"గుండమ్మ"కు షష్టిపూర్తి

"గుండమ్మ"కు షష్టిపూర్తి

నేటితో 'గుండమ్మ కథ'కు అరవై ఏళ్లు
కన్నడ సినిమాకు రిమేక్ 'గుండమ్మ కథ'
సూర్యకాంతం సినిమాకు మొదటి ప్లస్ పాయింట్
అసాధారణ నటనతో జీవించేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్, జమున, సావిత్రి, ఎస్వీఆర్
ఈ సినిమాలో ఘంటసాల స్వరపరిచిన ప్రతీ పాటా ఆణిముత్యమే


చాలా సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని సినిమాలు అసలు ఎప్పుడు వచ్చాయో.. ఎలా వచ్చాయో కూడా తెలీదు. కానీ కొన్ని సినిమాలు మాత్రం వచ్చి అలానే నిలిచిపోతాయి. చూసినవారి మనసుల్లోకి చొరబడి అక్కడే పాతుకుపోతాయి. ఎన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా.. మరల మరల గుర్తొస్తూనే ఉంటాయి. అద్భుతంగా అనిపిస్తాయి. ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి. అలాంటి చిత్రాల్లో ‘గుండమ్మకథ’ఒకటి. 1962, జూన్‌ 7న ఈ సినిమా విడుదలైంది. నేటితో అరవై వసంతాలను పూర్తి చేసుకుంది. అప్పట్లో ఎంత సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని తరాలు మారినా.. ఎంత టెక్నాలజీ వచ్చినా ఈ రోజుకీ ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడుతున్నామంటేనే అర్థం చేసుకోవాలి.. ఈ సినిమాకు ఏ పాటి క్రేజ్ ఉందో... అంత గొప్ప చిత్రం గురించి చాలా మంది తెలిసే ఉంటుంది. కానీ తెరవెనకాల జరిగిన సంగతుల గురించి తెలియాలంటే  ఆ కల్ట్ క్లాసిక్‌ గురించి కొన్ని కబుర్లు చెప్పుకోవాల్సిందే.

కథ పుట్టిందలా..

నిజానికి ‘గుండమ్మ కథ’ తెలుగునాట పుట్టలేదు. 1958లో వచ్చిన ఓ కన్నడ సినిమాకి రీమేక్ అది. జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ను’సినిమా చూసి నాగిరెడ్డి చాలా ఇష్టపడ్డారు. ఎలాగైనా తెలుగులో తీసి తీరాలనుకున్నారు. నరసరాజు సహకారంతో ఆ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చేశారు. అయితే ఆయన ఏం చేసినా చక్రపాణి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే అది కార్యరూపం దాల్చుతుంది. అందుకే చక్రపాణి గారి చేతికి స్క్రిప్ట్ వెళ్లింది. ఒరిజినల్‌లో ఉన్న కొన్ని విషయాలు చక్రపాణి గారికి నచ్చకపోవడంతో ఆయన వాటిని తీసేశారు. ‘ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ’ అనే షేక్‌స్పియర్ రచన స్ఫూర్తితో కొన్ని విషయాలను యాడ్ చేసి, మొత్తానికి అచ్చ తెలుగు కథలాగా మార్చేశారు. ఈ సినిమాకు బీఎన్‌ రెడ్డిని దర్శకుడిగా అనుకున్నారు. కానీ తర్వాత పుల్లయ్య అయితే బెటర్ అనుకున్నారు. కానీ ఆయనకు స్క్రిప్ట్ అంత నచ్చకపోవడంతో కమలాకర కామేశ్వరరావుకి అవకాశం దక్కింది. అంతవరకు పౌరాణిక చిత్రాలు మాత్రమే తీసిన కామేశ్వరరావుకి ఇలాంటి ఓ సోషల్ సబ్జెక్ట్ ను అప్పగించడం పెద్ద చాలెంజ్ అనే చెప్పాలి. 

