నగల వేస్ట్​తో గణేశుడు… ఇంట్లోనే నిమజ్జనం

నగల వేస్ట్​తో గణేశుడు… ఇంట్లోనే నిమజ్జనం

గుజరాత్​ యువకుడి నయా ఆలోచన

ఇంట్లోనే నిమజ్జనం చేసేలా వజ్రాసన బ్యాగు

నిమజ్జనం వల్ల వచ్చే ముద్దతో ఇటుకల తయారీ

గణేశ్​ పండుగ దగ్గరకొచ్చేస్తోంది. ఇంకో ఐదు రోజులు. ఇప్పటికే కొన్ని లక్షల మంది వినాయక విగ్రహాలను కొనుక్కెళ్తున్నారు. అయితే, అందులో ఎక్కువగా ఉండేది ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​తో చేసిన గణేశ్​ బొమ్మలే. అయితే, అవి పర్యావరణానికి హాని చేస్తాయని, మట్టితో చేసిన బొజ్జ గణపయ్యలను వాడాలని పర్యావరణ ప్రేమికులు ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. ఎంత చేసినా ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​ గణపయ్యలకే డిమాండ్​ ఎక్కువ. కానీ, గుజరాత్​కు చెందిన డాక్టర్​ బినీశ్​ దేశాయ్​ అనే యువకుడు మాత్రం కొంచెం కొత్తగా ఆలోచించాడు. మట్టితో కాకుండా నగలు తయారుచేసేటప్పుడు మిగిలే వ్యర్థాలతో చేయాలనుకున్నాడు. వెంటనే వినాయకుడి బొమ్మను తయారు చేశాడు.  అయితే, అది బంగారు నగల వేస్ట్​ కాదులెండి. గిల్టు నగలు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి నగల వేస్ట్​తో బొజ్జ గణపయ్యకు రూపునిచ్చాడు.

ఎకో ఎలక్ట్రిక్​ టెక్నాలజీస్​ అనే స్టార్టప్​ను నడుపుతున్న బినీశ్​ వయసు 26 ఏళ్లు. ‘‘గిల్టు నగలు చేసేటప్పుడు కొన్ని గ్లాస్​ బీడ్​లను పెడుతుంటారు. వాటిని నగలకు అనువుగా మలిచేటప్పుడు చాలా వరకు పొడి వేస్ట్​గా పోతుంది. ఆ పౌడర్​ భూమిలో కలిసిపోదు. ఆ వేస్ట్​ భూమిపైన పేరుకుపోకుండా ఉండేందుకు ఈ కొత్త ఆలోచనను చేశా. పర్యావరణానికి మేలు చేసే గణేశుడిని తయారు చేశా. నగల దుకాణాల నుంచి ఆ వేస్ట్​ను సేకరించి, దానికి కొన్ని ప్రత్యేకమైన పర్యావరణహితమైన బైండర్లను కలిపి ముద్దలా మార్చాం. వినాయకుడిని రూపునిచ్చాం. ఆ తర్వాత విగ్రహానికి ఎరుపు, పసుపు, ఊదా వంటి రంగులు అద్దాం. ఆ రంగులూ కృత్రిమమైనవి కాదు. పూల నుంచి తీసినవి” అని బినీశ్​ చెప్పాడు. ఒక్కో విగ్రహాన్ని తయారు చేసేందుకు సుమారు 16 కిలోల నగల వేస్ట్​ పౌడర్​ అవసరమైందని బినీశ్​ చెప్పాడు.

ఈ వినాయకుడి విగ్రహంతో పాటు ఇంట్లోనే నిమజ్జనం చేసుకునేలా వజ్రాసన బ్యాగునూ ఇస్తున్నారు. ఆ బ్యాగులో వినాయకుడిని పెట్టి, టబ్బులో నిమజ్జనం చేసేయొచ్చట. అయితే, వచ్చే ఏడాది నుంచి జనానికి వీటిని అమ్ముతారట. ప్రస్తుతం తయారు చేసిన బొమ్మలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు గిఫ్ట్​గా ఇస్తామని బినీశ్​ చెప్పాడు. విగ్రహం సైజును బట్టి ₹1800 నుంచి ₹12 వేల వరకు ఉంటుందన్నాడు. అంతేకాదు, నిమజ్జనం చేసిన ఈ వినాయకుడినే ఇటుకలుగా మార్చే ఆలోచనా చేస్తున్నాడు. స్కూళ్లు, టాయిలెట్లు, ఇళ్ళు కట్టేందుకు వాటినే వాడేలా కృషి చేస్తాడట. అయితే, ఈ ఆలోచనా ఇప్పటిది కాదు. 11 ఏళ్ల వయసులోనే వేస్ట్​ను ఎలాగైనా వాడుకోవాలన్న పట్టుదలతో పనిచేశాడు బినీశ్​. అందులో భాగంగానే 23 ఏళ్ల వయసులో పేపర్​ మిల్లుల నుంచి వచ్చే వేస్ట్​తో పీ బ్లాక్​ ఇటుకలను తయారు చేశాడు. దేశ వ్యాప్తంగా 3700 టాయిలెట్లకు ఆ పీ బ్లీక్​ ఇటుకలనే వాడారు. ఇప్పటిదాకా 1780 టన్నుల వేస్ట్​ను రీసైకిల్​ చేసి 9 వేల ఇళ్లకు లాభం చేశాడు.