పాతబస్తీపై కళ్లు తెరవాలి: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంతో గుణపాఠం నేర్వాలి..

పాతబస్తీపై కళ్లు తెరవాలి: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంతో గుణపాఠం నేర్వాలి..

చారిత్రాత్మకమైన చార్మినార్ కట్టడానికి  సమీపంలో గుల్జార్ హౌజ్ వద్ద ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం ఘటన అనేక పాఠాలు నేర్పిస్తోంది.  17 మంది మృతిచెందిన ఈ ఘటనకు కారణాలపై లోతైన విచారణ జరుగుతున్న వేళ రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతివిమర్శల కంటే ఇలాంటి దురదృష్టకర ఘటనలు భవిష్యత్తులో పునరావృతమవకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా అందరిపైనా ఉంది.  

చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇరుకైన రోడ్లు, సందులతో ఉంటాయి. ప్రమాదం జరిగిన భవనానికి కూడా రాకపోకల కోసం ఒకే ఇరుకైన ద్వారం ఉండడంతో ప్రాణనష్టం భారీగా  జరిగింది. ఏసీ కంప్రెషర్ పేలడం వల్లే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్నా మరిన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇక్కడ నియమ నిబంధనలపై ఎవరికీ ఏమాత్రం పట్టింపులేదని, వాటిపై చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉందని క్షేత్రస్థాయికి వెళ్తే అవగతమవుతోంది. 

గ్రేటర్ నగరంలోని అన్ని ప్రాంతాలు ఒక ఎత్తయితే,  నగరం దక్షిణాన ఉన్న మూసీనది దాటాక మరో ఎత్తు.  విద్యుత్, రోడ్లు, భవనాలు, రవాణా వ్యవస్థ, పార్కింగ్, శాంతిభద్రతలు ఇలా ఏ అంశంలో చూసినా పాతబస్తీలో నిబంధనల ఉల్లంఘనలే కనిపిస్తాయి.  సున్నితమైన ప్రాంతం కూడా కావడంతో దశాబ్దాలుగా ప్రభుత్వాలూ చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో  గుల్జార్ హౌజ్ వంటి ఘటనలు జరుగుతున్నాయి.  ఇక్కడ అగ్ని ప్రమాదం తెల్లవారుజామున జరిగింది. అదే పగలయితే పాతబస్తీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో నష్టం మరింత భారీగా ఉండేది. 

అగ్ని ప్రమాదం ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కూడా ఒక కారణమని వినిపిస్తోంది.  గుల్జార్ హౌజ్ ప్రాంతంతోపాటు చార్మినార్ చుట్టుపక్కల ఏ వీధిలో చూసినా విద్యుత్ తీగలు యమపాశాలుగా వేలాడుతున్నాయి.  మదీనా చౌరస్తా నుంచి మొదలు షాలిబండ వరకు ప్రధాన రహదారుల్లో దుకాణాల ముందు వందల సంఖ్యలో  తోపుడు బండ్లు, స్టాండ్లపై  హై ఓల్టేజీ విద్యుత్ బల్బులు పెట్టుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు సమీపంలోని దుకాణాల నుంచి, మరి కొందరు విద్యుత్ తీగలపై కొక్కాలు వేసి విద్యుత్ తీసుకుంటున్నారు. ఇలాంటి అనధికార కనెక్షన్లతో విద్యుత్ సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరిగి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. 

శిథిలావస్థలో భవనాలు

పాతబస్తీలో శిథిలావస్థలో కూలిపోయే స్థితిలో మరికొన్ని భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ భవనాల్లో విద్యుత్ వైరింగ్ సరిగ్గా లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలకు అస్కారం ఉంది. మదీనా, గుల్జార్ హౌజ్ ప్రాంతాల్లో ఉన్న భవనాలను హెరిటేజ్ కట్టడాల్లో భాగంగా ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం గతంలో ఇక్కడి దుకాణాల పేర్లను, అలంకారాలను మార్చాలని ప్రయత్నించి విఫలమైంది.  పురాతన భవనాల్లో మెట్ల మీద, భవనాల్లో సెల్లార్లలో చిన్న చిన్న వ్యాపారాలతో పాటు గోడౌన్లు కూడా ఉన్నాయి. గాలి వెలుతురు కూడా సరిగ్గా లేని ఇటువంటి ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. 

