (జీఎస్టీ శాఖ) రాబడులు పెరిగాయి. నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యానికి ఆ శాఖ చేరువైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.52,438.54 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఫిబ్రవరి నాటికి రూ.40,691 కోట్ల ఆదాయం వచ్చింది. 80 శాతం లక్ష్యానికి చేరువైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 17.18 శాతం గ్రోత్‌‌‌‌ సాధించింది.

అక్టోబర్‌ లో అత్యధికం.. మేలో అత్యల్పం
ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో మార్చిలో మరింత ఎక్కువ రాబడులు వస్తాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రూ.40,691 కోట్లు రాగా, గతేడాది ఇదే సమయానికి రూ.34,727 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది అత్యధికంగా ఆగస్టులో 38.15 శాతం గ్రోత్‌‌‌‌ రాగా, అత్యల్పంగా ఫిబ్రవరిలో 4.11శాతం మాత్రమే నమోదైంది. ఇప్పటి వరకు అక్టోబర్‌ లో అత్యధికంగా రూ.4,172 కోట్ల పన్ను రాబడులు వచ్చాయి . ఆ తర్వాత ఫిబ్రవరిలో 4,152 కోట్లు , జూలైలో 4,006 కోట్ల ఆదాయం వచ్చింది. మే నెలలో అత్యల్పంగా రూ.3,226 కోట్ల ఇన్ కమ్ వచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో అత్యధికంగా 3,988 కోట్లు , అత్యల్పంగా ఆగస్టులో రూ.2,661 కోట్లు వచ్చాయి .

45 శాతం వసూళ్లు ఎక్సైజ్‌, పెట్రోలియం నుంచే
జీఎస్టీ పరిధిలో లేకపోవడంతో పెట్రోలియం ఉత్పత్తులు, ఎక్సైజ్‌ శాఖల నుంచి ఎక్కువ శాతం ఆదాయం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం రాబడుల్లో 45 శాతం పెట్రోలియం ఉత్పత్తులు, ఎక్సైజ్‌ శాఖ నుంచే వస్తాయని అంటున్నారు. పన్ను వసూళ్లలో ఆయా వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. నిత్యం వాహనాల తనిఖీలు, దాడులు, కేసుల నమోదు చేపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4 వేలకు పైగా వాహనాలను తనిఖీ చేసి, వందకు పైగా వెహికిల్స్‌ ను అదుపులోకి తీసుకుని, యజమానులకు జరిమానా విధించారు.

ఎగవేతలకు అడ్డు కట్ట, బకాయిలపై దృష్టి పన్ను
ఎగవేతలకు అడ్డుకట్ట, పాత బకాయిలపై దృష్టి, వ్యాపారులందరినీ పన్ను పరిధిలోకి తీసుకురావడం, వాహనాల ఆకస్మిక తనిఖీలు వంటి చర్యలతో కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఆదాయం పెరిగింది. పన్నుల విధానాన్ని కంప్యూటరైజ్ చేయడం, రిటర్నులు, రీ ఫండ్ల విషయంలో సింగిల్‌ విండో విధానం, దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు కావడం కూడా రాబడి పెరుగుదలకు దోహదపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాట్‌, కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీ కలిపి పన్ను రాబడిని పెంచుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను రాబడి పెరగడం గమనార్హం.