తొలిసారి ఐపీఎల్‌ బరిలో గుజరాత్‌, లక్నో జట్లు

తొలిసారి ఐపీఎల్‌ బరిలో గుజరాత్‌, లక్నో జట్లు
  • ఆశలన్నీ రాహుల్‌, పాండ్యాపైనే
  • రషీద్‌, స్టోయినిస్‌ కీలకం..

ఐపీఎల్‌‌‌‌లోకి అడుగుపెడుతూనే సంచలనాలు సృష్టించిన రెండు కొత్త ఫ్రాంచైజీలు గుజరాత్‌‌ టైటాన్స్‌‌, లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ .. ఇప్పుడు ఆటపై దృష్టి పెట్టాయి..! మెగా ఆక్షన్‌‌లో అన్ని ఫ్రాంచైజీల కంటే దూకుడుగా వ్యవహరించి.. పక్కా ప్రణాళికలతో సరికొత్త ప్లేయర్లను తీసుకున్న టైటాన్స్‌‌, సూపర్‌‌ జెయింట్స్‌‌ అరంగేట్రంలోనే ట్రోఫీతో అద్భుతం చేయాలని భావిస్తున్నాయి..! మెగా లీగ్‌‌పై తమదైన ముద్ర వేసిన ఇద్దరు స్టార్లు హార్దిక్‌‌ పాండ్యా, కేఎల్‌‌ రాహుల్‌‌ను కెప్టెన్లుగా ఎంచుకుని తొలి అడుగు ఘనంగా వేశాయి..! ఇక పేపర్‌‌ మీద టీమ్‌‌ కాంబినేషన్స్‌‌ అన్నీ బాగానే కనిపిస్తున్నా.. అసలు సమరంలో ఎంతవరకు సత్తా చూపిస్తాయో చూడాలి..!  ఓవరాల్‌‌గా వేలాది కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసి మెగా లీగ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ రెండు ఫ్రాంచైజీలకు ఫస్ట్‌‌ ట్రోఫీని సాధించే బలమైన బలగాలు ఉన్నాయా? లేదా? ఓ లుక్కేద్దాం..!!

వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌: గుజరాత్‌‌ టైటాన్స్‌‌ అంటే ఇప్పుడు ప్రధానంగా ముగ్గురు ప్లేయర్లు గుర్తుకొస్తున్నారు. కెప్టెన్‌‌గా హార్దిక్‌‌ పాండ్యా (రూ. 15 కోట్లు), స్టార్‌‌ స్పిన్నర్‌‌గా రషీద్‌‌ ఖాన్‌‌ (రూ. 15 కోట్లు), యంగ్‌‌ ఓపెనర్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (రూ. 8 కోట్లు)తో టీమ్‌‌ను ఫామ్‌‌ చేసుకున్న టైటాన్స్‌‌ కోర్‌‌ టీమ్‌‌ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపెట్టలేదు. ఫెర్గుసన్‌‌, రాహుల్‌‌ తెవాటియా, మహ్మద్‌‌ షమీని భారీ ధరకు దక్కించుకున్నా.. వీళ్లంతా సింగిల్‌‌ మ్యాచ్‌‌ హీరోలే. మెగా లీగ్‌‌లో ఉండే ఒత్తిడిని తట్టుకుని ముందుకెళ్లాలంటే కచ్చితంగా నిలకడ అవసరం. గుజరాత్‌‌ టీమ్‌‌లో ఆ నిలకడ చూపే ఆటగాళ్ల కొరత కనిపిస్తున్నది.  

