OMG: గుజరాత్‌లో హంసఫర్ రైల్లో మంటలు

OMG: గుజరాత్‌లో హంసఫర్ రైల్లో మంటలు

తిరుచ్చిరాపల్లి - శ్రీ గంగానగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు అంటుకున్నాయి. శనివారం(సెప్టెంబర్ 23) మధ్యాహ్నం గుజరాత్‌లోని వల్సాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. జనరేటర్ కోచ్ పక్కన ఉన్న ప్యాసింజర్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రాణభయంతో అక్కడి నుండి పరుగులు తీశారు. 

షార్ట్ సర్క్యూట్ కారణంగా పవర్ కోచ్‌లో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న బి1 కోచ్‌కు వ్యాపించాయని స్థానిక పోలీసు సూపరింటెండెంట్ కరణ్‌రాజ్ వాఘేలా తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సదరు పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఆయన తెలిపారు.

కాగా, రెండు నెలల క్రితం ఒడిశాలోని బాలాసోర్ లో చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. వందలాది ప్రాణాలు బలిగొన్న ఆ విషాదకర దృశ్యాలు ఇప్పటికి మన కళ్ళముందు తేలియాడుతూనే ఉన్నాయి. ఇలా ఒకటి మగసింది అనుకునేలోపు మరొక రైలు ప్రమాదం చోటుచేసుకోవడం రైల్వే ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది.