స్కూళ్లు, కాలేజీలు చాల్జేస్తున్నరు సరే.. సార్లేరీ

స్కూళ్లు, కాలేజీలు చాల్జేస్తున్నరు సరే.. సార్లేరీ
  • 12 వేల విద్యా వాలంటీర్లను రెన్యువల్​ చేయలే
  • కాలేజీల్లో గెస్టు లెక్చరర్లు, మోడల్ స్కూళ్లలో అవర్లీ బేస్డ్​ టీచర్లదీ అదే పరిస్థితి
  • 28 వేల మంది స్వచ్ఛ కార్మికులనూ డ్యూటీలోకి తీసుకోలే


ఇన్నాళ్లూ మూతపడ్డ స్కూళ్లు, కాలేజీలన్నీ ఇంకో నాలుగైదు రోజులైతే చాలైతయ్​. కానీ,  ఏడ చూసినా చదువులు చెప్పనీకి టీచర్లు,  లెక్చరర్లు సరిపోయేంత లేరు. సెప్టెంబర్​ ఒకటో తారీఖు నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్​ చేసుకోవాలని చెప్పిన సర్కారు.. ఫ్యాకల్టీ నియామకం ఊసెత్తడం లేదు. విద్యా వాలంటీర్లను రెన్యువల్​ చేస్తలేదు. అవర్లీ బేస్డ్​ టీచర్లది, గెస్టు లెక్చరర్లదీ ఇదే పరిస్థితి. ఇట్లయితే పిల్లలకు చదువులెట్ల అందుతయని తల్లిదండ్రులకు మనాది పట్టుకుంది. మరో దిక్కు బడులను క్లీన్​ చేసే స్వచ్ఛ కార్మికులను కూడా సర్కారు డ్యూటీలోకి తీసుకోవడం లేదు. గ్రామ పంచాయతీ  కార్మికులతోటే పనులు చేయించుకోవాలని చెప్తున్నది. అందుకు పంచాయతీ కార్మికులు ఒప్పుకోవడం లేదు. దీంతో కరోనా టైంలో స్కూళ్లు నీటుగా లేకుంటే తమ పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని తల్లిదండ్రులు భయపడుతున్నరు. 

హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ కేంద్రాలతోపాటు కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడం లేదు. గురువారం నుంచి టీచర్లు, లెక్చరర్లను బడులకు రమ్మని చెప్పిన సర్కారు.. విద్యావాలంటీర్లను, అవర్లీ బేస్డ్ టీచర్ల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. గెస్ట్​ లెక్చరర్లను రావొద్దని ఇంటర్మీడియెట్ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యా వాలంటీర్లు, గెస్టు లెక్చరర్లు లేనిదే చాలా స్కూళ్లు, కాలేజీలు నడిచే పరిస్థితి లేదు. అలాంటిది వారిని డ్యూటీల్లోకి తీసుకోకపోవడం 
సమస్యగా మారింది.  
హైస్కూల్​ నుంచే స్టార్ట్​ చేయాలని చెప్పినా..!
కరోనా ఎఫెక్ట్​తో గతేడాది మార్చిలో మూతపడ్డ స్కూళ్లు, కాలేజీలు మళ్లీ ఫిబ్రవరిలో తెరుచుకున్నాయి. కేవలం నెలరోజుల పాటు హైస్కూల్  ఆపై క్లాసులకే  ఫిజికల్ పాఠాలు జరిగాయి. కరోనా సెకండ్ వేవ్​తో పాజిటివ్ కేసులు పెరగడంతో మళ్లీ స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. ఇప్పుడు కరోనా తగ్గడంతో ఫిజికల్ క్లాసులు స్టార్ట్​ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం ముందుగా టీచర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని హైస్కూల్​ లెవెల్​ నుంచి ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేయాలని సర్కారుకు ప్రతిపాదనలు పెట్టారు.
నిరుటి నుంచి 
12 వేల మంది విద్యా వాలంటీర్లను ప్రభుత్వం రెన్యువల్​ చేయడం లేదు. వాళ్లకు ఇవ్వాల్సిన రూ.6 కోట్ల జీతాలను కూడా చెల్లించడం లేదు. టీచర్ల రేషనలైజేషన్​ ప్రక్రియతో వీరిని పూర్తిగా పక్కనపెట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లుండగా.. వెయ్యిమంది వరకూ అవర్లీ  బేస్డ్ టీచర్లు పనిచేసేవారు. 17 మోడల్  స్కూళ్లలోనైతే అవర్లీ బేస్డ్ టీచర్లే దిక్కు. నిరుటి నుంచి వీళ్లనెవరినీ రెన్యువల్​ చేయడం లేదు. రాష్ట్రంలో 405 సర్కారు జూనియర్ కాలేజీల్లో 1,700 మంది గెస్టు లెక్చరర్లు ఉన్నారు. వీళ్లు ఉంటేనే కాలేజీలు నడిచే పరిస్థితి. ఇప్పుడు వీళ్లను డ్యూటీకి రావొద్దని ఇంటర్​ బోర్డు ఆదేశించింది. సర్కారు బడుల్లో 28 వేల మంది స్వచ్ఛ కార్మికులు పనిచేసేవారు. నిరుటి నుంచి వీరిని సర్కారు పక్కనపెట్టింది. 

