గూడెం లిఫ్ట్​ నుంచి నీళ్లు ఇస్తరా, ఇయ్యరా?

గూడెం లిఫ్ట్​ నుంచి నీళ్లు ఇస్తరా, ఇయ్యరా?
  • జడ్పీ జనరల్ బాడీ మీటింగ్​లో నిలదీసిన సభ్యులు 
  • నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయని, ఎకరాకు రూ.20వేల నష్టం జరిగిందని ఆవేదన  
  • పైపులు మారిస్తేనే సమస్య పరిష్కారం... కడెంలోనూ నీళ్లు లేవు  
  • యాసంగికి సాగునీళ్లు రావని చెప్పకనే చెప్పిన కలెక్టర్ భారతి హోళికేరి 

మంచిర్యాల,వెలుగు: గూడెం లిఫ్ట్​ నుంచి నీళ్లు రాక యాసంగి పంటలు ఎండిపోతున్నాయని లక్సెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్​ సభ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే 70శాతం పొలాలు ఎండిపోయాయని, మిగతా 30శాతం కూడా ఎండిపోయే దశలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఈ యాసంగికి నీళ్లు ఇస్తరా, ఇయ్యరా?  రైతులకు ఏదో ఒకటి స్పష్టం చేయాలని బుధవారం జరిగిన జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్​లో అధికారులను నిలదీశారు. లిఫ్ట్​ నుంచి నీళ్లు వస్తాయనే ఆశతో రైతులు వరినాట్లు వేశారని, ఇప్పటికే ఎకరాకు రూ.20 వేలకు పైగా పెట్టుబడి నష్టపోయారని సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గూడెం లిఫ్ట్​ను మేఘా కంపెనీ సరిగా మెయింటెన్​ చేయడం లేదని, కడెం ప్రాజెక్టు అధికారులు లిఫ్ట్​ను పర్యవేక్షించడం లేదని శ్రీనివాస్​ చెప్పారు. కొన్నిచోట్ల ఇసుక పోయకుండా మట్టిలోనే పైపులు వేయడం వల్ల తరచూ పగిలిపోతున్నాయని తెలిపారు. లిఫ్ట్​ నుంచి నీళ్లు రాకుంటే కడెం ప్రాజెక్టు నుంచి రిలీజ్​ చేసి పంటలను కాపాడాలని డిమాండ్​ చేశారు. కలెక్టర్​ భారతి హోళికేరి స్పందిస్తూ... గూడెం లిఫ్ట్​ ప్రస్తుత జీఆర్పీ పైపులను తొలగించి ఎమ్మెస్​ పైపులు వేస్తేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కడెం ప్రాజెక్టులో సిల్ట్​ చేరి నీటి నిల్వ తగ్గిందని,  అక్కడినుంచి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. మేఘా కంపెనీ గూడెం లిఫ్ట్​ను సరిగా మెయింటెన్​ చేయడం లేదని, దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. జూలైలో వచ్చిన వరదల్లో లిఫ్ట్​ పూర్తిగా మునిగిపోవడంతో ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ యాసంగిలో కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగునీరు రాదన్న విషయాన్ని కలెక్టర్​ చెప్పకనే చెప్పారు.  

అధికారులపై ఎంపీ ఆగ్రహం...  

ఇరిగేషన్​ ఈఈ, జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్​ జడ్పీ మీటింగ్​కు గైర్హాజరు కావడంపై ఎంపీ వెంకటేశ్​ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరికి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్​కు సూచించారు. అధికారులు బాధ్యతరహితంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ఇకమీదట జడ్పీ చైర్​పర్సన్​ పర్మిషన్​ లేకుండా మీటింగ్​కు రాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని, సరైన కారణం లేకుండా గైర్హాజరైన వారిపై సీరియస్​ యాక్షన్​ తీసుకోవాలని కోరారు.  

నవ్వులు పూయించిన సత్తయ్య... 

ప్రతీసారి జడ్పీ మీటింగ్​లో అందరికంటే ఎక్కువగా ప్రశ్నలు వేస్తూ అధికారులను తిప్పలుపెట్టే లక్సెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య ఈసారి నవ్వులు పూయించారు. జంతు సంక్షేమం కోసం పౌరులు పాటించాల్సిన రూల్స్​ గురించి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్, కలెక్టర్​ భారతి హోళికేరి వివరించారు. ప్రకృతిలో మనుషులతో పాటు జంతువులకూ సమాన హక్కులు ఉన్నాయని, జీవాల పట్ల కరుణ కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా సత్తయ్య గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేశారు. 'గంగిరెద్దుల వాళ్లు పెంచుకుంటున్న కుక్కలు అడవిపందిని చంపితే ఫారెస్ట్​ ఆఫీసర్లు యజమానిపై కేసుపెట్టి జైలుకు పంపిన్రు. మరి కుక్కులను పెంచుకోవాలా, వద్దా' అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. సంక్రాంతి సందర్భంగా ఎడ్ల పందాలు నిర్వహించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జేడీ రమేష్​ ఎమ్మెల్యే చిన్నయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్​, నడిపెల్లి దివాకర్​రావు గైర్హాజరయ్యారు.

పీఏసీఎస్​లకు స్థలాలకు కేటాయించాలి... 

మంచిర్యాల జిల్లాలో 35 పీఏసీఎస్​లకు గాను పదింటికి సొంత బిల్డింగులు లేవని ఏడీసీసీబీ చైర్మన్​ అడ్డి భోజారెడ్డి అన్నారు. అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయని తెలిపారు. బిల్డింగుల నిర్మాణం కోసం 5గుంటలు, గోడౌన్ల కోసం అర ఎకరం స్థలాలు కేటాయించాలని కోరారు. జీవో 571 ప్రకారం సంబంధిత శాఖ కమిషనర్​ ద్వారా ప్రపోజల్స్​ పంపిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ అన్నారు. 

పెన్షన్లు, స్కూళ్లు, హాస్పిటళ్లు, రోడ్ల దుస్థితిపై చర్చ... 

జిల్లాలోని సర్కారు స్కూళ్లు, పీహెచ్​సీలు, సీహెచ్​సీలు, వెటర్నరీ హాస్పిటళ్లు, రోడ్ల దుస్థితిని ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన పేదలకు ఆసరా పెన్షన్లు రావడం లేదని, సదరం క్యాంప్​లో తిరస్కరించిన వారికి రీ అసెస్​మెంట్​ చేసి వికలాంగుల సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. విద్యాసంవత్సరం పూర్తికావస్తున్నా స్టూడెంట్లకు యూనిఫామ్స్​ రాలేదని, ఇచ్చినవి కూడా పొట్టిగా, పొడుగ్గా, లూజ్​గా ఉన్నాయని అన్నారు. ఔట్​సోర్సింగ్​ పోస్టుల నియామకాల్లో రూల్స్​ పాటించకపోవడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. మెరిట్​, రోస్టర్​ ప్రకారమే ఎంపిక చేస్తున్నామని కలెక్టర్​ చెప్పారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై అక్కడి సభ్యులు ప్రశ్నించారు. ఏండ్లు గడుస్తున్నా నీల్వాయి బ్రిడ్జి అప్రోచ్​ రోడ్లు నిర్మించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. మార్చిలోగా పెండింగ్​ పనులను పూర్తి చేస్తామని ఆర్​అండ్​బీ ఈఈ రాము, పంచాయతీరాజ్​ఈఈ ప్రకాశ్​ అన్నారు.