33 కోట్ల జనాభాకు 39 కోట్ల తుపాకులు

33 కోట్ల జనాభాకు 39 కోట్ల తుపాకులు
  • 33 కోట్ల జనాభాకు 39 కోట్ల తుపాకులు
  • పెరుగుతున్న కాల్పులు
  • ఈ ఏడాది ఇప్పటిదాకా 212 ఫైరింగ్​ ఘటనలు
  • అందులో 27 స్కూళ్లలోనే 
  • గన్​ కల్చర్​ను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కుతున్న జనం
  • ‘సెకండ్​ అమెండ్​మెంట్​’తోప్రజలకు తుపాకీ హక్కు
  • దాన్ని మార్చాలంటున్న డెమోక్రాట్లు.. ససేమిరా అంటున్న రిపబ్లికన్లు

సెంట్రల్​ డెస్క్​, వెలుగు: బతికే హక్కు, మాట్లాడే హక్కు, చదువుకునే హక్కు, స్వేచ్ఛా హక్కు, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు.. ఇవీ ప్రతి ఒక్కరికీ వివిధ దేశాల రాజ్యాంగాలు కల్పించిన ప్రాథమిక హక్కులు. కానీ, అమెరికాలో ఇంకో హక్కు జనం ‘బతికే హక్కు’ను చంపేస్తోంది. అదే తుపాకీని కలిగి ఉండడం.. దానిని ఎక్కడికంటే అక్కడికి పట్టుకెళ్లడం. అవును, అమెరికా రాజ్యాంగంలోని సెకండ్​ అమెండ్​మెంట్​ (రెండో సవరణ) ప్రజలకు కల్పించిన ‘కీపింగ్​ అండ్​ బియరింగ్​ ద ఆర్మ్​ రైట్’ అది. ప్రజలకున్న ఆ హక్కును ఏ రాష్ట్రాలూ కాలరాయలేవంటూ ఆ దేశ సుప్రీంకోర్టు పలుసార్లు స్పష్టంగా తేల్చి చెప్పింది కూడా. అంతేకాదు.. రాష్ట్రాలు ఆ హక్కును హరించకుండా పదో సవరణనూ చేశారు. ఆ హక్కే అక్కడ జనం కన్నా గన్నులు ఎక్కువగా ఉండడానికి కారణమైంది. విచ్చలవిడి గన్​ కల్చర్​కు దారి తీస్తోంది. పిల్లల చేతుల్లో ఆటబొమ్మలా మారి తల్లిదండ్రుల ప్రాణాలను తోడేస్తోంది. ఈ మధ్యే టెక్సస్​లోని ఉవాల్డేలో అభంశుభం తెలియని 19 మంది స్కూలు విద్యార్థులను ఆ స్కూలుకే చెందిన మాజీ స్టూడెంట్​ కాల్పులు జరిపి చంపేశాడు. బఫెలో టౌన్​లో దుండగుడు జరిపిన కాల్పుల్లో పదిమంది చనిపోయారు. వారం కిందటే రెండేండ్ల చిన్నారి తుపాకీతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ తన తండ్రిని కాల్చాడు. 

