గుజరాత్, కేరళ, కర్నాటక..స్టార్టప్‌‌లకు బెస్ట్​

గుజరాత్, కేరళ, కర్నాటక..స్టార్టప్‌‌లకు బెస్ట్​
  • ఇక్కడ బలమైన ఎకోసిస్టమ్​
  •  టాప్​ పర్ఫార్మర్స్ లిస్టులో తెలంగాణ
  •  వెల్లడించిన డీపీఐఐటీ

న్యూఢిల్లీ: ఎంట్రప్రిన్యూర్ల కోసం బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్​ను అభివృద్ధి చేయడంలో గుజరాత్, కర్నాటకలు ముందున్నాయి. బెస్ట్​పర్ఫార్మర్స్​గా ర్యాంకులను తెచ్చుకున్నాయి. ఇదే లిస్టులో కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌‌ కూడా ఉన్నాయి. ఇవి స్టార్టప్​ల కోసం అత్యుత్తమ విధానాలను తీసుకొచ్చాయి. స్టార్టప్ వృద్ధికి అనుకూలమైన ఎకోసిస్టమ్​ను నిర్మించడానికి 33 రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించిన  డిపార్ట్‌‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఐదు రకాల ర్యాంకులను ఇచ్చింది. 

ఇందులో బెస్ట్​ పర్ఫార్మర్స్, టాప్​ పర్ఫార్మర్స్, లీడర్స్​, ఆస్పైరింగ్​ లీడర్స్​, ఎమర్జింగ్​స్టార్టప్ ఎకోసిస్టమ్​లు ఉన్నాయి. రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి జనాభా ఆధారంగా రెండు విభాగాలుగా విభజించారు. కోటి కంటే ఎక్కువ ఉన్నవి, కోటి కంటే తక్కువ ఉన్నవిగా వర్గీకరించారు. గుజరాత్ వరుసగా నాలుగోసారి బెస్ట్​ స్టేట్​గా నిలిచింది. కర్ణాటక వరుసగా రెండో ఏడాది ర్యాంకు సాధించింది. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్  మేఘాలయలు ‘టాప్​ పర్ఫార్మర్స్’గా ఎంపికయ్యాయి. ఎనిమిది రాష్ట్రాలను 'లీడర్స్​' కేటగిరీలో చేర్చారు. 

ఇందులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్,  త్రిపుర ఉన్నాయి. బిహార్, హర్యానా, అండమాన్  నికోబార్ దీవులు,  నాగాలాండ్ వంటి రాష్ట్రాలు  కేంద్ర పాలిత ప్రాంతాలు 'ఆస్పైరింగ్​లీడర్స్' విభాగంలో ఉన్నాయి. ఛత్తీస్‌‌గఢ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, దాద్రా  నగర్ హవేలీ  డామన్  డయ్యూ, లడఖ్, మిజోరాం, పుదుచ్చేరి  సిక్కింలు 'ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్' విభాగంలోకి వచ్చాయి. 

యాక్షన్​ పాయింట్ల ఆధారంగా..

ఇన్నోవేషన్లను ప్రోత్సహించడం, మార్కెట్‌‌కు యాక్సెస్, ఇంక్యుబేషన్  ఫండింగ్ సపోర్ట్ వంటి 25 యాక్షన్ పాయింట్ల ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చామని కేంద్ర వాణిజ్య,  పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌‌లకు ఎలాంటి సాయం అవసరమో తెలుసు కోవాలని అధికారులను ఆయన కోరారు. స్టార్టప్‌‌లు పేటెంట్లు,  ట్రేడ్‌‌మార్క్‌‌ల వంటి ఇంటెలెక్చువల్​ప్రాపర్టీ రైట్స్​ (ఐపిఆర్‌‌లు) నమోదు కోసం డీపీఐఐటీ సాయం తీసుకోవాలని అన్నారు. దాదాపు 1,800 గుర్తింపు పొందిన స్టార్టప్‌‌లకు పేటెంట్లు మంజూరు చేశామని, గుర్తింపు పొందిన స్టార్టప్‌‌ల సంఖ్య 1.17 లక్షలకు చేరుకుందని డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ సంజీవ్ తెలిపారు.