గుజరాత్ కు కావాల్సింది డబుల్ ఇంజన్ కాదు.. కొత్త ఇంజన్ : కేజ్రీవాల్

గుజరాత్ కు కావాల్సింది డబుల్ ఇంజన్ కాదు.. కొత్త ఇంజన్ : కేజ్రీవాల్

గుజరాత్‌లో 27 ఏళ్ల బీజేపీ పాలన పై  ప్రజలు విసిగిపోయారని ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్ అన్నారు. వారంతా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. భావ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  కేజ్రీవాల్  బీజేపీ పై  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి విపరీతంగా ఉందని, ఆప్ అధికారంలోకి వస్తే... రాష్ట్రంలో అవినీతి లేకుండా పాలన చేస్తామన్నారు.

 బీజేపీ తరచుగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతుందని, అయితే గుజరాత్‌కు కావలసింది డబుల్ ఇంజన్ కాదని, కొత్త ఇంజిన్ అని కేజ్రీవాల్ తెలిపారు.  కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు 70 ఏళ్లు అవకాశం ఇచ్చారు. కేజ్రీవాల్‌కు ఒక్క ఛాన్స్‌ ఇచ్చి చూడండి. తన పనితీరు బాగోలేకపోతే మళ్లీ వచ్చి  ఓట్లు అడగననన్నారు . ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు తమ వద్ద డబ్బుల్లేవని, తాను  పేద వ్యక్తినన్నారు. ఏడేళ్లుగా తాను ఢిల్లీకి సీఎంగా ఉన్నా... తన  బ్యాంకు ఖాతా ఖాళీ అని తెలిపారు. మీ కోసం, మీ పిల్లల కోసం, గుజరాత్‌ భవిష్యత్తు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.