ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుట్టుగా నాటుసారా బట్టీలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుట్టుగా నాటుసారా బట్టీలు

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడుంబా తయారీ క్రమంగా పెరుగుతోంది. గతంలో వేలాది మందిని పొట్టనపెట్టుకున్న మహమ్మారి తిరిగి జనంలోకి రావడం కలవరపెడుతోంది. ప్రభుత్వం పునరావాసం కింద కల్పించిన ఉపాధి అవకాశాలు కొందరికే అందడంతో మిగిలినవారు నాటుసారా కాసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, తండాల్లో గుట్టుచప్పుడు తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాసం కింద ఇచ్చిన యూనిట్లను కొందరు అమ్ముకుని మళ్లీ పాత బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకపోవడమే గుడుంబా తయారీ బట్టీలు పెరగడానికి కారణమని జనం మండిపడుతున్నారు. 

గుర్తించి వదిలేశారు

గతంలో గుడుంబాతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో నాటుసారాను పూర్తిగా నియంత్రించేందుకు ఐదేండ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం జీఈపీఆర్ఎస్(గుడుంబా ఎఫెక్టెడ్​పర్సన్స్ రిహాబిలిటేషన్ స్కీమ్) తీసుకొచ్చింది. గుడుంబా తయారు చేస్తున్న కుటుంబాలను గుర్తించి ఇతర ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఉమ్మడి జిల్లాలో తయారీదారులు వేల సంఖ్యలో ఉండగా, ప్రభుత్వ నిబంధనలు, కేటాయించిన బడ్జెట్ మేరకు అధికారులు కేవలం 1,438 మంది మాత్రమే స్కీమ్​పొందేందుకు అర్హులని తేల్చారు. వీరిలో వరంగల్ అర్బన్ జిల్లాలో 236, వరంగల్ రూరల్ లో 123,  జనగామ 213, మహబూబాబాద్ 455,  భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి 411 మంది ఉన్నారు. వీరందరికీ ఒక్కో యూనిట్​కు రూ.2 లక్షలు కేటాయిస్తూ దాదాపు రూ.28.76 కోట్లతో కిరాణషాపులు, సెంట్రింగ్​కర్రల షాపులు, ఆటోలు, మినీ డెయిరీలు, గొర్రెలు, మేకలు, టెంట్ హౌజ్ లు మంజూరు చేశారు.

మళ్లీ మొదటికొచ్చింది

ఎక్సైజ్ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలల్లో గుడుంబా తయారీదారులు ఉన్నట్లు గుర్తించినా ప్రయారిటీ ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే అప్పట్లో ఎంపిక చేసినవారిలో చాలా మందికి యూనిట్​అమౌంట్​అందలేదని, క్షేత్రస్థాయిలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ సాయం పొందని వారితోపాటు, వచ్చిన యూనిట్లను ఇతరులకు అమ్ముకున్నవారు తిరిగి నాటుసారా కాస్తున్నారు. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో గుడుంబా ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్, జనగామ, హనుమకొండ జిల్లాల్లోని గ్రామాలు, తండాల్లో నాటుసారా కాస్తుండడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లు స్పష్టమవుతోంది. 

వేర్వేరు గోదాంల నుంచి బెల్లం

గుడుంబా తయారీకి కావాల్సిన బెల్లాన్ని చుట్టుపక్కల జిల్లాలతోపాటు వరంగల్ లోని కొన్ని గోదాంల నుంచి తీసుకొస్తున్నట్లు సమాచారం. కొంతమంది వ్యాపారులు గుట్టుగా దందా కొనసాగిస్తున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ సమీపంలో రెండు చోట్ల గోదాంలు ఏర్పాటు చేసి చుట్టుపక్కల తండాలతోపాటు ధర్మసాగర్ మండలంలోని తండాలకు చేరవేస్తున్నట్లు తెలిసింది. నర్సంపేట, తొర్రూరు, పరకాల, రఘునాథపల్లి ఏరియాల్లోనూ ఇదే విధంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఎక్సైజ్ ఆఫీసర్ల తనిఖీల్లో దొరికినవారిని బైండోవర్ చేసి కేసులు పెడుతున్నా నాటుసారా తయారీ ఆగడం లేదు. సంబంధిత అధికారులు, ప్రభుత్వ పెద్దలు మహమ్మారిని తరిమికొట్టడానికి చర్యలు తీసుకోవాలని జనం విజ్ఞప్తి చేస్తున్నారు. 

బైండోవర్​చేసి కేసులు పెడుతున్నం

మహబూబాబాద్, జయశంకర్​భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గుడుంబా తయారు చేస్తున్నట్లు తెలిసింది. 10 రోజుల నుంచి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాం. బైండోవర్ చేస్తూ.. కేసులు పెడుతున్నాం. వరంగల్ కమిషనరేట్​లో పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో పునరావాసం కల్పించి నాటుసారా తయారీని నియంత్రించాం. తాజా పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక పంపించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. 
- అంజన్​రావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్