గుజ‌రాత్ స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

గుజ‌రాత్ స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

గుజరాత్‌లోని 30  మున్సిపాలిటీలకు జరిగిన ఉపఎన్నికల్లో 21 సీట్లను గెలుచుకుని అధికార బీజేపీ సత్తా చాటింది.  సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది.  కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు.  కాగా 2023 ఆగస్టు 06 ఆదివారం రోజున పోలింగ్‌ నిర్వహించారు. గుజరాత్ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఫలితాలను  ప్రకటించింది. ఈ  మున్సిపాలిటీలలో మొత్తం  46.22 శాతం ఓటింగ్ నమోదు కాగా సూరత్ లో  చాలా తక్కువగా 24.17 శాతంగా నమోదైంది. 

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రజనీ పటేల్ మాట్లాడుతూ..   బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమను, దాని పని తీరును ఈ విజయం తెలియజేస్తోందన్నారు. మా కార్యకర్తల కృషి వల్లే ఈ విజయం సాధించగలిగామని చెప్పారు. బీజేపీపై ఓటర్ల విశ్వాసం చెక్కుచెదరకుండా ఉందని ఉపఎన్నికల ఫలితాలు చూపిస్తున్నాయన్నారు.  ముంద్రా మున్సిపాలిటీలోని ఒక స్థానంలో బీజేపీ తొలిసారిగా విజయం సాధించిందని తెలిపారు. ఈ ఫలితాలు  తమలో ఇంకా జోష్  ను పెంచాయని వెల్లడించారు.