బలాలు: హార్దిక్‌‌, రషీద్‌‌ టైటాన్స్‌‌కు అతిపెద్ద బలం. వీరిద్దరికి లీగ్‌‌లో ఆడిన అనుభవం కూడా ఎక్కువే. టాప్‌‌ ఆర్డర్‌‌లో గిల్‌‌, మిల్లర్‌‌, గుర్బాజ్‌‌లలో ఒకరిద్దరు రాణించినా.. మిగతా కథంతా పాండ్యా నడిపించగలడు. మిడిల్‌‌, లోయర్‌‌ ఆర్డర్‌‌కు వారథిగా ఉంటూ మ్యాచ్‌‌ ఫినిష్‌‌ చేయడంలో పాండ్యా దిట్ట. తెవాటియా, విజయ్‌‌ శంకర్‌‌ నుంచి కొద్దిగా సహకారం అందితే చాలు. ఈ టీమ్‌‌లో 9 మంది ఆల్‌‌రౌండర్లు ఉండటం అతిపెద్ద సానుకూలాంశం. పిచ్‌‌ ఎలా ఉన్నా వికెట్లు తీయడంలో రషీద్‌‌ అందరికంటే ముందుంటాడు. పేసర్లుగా షమీ, ఫెర్గుసన్‌‌ చెలరేగితే టైటాన్స్‌‌ నాకౌట్‌‌ వరకు చేరొచ్చు. 
బలహీనతలు: టీమ్‌‌ మొత్తానికి వెన్నెముకగా కనిపిస్తున్న పాండ్యా ఫిట్‌‌నెస్‌‌ అతిపెద్ద బలహీనత. వెన్ను సర్జరీ తర్వాత మునుపటి స్థాయిలో బౌలింగ్‌‌ చేయలేకపోతున్నాడు. దీంతో ఆల్‌‌రౌండర్‌‌గా కంటే స్పెషలిస్ట్‌‌ బ్యాటర్‌‌గానే ప్రభావం చూపిస్తున్నాడు. ఇది ప్రతికూలాంశం. ఇప్పుడు కెప్టెన్సీ ఒత్తిడి కూడా ఉండబోతున్నది. కాబట్టి హార్దిక్‌‌ ఎలా ఆడతాడన్నది చాలా ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌‌ పవర్‌‌ హిట్టర్‌‌ జేసన్‌‌ రాయ్‌‌ లేకపోవడం లోటుగా కనిపిస్తున్నది. అతని ప్లేస్‌‌లో వచ్చిన గుర్బాజ్‌‌కు ఎక్స్‌‌పీరియెన్స్‌‌ తక్కువ. మరో హిట్టర్‌‌గా మిల్లర్‌‌ ఉన్నా.. అతడు ఎప్పుడు ఆడతాడో అతనికే తెలియని పరిస్థితి. విజయ్‌‌ శంకర్‌‌, తెవాటియాలో నిలకడ ఉండదు. రషీద్‌‌కు ప్రత్యామ్నాయంగా సెకండ్‌‌ స్పిన్నర్‌‌ లేడు. జయంత్‌‌ యాదవ్‌‌ ఉన్నా.. అతనిపై నమ్మకం పెట్టే చాన్స్‌‌ లేదు. 

పాజిటివ్ గా ముందుకెళ్తా
సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని అనుకుంటున్నట్లు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ విక్టరీనే లక్ష్యంగా టీమ్ ను నడిపిస్తానని చెప్పాడు. గాయంతో టీమిండియాకు దూరమైన పాండ్యా ఇటీవలే ఫిట్ నెస్ నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టీమ్ కు కెప్టెన్ గా ఉన్న పాండ్యా.. ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగిపోయాడు. ‘ఫ్యామిలీకి తగిన సమయం కేటాయిస్తూ.. ఎప్పటిలాగే ప్రాక్టీస్ లోనూ కష్టపడుతున్నా. వాస్తవాన్ని గ్రహించి, పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లాలని చూస్తున్నా. దీనిని కమ్ బ్యాక్ గా భావించట్లేదు. నా నియంత్రణలో ఉన్న వాటిపై ఫోకస్ చేస్తూ గుజరాత్ టీమ్ విక్టరీకి కృషి చేస్తా. ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. హార్డ్ వర్క్ అనేది విజయాన్ని అందివ్వదని గ్రహించా. సరైన విధానంలో ముందుకెళితేనే విక్టరీ వస్తుందని తెలుసుకున్నా. ముంబై ఇండియన్స్ కు చాలా కృతజ్ఞుడిని. ఆ టీమ్ వల్లే నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగా. ప్రస్తుతం కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా’ అని పాండ్యా వెల్లడించాడు.

టీమ్: ఇండియన్స్ : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గిల్, సాహా, విజయ్ శంకర్, గుర్ కీరత్ మన్, షమీ, రాహుల్ తెవాటియా, దర్శన్ నల్కండే, వరుణ్ అరోన్, అభినవ్ సదరంగణి, ప్రదీప్ సంగ్వాన్, యశ్ దయాల్, సాయి సుదర్శన్, సాయి కిశోర్, జయంత్ యాదవ్.
విదేశీ ప్లేయర్లు: రషీద్ ఖాన్, మిల్లర్, డొమినిక్ డ్రేక్స్, గుర్బాజ్, మాథ్యూ వేడ్, అల్జారి జోసెఫ్, ఫెర్గుసన్, నూర్ అహ్మద్. 
ఎవరితో ఎన్ని మ్యాచ్ లు 
గ్రూప్‑బిలో ఉన్న గుజరాత్.. అదే గ్రూప్ లో ఉన్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్ తో పాటు గ్రూప్–ఎలోని లక్నోతో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ముంబై, కోల్ కతా, రాజస్థాన్, ఢిల్లీతో ఒక్కో మ్యాచ్ లో తలపడుతుంది.

