19 మంది విద్యార్ధుల దుర్మరణం.. రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా

19 మంది విద్యార్ధుల దుర్మరణం.. రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా

గుజరాత్ రాష్ట్రంలో సూరత్ లోని సర్తానా ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యార్ధుల సంఖ్య 19 కి చేరింది. ఓ భవనంలోని రెండవ అంతస్థులోని ఓ కోచింగ్ సెంటర్ లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.  విద్యార్థులు ఆ మంటల నుంచి తమ ప్రాణాలను దక్కించుకొనే క్రమంలో అక్కడ నుండి కిందకు దూకడంతో ఎనిమిదిమంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మరో పదకొండు మంది చికిత్స పొందుతూ మరణించగా మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. మంటల్లో చిక్కుకున్న విద్యార్థులకు కాపాడేందుకు అధికారులు 20 అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు.

ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించిన  సీఎం విజయ్ రూపానీ మృతి చెందిన విద్యార్థులకు నాలుగు లక్షల చూపున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు. ప్రభావిత వ్యక్తులు, కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారులకు సూచించారు.