ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో?

ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో?
  • నేడు గుజరాత్‌, రాజస్తాన్‌ క్వాలిఫయర్‌‑1  పోరు
  • ఫేవరెట్‌‌‌‌గా హర్దిక్‌‌ సేన
  • రా. 7.30 నుంచి స్టార్‌‌స్పోర్ట్స్‌‌లో 

కోల్‌‌కతా : కొత్త ఫ్రాంచైజీ.. కొత్త ఆటగాళ్లతో.. సరికొత్త ఆటను చూపెట్టిన గుజరాత్‌‌ టైటాన్స్‌‌.. ఐపీఎల్‌‌ క్వాలిఫయర్‌‌–1 పోరుకు రెడీ అయ్యింది. మంగళవారం జరిగే మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌ రాయల్స్​తో అమీతుమీ తేల్చుకోనుంది. పదునైన పేస్‌‌ బౌలింగ్‌‌, మంచి ఫినిషర్లతో లీగ్‌‌ దశలో ‘టాప్​’ లేపిన  జీటీ.. ఈ మ్యాచ్‌‌లోనూ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది. అదే టైమ్‌‌లో స్పిన్‌‌ బలగాన్నే ఎక్కువగా నమ్ముకున్న రాయల్స్‌‌ కూడా గెలుపునే లక్ష్యంగా పెట్టుకుంది.  వెన్ను గాయం నుంచి కోలుకుని తొలిసారి కెప్టెన్‌‌గా బాధ్యతలు స్వీకరించిన ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా.. బ్యాట్‌‌, బాల్‌‌తో పాటు తన నాయకత్వ లక్షణాలతో అందుబాటులో ఉన్న వనరులను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. సూపర్‌‌ ఫినిషర్లు మిల్లర్‌‌, రాహుల్‌‌ తెవాటియాతో పాటు డెత్‌‌ బౌలింగ్‌‌ స్పెషలిస్ట్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌ కూడా బ్యాటింగ్‌‌లోనూ చెలరేగుతుండటమే ఇందుకు నిదర్శనం. అయితే బలహీనంగా కనిపిస్తున్న టాపార్డర్‌‌లో శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ గాడిలో పడితే జీటీకి తిరుగుండదు. ఎందుకంటే రెండో ఓపెనర్‌‌ సాహా మూడు హాఫ్‌‌ సెంచరీలతో ఫామ్‌‌లో ఉన్నాడు. బౌలింగ్‌‌లో షమీ సూపర్‌‌ స్టార్ట్‌‌ ఇస్తున్నాడు. పవర్‌‌ప్లేలో రన్స్‌‌ను కట్టడి చేయడంతో పాటు వికెట్లూ తీస్తున్నాడు. ఈడెన్​ పిచ్‌‌ పేసర్లకు అనుకూలమని వార్తలు వస్తున్న నేపథ్యంలో అల్జారీ జోసెఫ్‌‌ను తుది జట్టులోకి తీసుకునే చాన్స్‌‌ ఉంది. ఫెర్గుసన్‌‌, షమీతో కలిసి అతను పేస్‌‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. అయితే లీగ్‌‌ దశలో ఆడిన ఆఖరి ఐదు మ్యాచ్‌‌ల్లో మూడింటిలో ఓడటం గుజరాత్‌‌కు కాస్త మైనస్‌‌.

బట్లర్‌‌ ఏం చేస్తాడో..
రాజస్తాన్‌‌ అంటే తన పేరే గుర్తొచ్చేలా చెలరేగిపోయిన బట్లర్‌‌... గత మూడు మ్యాచ్‌‌ల్లో 2, 2, 7 రన్స్‌‌కే ఔటయ్యాడు. దీంతో అతనిపై ఒత్తిడి ఉన్నా.. రాయల్స్‌‌ ప్రధాన ఆయుధం మాత్రం అతనే. ఓపెనింగ్‌‌లో అతను ఇచ్చే శుభారంభంపైనే రాజస్తాన్‌‌ విజయం ఆధారపడి ఉంది. జైస్వాల్‌‌, శాంసన్‌‌ ఓకే అనిపిస్తున్నా.. పడిక్కల్‌‌, పరాగ్‌‌, హెట్‌‌మయర్‌‌.. తమ మార్క్‌‌ ఆటను చూపడం లేదు. వీళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా.. రాయల్స్‌‌కు భారీ స్కోరు ఖాయం. ఇక  పర్పుల్‌‌ క్యాప్‌‌ హోల్డర్‌‌ చహల్‌‌ స్పిన్‌‌పై రాయల్స్‌‌ భారీగా ఆధారపడినా, అశ్విన్‌‌ ఇప్పడు కొత్త హీరోగా మారాడు. స్పిన్‌‌తో ప్రత్యర్థిని శాసించే రవి.. బ్యాట్​తోనూ రెచ్చిపోవడం కలిసొచ్చే అంశం. పేసర్లుగా ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, ప్రసిధ్‌‌ కృష్ణ, మెక్‌‌ కేను కొనసాగించొచ్చు.  కాగా, ఈ మ్యాచ్​లో ఓడినా క్వాలిఫయర్​–2 రూపంలో మరో అవకాశం​ ఉన్నప్పటికీ అప్పటిదాకా ఆగకుండా ఫైనల్​ చేరాలని ఇరు జట్లూ ఆశిస్తున్నాయి. ఒకే దెబ్బతో ఏకంగా ఫైనల్‌‌ బెర్త్‌‌ దక్కే చాన్స్‌‌ ఉండటంతో జీటీ, ఆర్​ఆర్​ మధ్య  హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. 

విన్నర్‌‌ కోసం సూపర్‌‌ ఓవర్‌‌
ఐపీఎల్‌‌ నాకౌట్‌‌ మ్యాచ్‌‌లకు బీసీసీఐ కొత్త రూల్స్‌‌ను అమల్లోకి తెచ్చింది. వర్షం లేదా ఇతర కారణాలతో క్వాలిఫయర్‌‌–1, 2, ఎలిమినేటర్‌‌ మ్యాచ్‌‌లకు అంతరాయం కలిగితే సూపర్‌‌ ఓవర్‌‌తో విజేతను నిర్ణయిస్తారు. ఒకవేళ సూపర్‌‌ ఓవర్‌‌ కూడా సాధ్యపడకపోతే లీగ్‌‌ దశలో పాయింట్ల పట్టిక ఆధారంగా విన్నర్‌‌ను తేలుస్తారు. ఈ మూడు మ్యాచ్‌‌లకు రిజర్వ్‌‌ డే లేదు. మే 29న జరిగే ఫైనల్‌‌కు మాత్రం రిజర్వ్‌‌ డేను (మే 30) కేటాయించారు. మ్యాచ్‌‌ మధ్యలో ఆగిపోతే తర్వాతి రోజు అక్కడి నుంచే కొనసాగిస్తారు. టాస్‌‌ తర్వాత వర్షం వచ్చి మ్యాచ్‌‌ ఆగితే తర్వాతి రోజు మళ్లీ టాస్‌‌ వేస్తారు.

మరిన్ని వార్తల కోసం :-

నా టార్గెట్ ఒలింపిక్స్


టీమిండియాలో తెలుగువారికి చోటు..