ఇలాంటి గోడౌన్లలో అగ్ని ప్రమాదాలు జరిగిన ఘటనలు గతంలో అనేకం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడంతో గుల్జార్ హౌజ్ వంటి ఘటనలు సంభవిస్తున్నాయి.  పాతబస్తీలో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలన్నా, మంచి పనులు చేయాలన్నా రాజకీయ జోక్యంతో ప్రభుత్వానికి ఇబ్బందులు రావడంతో  స్థానిక ప్రజలు కూడా నష్టపోతున్నారు. 

గుణపాఠం నేర్వాలి

నగర చరిత్రలోనే భారీ అగ్ని ప్రమాదంగా నమోదైన గుల్జార్ హౌజ్ ఘటనపై రాజకీయ పార్టీలు వారి వారి కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు సమయానికి రాలేదని కొందరు, వచ్చాయని కొందరు ప్రకటనలు చేస్తున్నారు.  వచ్చిన వాటిలో కూడా సరైన సదుపాయాలు, పరికరాలు లేవనే విమర్శలూ ఉన్నాయి. వాస్తవానికి ఘటన ప్రదేశం ఫైర్ స్టేషన్​కు రెండు నిమిషాల దూరంలోనే ఉంది. చార్మినార్ వద్ద అంబులెన్స్  నిత్యం అందుబాటులో ఉంటుంది. చార్మినార్ వద్దనే పోలీస్ స్టేషన్ ఉంది. అన్నీ చుట్టూఉన్నా భారీ ప్రమాదమే జరిగింది.  గుల్జార్ హౌజ్ ఘటన నుంచి గుణపాఠం నేర్వాల్సిన అవసరం ఉంది. గుల్జార్ హౌజ్ ఘటనతో పాతబస్తీపై కళ్లు తెరవాలి. 

ట్రాన్స్​ఫార్మర్లపై  హెవీలోడ్

రాత్రి సమయాల్లో ట్రాన్స్​ఫార్మర్లపై  హెవీలోడ్ పెరగడంతో గృహోపయోగ విద్యుత్ పరికరాలు పేలిపోవడం ఇక్కడి స్థానికులకు మామూలు విషయమే.  ఇక రంజాన్, దసరా వంటి పండుగ వేళల్లో ఇలాంటి సమస్యలు మరింత అధికంగా ఉంటాయి.  వీటిపై   ప్రభుత్వ  పర్యవేక్షణ ఏమాత్రం లేదని అక్కడ పరిస్థితులను బట్టి తెలుస్తుంది.  నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్ వైర్లపై కొక్కాలు వేయడంతో పాతబస్తీలో అధికంగా విద్యుత్ చౌర్యం జరుగుతుందని, ఎవరైనా సిబ్బంది ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తారనేది బహిరంగ రహస్యమే. దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తూవస్తున్నాయి. 

మదీనా నుంచి ఫలక్​నుమా వరకు రహదారులను  పరిశీలిస్తే  ఇరుకైన రోడ్లపైనే రాకపోకలు సాగించాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చినా దారి దొరకడం గగనమే.  చార్మినార్ కట్టడాన్ని సందర్శించడానికి వచ్చే వాహనాలకు సరైన పార్కింగ్ వసతే ఉండదు.  గుల్జార్ హౌజ్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రయివేట్ వ్యక్తులు ఇష్టారీతిలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ రోడ్లపైనే అక్రమంగా వాహనాలను నిలుపుతుండడంతో ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి వరకూ పాతబస్తీలో ట్రాఫిక్ నిత్యం జామ్ అవుతూనే ఉంటుంది.

- ఐ.వి.మురళీకృష్ణ శర్మ