సీఎం కేసీఆర్ మాత్రం అంగన్ వాడీల నుంచి పీజీ కాలేజీల వరకు అన్నింటిలో ఫిజికల్​ క్లాసులకు అనుమతి ఇచ్చారు. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అంటే కేవలం క్లాస్ రూములు ఓపెన్​ చేయడమే అన్నట్లు సర్కారు తీరు ఉందని పేరెంట్స్​ విమర్శిస్తున్నారు. ఫ్యాకల్టీ కొరతపై ఇప్పటికీ ప్రభుత్వం ఒక్క మీటింగ్ కూడా పెట్టిన దాఖలాలు లేవు. 
విద్యా వాలంటీర్లకు మంగళమేనా..?
రాష్ట్రంలో 26,050 సర్కారు స్కూళ్లున్నాయి. వాటిలో 2019–20 అకడమిక్ ఇయర్​లో 15 వేల మందికి పైగా విద్యా వాలంటీర్లను ప్రభుత్వం తీసుకున్నది. అప్పుడే టీఆర్టీ 2017 ద్వారా కొత్త టీచర్లు రావడంతో మూడు వేలమంది విద్యా వాలంటీర్లను తప్పించారు. 2020 మార్చి నెలాఖరులో కరోనాతో స్కూళ్లు మూతపడగా, అప్పటి నుంచి ఇప్పటి వరకూ మిగిలిన 12 వేల మంది విద్యా వాలంటీర్లను రెన్యువల్​ చేయలేదు. 2020–21కి సంబంధించి ఫిబ్రవరిలో స్కూళ్లలో ఫిజికల్ క్లాసులు స్టార్టయినా.. ఎస్జీటీలతో ఆ నెలరోజులు  క్లాసులు చెప్పించారు. అంతేగానీ విద్యా వాలంటీర్లను మాత్రం రెన్యువల్ చేయలేదు. కనీసం ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు ఇచ్చినట్టు నెలకు రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం కూడా వీళ్లకు ఇవ్వలేదు. రాష్ట్రంలో 2019–20కి సంబంధించి ఇంకా విద్యా వాలంటీర్లకు రూ. 6 కోట్ల వరకు జీతాల బకాయిలున్నాయి. ప్రస్తుతం టీచర్ల రేషనలైజేషన్​ ప్రక్రియతో విద్యా వాలంటీర్లను పూర్తిగా పక్కనపెట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మరోపక్క వీరి అవసరముంటే తీసుకుంటామని స్కూల్ ఎడ్యుకేషన్​ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పారు. 
అవర్లీ బేస్డ్ టీచర్లనూ తీసుకోలే
రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లుండగా.. వాటిలో వెయ్యిమంది వరకూ అవర్లీ  బేస్డ్ టీచర్లు పనిచేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఈ టీచర్లనూ ప్రభుత్వం నిరుడు రెన్యువల్ చేయలేదు. పలు జిల్లాల్లోని 17 మోడల్  స్కూళ్లలో ఒక్క రెగ్యులర్ టీచర్ కూడా లేరు. అక్కడ అవర్టీ బేస్డ్ టీచర్లే ఉన్నారు. అయితే 2020–21 అకడమిక్ ఇయర్​లో మూడు నెలల పాటు తీసుకుంటామని అధికారులు వారికి హామీ ఇచ్చి, కొనసాగాలని కోరినా ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా వారిని కొనసాగించాలా.. లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. 
గెస్ట్ లెక్చరర్లు లేకుండా పాఠాలెట్ల..? 
రాష్ట్రంలో 405 సర్కారు జూనియర్ కాలేజీల్లో 1,700 మంది గెస్టు లెక్చరర్లు ఉన్నారు. చాలా కాలేజీలు గెస్టు లెక్చరర్లు లేకుండా నడవడం కష్టం. ఆన్​లైన్ క్లాసుల టైమ్​లో వీరిని పక్కన పెట్టినా.. గత అకడమిక్​ ఇయర్​లో  ఫిజికల్ క్లాసులు స్టార్టయినప్పుడు తప్పనిసరై ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు వీరిని రీ ఎంగేజ్​ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తర్వాత మళ్లీ పక్కన పెట్టారు. కనీసం పనిచేసిన కాలానికి సంబంధించిన ఆ మూడు నెలల జీతం కూడా ఇప్పటికీ  ఇవ్వలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమవుతున్నందున మళ్లీ రీఎంగేజ్ చేస్తారని వారంతా ఆశతో ఉన్నారు. కానీ బుధవారం ఇంటర్మీడియట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో గెస్టు లెక్చరర్లు మినహా అందరూ గురువారం నుంచి డ్యూటీకి  రావాలని ఉంది. 
స్వచ్ఛ కార్మికులను రెన్యువల్​ చేయక..
సర్కారు బడుల్లో నిరుడు మార్చి వరకూ 28 వేల మంది స్వచ్ఛ కార్మికులు పనిచేసేవారు. వారికి నెలకు రూ. 2,500 ఇచ్చినా.. బడులను క్లీన్ చేసేవారు. అయితే నిరుడు కరోనా ఎఫెక్ట్​తో వారిని పక్కనపెట్టారు. గత అకడమిక్ ఇయర్​లో​ ఫిజికల్ క్లాసులు కొనసాగిన నెలరోజుల పాటు గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ వర్కర్లతో పనిచేయించుకోవాలని సర్కారు ఆదేశాలిచ్చింది. కానీ చాలా స్కూళ్లలో వాళ్లు ముందుకు రాలేదు. ఈ ఏడాది కూడా స్వచ్ఛ కార్మికులను రెన్యువల్ చేసే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. నిరుటి మాదిరిగానే ఈసారి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ వర్కర్లతో పనులు చేయించుకోవాలని హెడ్మాస్టర్లకు సూచిస్తున్నారు.  కరోనా టైమ్​లో శుభ్రంగా ఉంచాల్సిన బడులను, ఇలా గాలికి వదిలిస్తే కరోనా కేసులు పెరిగే అవకాశముందని టీచర్లు చెప్తున్నారు. వెంటనే కార్మికులను రెన్యువల్ చేయాలని వారు కోరుతున్నారు.