లక్నోకు ‘లక్‌‌‌‌’ వరిస్తుందా?
2016, 17 సీజన్లలో రైజింగ్‌‌ పుణె సూపర్‌‌ జెయింట్స్‌‌ను నడిపించిన అనుభవంతో  సంజీవ్‌‌ గోయెంకా.. మెగా లీగ్‌‌ కోసం అతిపెద్ద సాహసం చేశాడు. రూ. 7,090 కోట్లతో లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ టీమ్‌‌ను కొనుగోలు చేసి క్రికెట్‌‌ వర్గాల్లో చర్చకు తెరలేపాడు. దానికి తగ్గట్లుగానే రాహుల్‌‌ (రూ. 17 కోట్లు)ను కెప్టెన్‌‌గా తీసుకుని మరో అడుగు ముందుకేశాడు. ఇక మెగా వేలంలోనూ పక్కా స్ట్రాటజీతో బలమైన ప్లేయర్లను తీసుకున్నా.. ఎక్స్‌‌ ఫ్యాక్టర్‌‌ ప్లేయర్‌‌ లేకపోవడమే లోటు. 

బలాలు: కెప్టెన్‌‌గా, ఓపెనర్‌‌గా, వికెట్‌‌ కీపర్‌‌గా రాహుల్​ త్రిపాత్రాభినయానికి రెడీగా ఉన్నాడు. గత సీజన్‌‌లో కొద్దిలో మిస్‌‌ అయిన ఆరెంజ్‌‌ క్యాప్‌‌ను ఈసారి ఒడిసిపట్టాలని టార్గెట్‌‌ పెట్టుకున్నాడు. సునామీలా విరుచుకుపడే మరో ఓపెనర్‌‌ క్వింటన్‌‌ డికాక్‌‌ ఉండటం ప్లస్‌‌ పాయింట్‌‌. స్టోయినిస్‌‌, హోల్డర్‌‌ రూపంలో నాణ్యమైన ఆల్‌‌రౌండర్లు ఉన్నారు. స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్‌‌, క్రునాల్‌‌ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్‌‌, దీపక్‌‌ హుడా బంతితో పాటు బ్యాట్‌‌తోనూ రాణించే సత్తా ఉంది. ఇండియన్‌‌ పేసర్‌‌ ఆవేశ్‌‌ ఖాన్‌‌పై భరోసా పెట్టుకోవచ్చు. 

బలహీనతలు: పొట్టి ఫార్మాట్‌‌లో రాహుల్‌‌ బ్యాటింగ్‌‌కు తిరుగులేదు. కానీ కెప్టెన్సీ ఒత్తిడి వల్ల గత రెండు సీజన్లలో స్లో స్ట్రయిక్‌‌ రేట్‌‌ నమోదు చేయడంతో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో ఆడితే ప్రమాదం తప్పదు. మనీశ్‌‌ పాండేది కూడా అదే సమస్య. కీలక మ్యాచ్‌‌ల్లో వీళ్ల స్ట్రయిక్‌‌ రేట్‌‌ నెమ్మదిస్తే టీమ్‌‌ స్కోరుపై తీవ్ర ప్రభావం చూపించే చాన్స్‌‌ ఉంది. రాహుల్‌‌, పాండే, డికాక్‌‌, ఎవిన్‌‌ లూయిస్‌‌లాంటి నలుగురు స్పెషలిస్ట్‌‌ బ్యాటర్లు మాత్రమే ఉండటం మైనస్‌‌. ఎక్స్‌‌ ఫ్యాక్టర్‌‌గా భావించే నాలుగో ప్లేస్‌‌లో ఆడే కీ బ్యాటర్‌‌ ఎవరనేది తేలాల్సి ఉంది. డొమెస్టిక్‌‌ టోర్నీలో గొడవపడిన  క్రునాల్‌‌, దీపక్‌‌ హుడా మధ్య సమన్వయం కుదురుతుందా? చూడాలి. 

టీమ్: ఇండియన్స్: రాహుల్ (కెప్టెన్​), మనన్ వోహ్రా, మనీశ్ పాండే, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కె.గౌతమ్, కరణ్ శర్మ, క్రునాల్, అంకిత్ రాజ్ పుత్, ఆవేశ్ ఖాన్, మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్, బిష్ణోయ్, షాబాజ్ నదీమ్. 
విదేశీ ప్లేయర్లు: దుశ్మంత చమీర, స్టోయినిస్, కైల్ మేయర్స్, హోల్డర్, డికాక్, ఎవిన్ లూయిస్
ఎవరితో ఎన్ని మ్యాచ్ లు
గ్రూప్‑ఎలో ఉన్న లక్నో.. అదే గ్రూప్ లోని ముంబై, కోల్ కతా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు గ్రూప్‑బిలోని గుజరాత్ తో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్ తో ఒక్కో మ్యాచ్ లో తలపడుతుంది.