బెయిల్​ వచ్చినా మూడేండ్లు జైల్లోనే..

బెయిల్​ వచ్చినా మూడేండ్లు జైల్లోనే..

న్యూఢిల్లీ: అధికారుల నిర్లక్ష్యం ఓ ఖైదీకి శాపంగా మారింది. కోర్టు బెయిల్ ఇచ్చినా.. అందుకు సంబంధించిన ఈమెయిల్ ఆర్డర్ కాపీని అధికారులు ఓపెన్ చేయకపోవడంతో అతడు అదనంగా మూడేండ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన గుజరాత్ లో వెలుగు చూసింది. ఓ హత్య కేసులో దోషిగా తేలిన 27 ఏండ్ల చందన్ జీ ఠాకూర్‌‌‌‌ జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, 2020 సెప్టెంబర్ 29న అతని శిక్షను గుజరాత్ హైకోర్టు నిలిపివేసి, బెయిల్ మంజూరు చేసింది.

ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీని జైలు అధికారులకు ఈమెయిల్ చేసింది. కానీ, జైలు ఆఫీసర్లు మాత్రం ఈమెయిల్ ద్వారా పంపిన బెయిల్ ఆర్డర్‌‌‌‌లోని అటాచ్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఓపెన్ చేయలేదు. అధికారులు చేసిన ఈ తప్పిదంతో చందన్ జీ ఠాకూర్‌‌‌‌ ఇప్పటిదాకా(2023 వరకు) జైలులోనే ఉన్నాడు. బెయిల్ కోసం చందన్ జీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆఫీసర్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాన్ని హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. బెయిల్ మంజూరైనా చందన్ జీ ఠాకూర్‌‌‌‌ మూడేండ్లు అదనంగా జైలులో ఉండాల్సి వచ్చిందని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడింది. చేసిన తప్పుకు చందన్ జీ ఠాకూర్‌‌‌‌ కు 14 రోజుల్లో రూ. లక్ష చెల్లించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.