ఆ చిన్నారి తెలియక చేసిన తప్పుకు.. అతడి తల్లి జైలుకెళ్లాల్సి వచ్చింది. ఇట్ల చెప్పుకుంటూ పోతే ఒక్కటికాదు.. రెండు కాదు.. లెక్కలేనన్ని ఘటనలు కళ్లముందు తిరుగుతూనే ఉంటాయి. ప్రతి వంద మందికి 120 గన్నులు వాస్తవానికి అమెరికాలో జనం కన్నా తుపాకులే ఎక్కువున్నాయంటే నమ్మగలరా? కానీ, ఎఫ్​బీఐ (ఫెడరల్​ బ్యూరో ఆఫ్​ ఇన్వెస్టిగేషన్​) రికార్డులు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2020 నాటికి అమెరికాలో ఆర్మీ, పోలీసుల వద్ద ఉన్న గన్నులు సహా మొత్తంగా 40 కోట్లకుపైగా తుపాకులున్నాయి. అందులో 98 శాతం జనం వద్దే ఉన్నాయి. 33 కోట్ల జనాభా ఉంటే 39 కోట్ల 33 లక్షల 47 వేల గన్నులున్నాయి. అంటే ప్రతి వంద మందికి 120 తుపాకులున్నాయి. ఆ లెక్కన ప్రతి పిల్లాడు, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు ఒక్కో తుపాకీని కలిగి ఉన్నా కూడా.. ఇంకా 6.7 కోట్ల తుపాకులు మిగిలిపోతున్నాయి. అవి చాలవన్నట్టు ఏటేటా తుపాకుల కొనుగోళ్లు కోట్లలోనే ఉంటున్నాయి. ఎఫ్​బీఐ లెక్కల ప్రకారం 2019లో 2.8 కోట్ల తుపాకులను కొనుగోలు చేస్తే.. ఒక్క 2020లోనే  4 కోట్ల తుపాకుల కొనుగోళ్లు జరిగాయి. 2021లో కొంచెం తగ్గాయి. ఆ ఏడాది 1.9 కోట్ల తుపాకులు అమ్ముడయ్యాయి. 2002 నుంచి 2021 మధ్య తుపాకుల కొనుగోళ్లు 155 శాతం పెరిగాయి. ఇక, 82.7 శాతం మంది వద్ద హ్యాండ్​గన్నులుంటే.. 68.8 శాతం మంది రైఫిళ్లు, 58.4 శాతం మంది షాట్​గన్నులను కలిగి ఉన్నారు. ఎక్కువ మంది వద్ద పిస్టళ్లున్నాయట. మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. 2019 నుంచి కొత్తగా తుపాకులు కొంటున్న వాళ్లలో సగానికిపైగా మహిళలే ఉంటున్నారని నేషనల్​ ఫైర్​ ఆర్మ్స్​ సర్వేలో తేలింది. 
 
2010 నుంచి 43 శాతం పెరిగిన మరణాలు
1968 నుంచి 2017 మధ్య 50 ఏండ్లలో తుపాకీ కాల్పుల్లో 15 లక్షల మందికిపైగా మరణించారు. 1775లో జరిగిన అమెరికా స్వాతంత్ర్య యుద్ధం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ఘటనలోనైనా చనిపోయిన సైనికుల కన్నా ఎక్కువది. అమెరికా సీడీసీ లెక్కల ప్రకారం ఆత్మహత్యలు, హత్యలు కలిపి ఒక్క 2020లోనే తుపాకీ కాల్పుల వల్ల 45,222 మంది అమెరికన్లు చనిపోయారు. అందులో 24,292 మంది ఆత్మహత్య చేసుకుంటే.. 19,384 హత్యలున్నాయి. ఇది ఆ దేశ చరిత్రలోనే ఏ ఏడాదితో పోల్చినా అతి చెత్త రికార్డు. 2010 నుంచి ఇప్పటిదాకా తుపాకీ కాల్పుల్లో మరణాల సంఖ్య 43 శాతం పెరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే, తుపాకీని కలిగి ఉండడం, ఎక్కడికైనా తీసుకెళ్లడం అనే హక్కును సవరించాలన్న డిమాండ్లు ఎన్నెన్నిసార్లు వినిపిస్తున్నా.. అది రాజకీయ మలుపు తీసుకుంటోంది. ముఖ్యంగా రిపబ్లికన్లు ఆ ‘సెకండ్​ అమెండ్​మెంట్’​  కు మరో సవరణ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఫలితంగా తుపాకీ హక్కు సవరణ చర్చల వద్దే ఆగిపోతోంది.
 
