7వ సారి గుజరాత్​లో బీజేపీ జయకేతనం

 7వ సారి గుజరాత్​లో బీజేపీ జయకేతనం
  • అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 156 సీట్లు కైవసం
  • కనీస ప్రభావం చూపలేకపోయిన ప్రతిపక్షాలు
  • కాంగ్రెస్‌‌కు 17, ఆప్‌‌ 5 సీట్లకే పరిమితం
  • ఇండిపెండెంట్లుగా గెలిచిన ముగ్గురూ బీజేపీ రెబెల్సే

అహ్మదాబాద్: గుజరాత్ గడ్డపై బీజేపీ మరో చరిత్ర సృష్టించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. గుజరాత్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 156 సీట్లను కైవసం చేసుకుంది. వరుసగా ఏడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో నిలిచింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్​ పరిస్థితి మరింతగా దిగజారింది. ఈసారి బీజేపీని ఆపుతామన్న ఆప్‌‌.. ఆమడదూరంలో నిలిచిపోయింది. ‘నేషనల్ పార్టీ’ హోదాతో సరిపెట్టుకుంది. 

బీజేపీ గెలుపుతో గాంధీ నగర్‌‌లోని పార్టీ ఆఫీసు సందడిగా మారింది. వందలాది మంది కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. సీఎంగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని, ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తెలిపారు.

అంతా ఏకపక్షం

ఈనెల 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. గురువారం ఉదయం 8 గంటలకు 37 కేంద్రాల్లో కౌంటింగ్ మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ స్టార్ట్ చేశారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే ‘వన్ వే’ కనిపించింది. 9.30 నాటికల్లా 130కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది.

చివరిదాకా మూడింట రెండొంతుల స్థానాల్లో లీడింగ్‌ను కొనసాగించింది. సమయం గడుస్తున్న కొద్దీ.. హాఫ్ సెంచరీ.. సెంచరీని దాటి.. రికార్డులను బద్ధలుకొడుతూ 182 సీట్లున్న అసెంబ్లీలో 156 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, ఆప్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయాయి. బీజేపీని ఓడిస్తామని చెప్పిన ఆప్.. కాంగ్రెస్ ఓట్లకు గండికొట్టింది. ఫలితంగా గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 60కిపైగా సీట్లను కోల్పోయింది. బీజేపీకి 52.5 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు 27.28 శాతం, ఆప్​కు 12.92 శాతం పడ్డాయి. కాంగ్రెస్‌ 17, ఆప్ 5 సీట్లలో గెలవగా, 3 స్థానాలను ఇండిపెండెంట్లు (బీజేపీ రెబల్స్), ఒక సీటు ఎస్పీ దక్కించుకుంది.

ఆల్ టైమ్ రికార్డు

1985లో జరిగిన ఎన్నికల్లో మాధవ్ సింగ్ సోలంకి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ పార్టీ 149 సీట్లు సాధించింది. గుజరాత్​లో ఇప్పటిదాకా ఉన్న ఆల్‌టైం రికార్డు ఇది. 2002లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 127 సీట్లను గెలుచుకుంది. కమలం పార్టీకి ఇప్పటిదాకా ఇదే అత్యధికం. ఈ సారి రికార్డులన్నింటినీ బీజేపీ బద్ధలు కొట్టింది. రాష్ట్ర చరిత్రలో ఓ పార్టీ 150పైగా సీట్లను గెలుచుకోవడం ఇదే తొలిసారి. గత ఎన్నికలతో పోలిస్తే 50 శాతం ఎక్కువ సీట్లను సాధించింది.

బెంగాల్ తర్వాత..

దేశచరిత్రలో వరుసగా అత్యధిక సార్లు గెలిచిన రికార్డు లెఫ్ట్‌ ఫ్రంట్‌కు ఉంది. పశ్చిమ బెంగాల్‌లో వరుసగా 7 సార్లు సీపీఎం ఆధ్వర్యంలోని కూటమి అధికారాన్ని దక్కించుకుంది. 1977 నుంచి 2011 దాకా 34 ఏండ్ల పాటు పవర్‌‌లో ఉంది. తాజా గెలుపుతో లెఫ్ట్ రికార్డును బీజేపీ సరి చేసింది. 1995 నుంచి పార్టీకి ఓటమన్నదే లేదు. సంవత్సరాల పరంగా చూస్తే బీజేపీ 27 ఏండ్లుగా గుజరాత్‌లో అధికారంలో ఉంది. తాజా గెలుపుతో మరో ఐదేండ్లు కలిపి 32 ఏండ్లపాటు అధికారంలో ఉండనుంది. 

కాంగ్రెస్ నేల చూపులు

కాంగ్రెస్‌కు మరోసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత ఎన్నికలతో పోలిస్తే మరింత తీసికట్టుగా పరిస్థితి మారిపోయింది. 2017లో 77 సీట్లు సాధించి బీజేపీ గట్టిపోటీనిచ్చిన హస్తం పార్టీ.. ఈసారి 20 సీట్లు కూడా గెలవలేకపోయింది. 16 సీట్లకే పరిమితమైంది.

సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘ్వి, బీజేపీ నేతలు హార్దిక్ పటేల్, రివాబా జడేజా, కాంగ్రెస్ అభ్యర్థి జిగ్నేశ్ మేవానీ తదితరులు గెలిచారు. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గాధ్వీ, ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా ఓడిపోయారు. ఇక ఝగాడియా అసెంబ్లీ సీటులో తొలిసారి బీజేపీ గెలిచింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన ట్రైబల్ లీడర్, ఏడు సార్లు ఎమ్మెల్యే ఛోటుభాయ్ వసావాను 23,500 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రితేశ్ వసావా ఓడించారు. గెలిచిన ముగ్గురు ఇండిపెండెంట్లు.. బీజేపీ రెబల్సే. అది కూడా బీజేపీ అభ్యర్థులపైనే గెలిచారు.

కమాల్​ కర్దియా

గుజరాత్​ కమాల్​ చేసింది. ఇక్కడి ప్రజలు రికార్డులను తిరగ రాశారు. అభివృద్ధి రాజకీయాలను ఆశీర్వదించారు. ఈ భారీ విజయం నన్ను ఎంతగానో ఎమోషన్​కు గురిచేసింది. గుజరాత్ జనశక్తికి తలవంచి నమస్కరిస్తున్నా. కొన్ని పార్టీలు ప్రజలను విభజించి.. దోచుకునేందుకే ప్రయత్నిస్తున్నాయి. కానీ, మనందరినీ కలిపేది మాతృభూమి ఒక్కటే. మాతృభూమి ప్రయోజనం కోసమే బీజేపీ పని చేస్తుంది. ఇప్పుడు ఒక్క శాతం కంటే తక్కువ ఓట్ల తేడాతో హిమాచల్​​లో ఓడిపోయినప్పటికీ.. వచ్చేసారి వంద శాతం విజయం సాధిస్తాం. హిమాచల్​ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. - ప్రధాని నరేంద్ర మోడీ