మధ్యాహ్నం నిద్రపోయిందని.. దారుణంగా కొట్టిన భర్త, అత్తమామలు

మధ్యాహ్నం నిద్రపోయిందని.. దారుణంగా కొట్టిన భర్త, అత్తమామలు

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంట్లో పనులన్ని చేస్తే ఎవరికైనా అలసటగా అనిపించడం మామూలు. కాస్త విశ్రాంతి కోసం మధ్యాహ్నం పూట కాసేపు కునుకు తీయాలని అనిపిస్తుంది. ఈ పని చేసిన పాపానికి 24 ఏండ్ల మహిళను భర్త, అత్తమామలు తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో జరిగింది. దీనిపై ఆ మహిళ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా కాదీకి చెందిన  వ్యక్తిని 2016లో పెండ్లి చేసుకున్న మహిళకు నాటి నుంచి మెట్టినింట వేధింపులు ఎదురవుతున్నాయి. ‘‘మొదటి నుంచి మధ్యాహ్నం సమయంలో నిద్ర పోవడాన్ని అత్తమామలు, భర్త వ్యతిరేకిస్తున్నారు. అయితే నేను తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంటి పనులన్నీ చేస్తాను. అలసటతో మధ్యాహ్నం టైమ్‌లో నిద్రను ఆపుకోలేకపోతున్నాను. ఈ విషయం చెప్పిన అత్తింటి వాళ్లు అర్థం చేసుకోకుండా హింసిస్తున్నారు” అని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఒకసారి కొట్టినప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చానని, ఆ తర్వాత పెద్దలు రాజీ చేయడంతో సర్దుకుపోయానని ఆమె చెప్పింది. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితి ఏ మాత్రం మారలేదని, తాను గర్భిణిగా ఉన్న సమయంలోనూ భర్త కానీ, అత్తమామలు ఏ మాత్రం సాయం చేయలేదని తెలిపింది. 2017 సెప్టెంబర్ 18న కూతురుఉ పుట్టిందని, ఆ తర్వాత అత్తింటి వాళ్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయని, అబ్బాయి పుట్టలేదని భర్త, అత్తమామలు తీవ్రంగా కొట్టడం మొదటుపెట్టారని చెప్పింది.