సగం మంది కఠినంగా ఉండాలంటున్నరు
తుపాకులతో ఇంత హింస జరుగుతున్నా అమెరికాలోని సగం మంది మాత్రం తుపాకులను కలిగే ఉండే హక్కులో సవరణలు వద్దంటున్నారు. గన్​ చట్టాలు కఠినంగా ఉండాలని 52% మందే చెప్తున్నారు. 35% మంది ఇప్పుడున్నట్టుగానే ఉంచాలంటున్నారు. 11% మంది ఆ చట్టాల తీవ్రతను తగ్గించాలంటున్నారు. రాజకీయాల పరంగా డెమొక్రాట్లు గన్​ చట్టాలు, నిబంధనలను కఠినం చేయాలంటుంటే.. రిపబ్లికన్లు ససేమిరా అంటున్నారు. కేవలం 24% మంది రిపబ్లికన్లే కఠిన చట్టాలను కోరుకుంటున్నారు. ఇటు అమెరికాలో అత్యంత శక్తిమంతమైన గన్​ లాబీ ‘నేషనల్​ రైఫిల్​ అసోసియేషన్​ (ఎన్​ఆర్​ఏ)’ కఠిన చట్టాలు వద్దంటూ అడ్డుపుల్ల వేస్తోంది. ‘సెకండ్​అమెండ్​మెంట్​’కు సవరణలు చేయకుండా అడ్డుకుంటోంది. ఇటీవలి ఘటనల నేపథ్యంలో అమెరికన్లు రోడ్డెక్కుతున్నారు. గన్​సేఫ్టీ చట్టాలను చేయాలంటూ నినదిస్తున్నారు. శనివారం వాషింగ్టన్​ డీసీతో పాటు పలు నగరాల్లో వేలాది మంది గన్​ కల్చర్​కు వ్యతిరేకంగా 450 ర్యాలీలను తీశారు. తుపాకుల కాల్పుల ఘటనలు జరిగితే నిందితులతో పాటు తుపాకులను తయారు చేసిన కంపెనీలనూ కేసులో ఇంప్లీడ్​ చేయాలన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలే బైడెన్​ కఠిన చట్టాలు చేసేందుకు పిలుపునిచ్చినా.. రిపబ్లికన్లు మద్దతిస్తారన్నది అనుమానంగానే ఉంది. మరికొన్ని రోజుల్లో సెనేట్​ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెకండ్​ అమెండ్​మెంట్​కు మరో సవరణ చేసేందుకు ఒప్పుకొనేది లేదని కొందరు రిపబ్లికన్​ సెనేటర్లు ఇప్పటికే తేల్చి చెప్పారు.
 
స్కూళ్లలో 250 ఘటనలు
విచ్చలవిడి గన్​కల్చర్​ వల్ల దుండగులు స్కూళ్లను టార్గెట్​ చేసుకోవడం నిరుడు భారీగా పెరిగింది. 2020లో స్కూళ్లలో 114 కాల్పుల ఘటనలు జరగ్గా.. 2021లో అది 250కి పెరిగింది. 2022లో ఇప్పటిదాకా 27 ఘటనలు జరిగాయి. అమెరికాలోని కేవలం 8 రాష్ట్రాల్లోనే స్కూల్​ షూటింగ్​ ఘటనలు జరగలేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కడో ఒక చోట కాల్పుల ఘటనలు జరిగాయి. అత్యధికంగా ఇల్లినాయీలో 23 ఘటనలు జరగ్గా.. కాలిఫోర్నియాలో 21, న్యూయార్క్​లో 15 స్కూళ్లలో కాల్పుల ఘటనలు జరిగాయి. ఈ లెక్కలన్నీ ‘ఎఫ్​బీఐ నేషనల్​ ఇన్​స్టంట్​ క్రిమినల్​ బ్యాగ్రౌండ్​ చెక్’​ చెప్తున్నవే.కెనడా, బ్రిటన్​, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అమెరికాలోనే తుపాకీ కాల్పుల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.