టీమిండియాలో తెలుగువారికి చోటు..

టీమిండియాలో తెలుగువారికి చోటు..

ప్రతీ క్రికెటర్కు భారత జట్టుకు ఎంపికవ్వాలనేది కల.  ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎన్ని జట్లకు ఆడినా..ఎన్ని పరుగులు చేసినా..ఎన్ని సెంచరీలు కొట్టినా..జాతీయ జట్టుకు ఆడటం కోసమే. ఇక ప్రస్తుతం టీమిండియాలో కాంపిటీషన్ మామూలుగా లేదు. ఐపీఎల్ పుణ్యామా అని..భారత క్రికెటర్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. దీంతో ప్లేయర్ల ఎంపిక బీసీసీఐ సెలక్టర్లకు కత్తిమీద సాముగా మారింది. ఇంతటి టఫ్ స్విచువేషన్లో ఒక రాష్ట్రం నుంచి టీమిండియాకు ఎంపికైతే  అదృష్టమనే చెప్పాలి. కానీ..ప్రస్తుతం భారత జట్టుకు ఎంపికైన ఇద్దరు ప్లేయర్లు ఒకే రాష్ట్రానికి చెందిన వారే కాదు..ఒకే జిల్లాకు చెందిన వారు కూడా. వారిద్దరే హనుమ విహారి. కేఎస్ భరత్.

ఇద్దరు తెలుగు ప్లేయర్లకు చోటు..
జులై 1 నుంచి 5 వరకు టీమిండియా ఇంగ్లాండ్తో ఒక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన టీమ్ను సెలక్టర్లు ప్రకటించారు.  ఈ జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. పుజారాతో పాటు మరికొందరు ఆటగాళ్లు జట్టలో చోటు దక్కించుకోగా...తెలుగు కుర్రాళ్లు కూడా ఈ టీమ్కు సెలక్ట్ అయ్యారు. ఏపీకి చెందిన హనుమ విహారి, శ్రీకర్ భరత్లకు టెస్టు టీమ్లో చోటు దక్కింది.  వృద్ధిమాన్ సాహా ప్లేస్లో రెండో కీపర్‌గా శ్రీకర్ భరత్‌ను బీసీసీఐ  తీసుకుంది. లాస్ట్ ఇయర్ ఆసీస్తో జరిగిన టెస్టు లో అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టిన విహారికి సెలక్టర్లు అవకాశం కల్పించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒకేసారి ఇద్దరు ప్లేయర్లకు స్థానం దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


ఒక రాష్ట్రమే కాదు ఒకే జిల్లా కూడా..
శ్రీకర్ భరత్, హనుమ విహారీలది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతేకాదు..ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా వాసులే కావడం విశేషం. హనుమ విహారిది కాకినాడ..కోన శ్రీకర్ భరత్ది రామచంద్రాపురం. 1993 అక్టోబర్లో జన్మించిన భరత్..ఆంధ్రా క్రికెట్ టీమ్కు వికెట్ కీపర్ బ్యాట్సమన్గా ఆడుతున్నాడు. 19 ఏళ్ల వయసులో కేరళతో జరిగిన మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2015 ఫిబ్రవరిలో రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు రంజీల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి వికెట్ కీపర్ బ్యాట్సమన్ భరతే కావడం విశేషం. జూలై 2018లో అతను  దులీప్ ట్రోఫీ కోసం ఇండియా బ్లూ జట్టుకు ఎంపికయ్యాడు. 2019 నవంబర్ తొలిసారి భారత జట్టుకు ఎంపికైనా ..రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. 2020లోనూ ఆస్టేలియాలతో భారత జట్టుకు రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు 79 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడగా..4289 పరుగులు సాధించాడు.  ఇందులో 9 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 308.  లిస్ట్-A క్రికెట్ లో 56 మ్యాచుల్లో 1721 రన్స్ సాధించాడు. 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 161 అత్యధిక స్కోరు. 63 టీ-20ల్లో 1058 పరుగులు చేయగా..5 హాఫ్ సెంచరీలు సాధించాడు. 10 ఐపీఎల్ మ్యాచులు ఆడిన భరత్..ఒక హాఫ్ సెంచరీ సాయంతో 199 రన్స్ మాత్రమే చేశాడు. 


హనుమ విహారి కాకినాడలో 1993లో జన్మించాడు. అయితే ఆయన తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో  బాల్యం మణుగూరు, గోదావరిఖనిల్లోనే గడిచింది. విహారి తల్లి విజయది కృష్ణా జిల్లా మచిలీపట్నం. చిన్నతనంలోనే విహారి బ్యాట్ పట్టుకొని గల్లీల్లో క్రికెట్ ఆడేవాడు.  కొడుకును క్రికెటర్ చేయడం కోసం విజయ భర్తను ఒప్పించి.. కొడుకు, కుమార్తెను తీసుకొని హైదరాబాద్ వెళ్లారు. విహారి తండ్రి మణుగూరులో సింగరేణి ఉద్యోగం చేస్తుంటే.. సికింద్రాబాద్ ప్రాంతంలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్న విజయ.. పిల్లల బాధ్యత చూసేవారు. 2010లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన హనుమ విహారి..అక్కడ పరుగుల వరద పారించాడు. 101 మ్యాచుల్లో 7837 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 42 అర్థ సెంచరీలున్నాయి. 88 లిస్ట్A మ్యాచుల్లో 3326 రన్స్ సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలున్నాయి.  ఆస్ట్రేలియాలో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులో విహారి ఏకైక తెలుగు సభ్యుడు. విహారి ఇప్పటివరకు 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా... ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 808 పరుగులు చేశాడు.

తొలిసారిగా జట్టులో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు చోటు దక్కించుకున్న నేపథ్యంలో..తుది జట్టులో ఇద్దరికి ఛాన్స్ లభిస్తుందో లేదో చూడాలి..అయితే హనుమ విహారికి తుది జట్టులో స్థానం ఖాయం కాగా..భరత్కు మాత్రం దక్కే అవకాశాలు తక్కువే. ఏదేమైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.