హార్దిక్  పటేల్కు ఆప్ ఆహ్వానం

హార్దిక్  పటేల్కు ఆప్ ఆహ్వానం
  • పార్టీ మారేదిలేదని స్పష్టం చేసిన హార్దిక్ పటేల్
  • జగదీశ్ ఠాగూర్ చొరవతో ముగిసిన వివాదం

గాంధీనగర్: గుజరాత్ కాంగ్రెస్ లో అంతర్గత పోరు మొదలైంది. ఆ పార్టీలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ పార్టీని వీడనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో... ఆమ్ ఆద్మీ పార్టీ హార్దిక్  పటేల్ను తమ పార్టీలోకి ఆహ్మానించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా హార్దిక్ పటేల్ ను తమ పార్టీలో చేరాలని కోరారు. ‘హార్దిక్ లాంటి మంచి వ్యక్తులకు కాంగ్రెస్ లో విలువ లేదు. పార్టీలో తననెవరూ పట్టించుకోవడంలేదని అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదు. అనవసరంగా సమయం వృధా అవుతుంది. ఆప్ లోకి రండి. మీకు తగిన ప్రాధాన్యత ఉంటుంది’ అని గోపాల్ ఇటాలియా అన్నారు.

ఇక తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను హార్దీక్ పటేల్ కొట్టిపారేశారు. ‘ఇవన్నీ రూమర్లు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తేలేదు. పార్టీలో చిన్న చిన్న అభిప్రాయభేదాలు వస్తుంటాయి. అంత మాత్రానికే పార్టీ మారుతున్నాననడం సరికాదు. ఇప్పటి వరకు పార్టీ కోసం అహర్నిశలు పని చేశా. ఇక ముందు కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను’ అని హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. కాగా.. పార్టీలో తననెవరూ పట్టించుకోవడంలేదని, పార్టీ మీటింగ్ లకు పిలవడంలేదని హార్దిక్ పటేల్ ఇటీవల మీడియా సమావేశం పెట్టి మరీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్... హార్దిక్ తో చర్చించి భవిష్యత్ లో అలాంటివి జరగకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో సమస్యకు ఫుల్ స్టాప్ పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

ఇవి కూడా చదవండి...

కింగ్ కోఠి ప్యాలెస్ స్వాధీనం కోసం దాడులు చేస్తుండ్రు

హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు

ఈశ్వరప్పను అరెస్ట్ చేయాల్సిందే