సన్యసించేందుకు..200 కోట్ల ఆస్తులు దానం

సన్యసించేందుకు..200 కోట్ల ఆస్తులు దానం
  • నోట్లు పంచిన గుజరాత్ దంపతులు

సూరత్: జైన మతానికి చెందిన ఆ దంపతులు రూ.200 కోట్లకు అధిపతులు. అంతటి సంపద ను ప్రజలకు దానమిచ్చి సన్యాసం స్వీకరించారు భవేశ్  భండారీ, ఆయన భార్య. గుజరాత్ లోని హిమ్మత్ నగర్​కు చెందిన కన్ స్ట్రక్షన్  వ్యాపారి భవేశ్, ఆయన భార్య ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ మొత్తం సంపదను (ఫోన్లు, ఏసీలతో పాటు) దానంగా ఇచ్చారు. వారి కూతురు (19), కొడుకు (16) కూడా 2022లో సన్యాసం తీసుకున్నారు. 

పిల్లల అడుగుజాడల్లోనే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా నడుస్తున్నారు. తమ పిల్లలను స్పూర్తిగా తీసుకొని భవేశ్  దంపతులు కూడా సన్యాస దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నారని భవేశ్ బంధువులు తెలిపారు. ఈ నెల 22న ప్రతిజ్ఞ చేసి తమతో ఉన్న అన్ని బంధాలను వారు తెంపుకోనున్నారు. భిక్షపాత్ర తీసుకొని దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. దానధర్మాల మీద ఆధారపడి మాత్రమే బతకనున్నారు. భవేశ్  దంపతులు సన్యాసం తీసుకుంటున్నారని వార్త తెలిసి గుజరాత్ ప్రజలు ఆశ్చర్యపోయారు. కాగా, అంతకుముందు భవర్ లాల్  జైన్ అనే బిలియనీర్ కూడా కోట్ల సంపదను దానంచేసి సన్యాసం తీసుకున్నారు. నిరుడు గుజరాత్​లోనే ఓ డైమండ్ వ్యాపారి, ఆయన భార్య సన్యాసం పుచ్చుకున్నారు. అంతకుముందు అంటే 2017లోనే వారి కొడుకు సన్యాస దీక్ష తీసుకున్నాడు.