అదే మొదటి సక్సెస్

సినిమా తీయడానికి కథ ఎంచుకోవడం ఒకెత్తయితే.. పాత్రలకు తగ్గ నటీనటుల్ని సెలెక్ట్ చేసుకోవడం మరొకెత్తు. పైగా ఇది రొటీన్ స్క్రిప్ట్ కాదు. పాత్రలన్నీ చాలా బలంగా, తమదైన ఇండివిడ్యువాలిటీని కలిగి ఉంటాయి. అందుకే ప్రతి క్యారెక్టర్‌‌కీ బెస్ట్ ఆర్టిస్ట్ కావాలి. అందుకే టాప్‌ స్టార్స్ వైపే  మొగ్గు చూపారు దర్శక నిర్మాతలు. హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్.. హీరోయిన్లుగా సావిత్రి, జమున.. ఓ కీలక పాత్రకి ఎస్వీఆర్.. కాస్త కామెడీ, కాస్త కన్నింగ్‌నెస్ కలిసిన పాత్రకి రమణారెడ్డి.. ఎలా బెస్ట్ యాక్టర్స్ ని ఎంచుకుంటూ పోయారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘గుండమ్మ’పాత్ర గురించి. కథే ఆమెది. ప్రతీ పాత్ర ఆమెతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి దానికి తిరుగులేని నటి కావాలి అనుకున్నప్పుడు వాళ్లకి కనిపించిన ఏకైన చాయిస్.. సూర్యకాంతం. నిజానికి కన్నడ వెర్షన్‌లో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథని మనకి తగ్గట్టుగా మార్చే క్రమంలో గుండమ్మని ప్రధాన పాత్రని చేశారు. ఆ పాత్రకి ప్రాణం పోసే బాధ్యతని సూర్యకాంతంకి అప్పగించారు. ఆమె తన అద్భుతమైన పర్‌‌ఫార్మెన్స్ తో ఆ క్యారెక్టర్‌‌ని ఏ స్థాయిలో నిలబెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంత మంచి కాస్ట్ దొరకడమే ఈ సినిమాకి మొదటి సక్సెస్.

అందరూ అందరే!

కథ రెడీ. కథనం రెడీ. యాక్టర్స్ రెడీ. అయినా కూడా ఈ సినిమాని తెరకెక్కించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది అప్పట్లో అతి పెద్ద మల్టీస్టారర్. అప్పటికే స్టార్స్ గా వెలుగుతున్న ఇద్దరు హీరోల్ని బ్యాలెన్స్ చేయడం చిన్న విషయం కాదు. పైగా మరోవైపు సావిత్రి ఉన్నారు. హీరోలతో సమానమైన రేంజ్ ఆమెది. అయితే మేకర్స్ కి ఆ కష్టం తెలీకుండా చేశారు ఈ ముగ్గురూ. అసలు వేరే పాత్రధారి పేరుతో తీసే సినిమాలో వాళ్లు ఒప్పుకోవడమే గొప్ప విషయం. ముఖ్యంగా ఎన్టీఆర్‌‌ తన ఇమేజ్‌ని పక్కనపెట్టి ఈ సినిమా చేశారని చెప్పొచ్చు. పనివాడు అంజి పాత్రలో  నిక్కరు వేసుకుని కనిపించారు. సూర్యకాంతం దగ్గర చేతులు కట్టుకుని ఉండాలి. సావిత్రి కోసం పప్పు రుబ్బాలి. వీటన్నింటికీ ఆయన ఒప్పుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట. అది ఆయన స్థాయికి తగదని ఫీలైనవాళ్లు కూడా ఉన్నారట. అయితే ఎన్టీఆర్‌‌ మాత్రం దాన్ని ఓ పాత్రగా చూశారే తప్ప తన ఇమేజ్‌ గురించి పట్టించుకోలేదు. దాంతో దర్శక నిర్మాతలకు టెన్షన్ లేకుండా పోయింది.

అయితే వాళ్లకి అసలైన చాలెంజ్ రిలీజ్‌కి ముందు ఎదురైంది. టైటిల్స్లో ఎవరి పేరు ముందు వేస్తే ఎవరు హర్ట్ అవుతారో అనే భయం వేయడంతో తెలివిగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్‌‌ ఫొటో, దాని కింద సావిత్రి ఫొటో.. ఏఎన్నార్ ఫొటో, దాని కింద జమున ఫొటో, మధ్యలో ఎస్వీఆర్‌‌ ఫొటో.. ఇలా వేసి ఎవరినీ తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేశారు. ఏం చేస్తారు మరి.. అందరూ అందరే కదా! అయితే రిలీజ్ చేశాక ఎన్టీఆర్‌‌ పాత్ర విషయంలో ఫ్యాన్స్ గొడవ చేస్తారేమోనని భయపడ్డారు. పైగా ఇది ఆయనకు వందో సినిమా కూడాను. అందుకే ఎందుకైనా మంచిదని ముందు విజయావారి ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో, తమ సొంత థియేటర్‌‌లో ప్రత్యేకంగా షో వేశారు. అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేయడందో ధైర్యంగా సినిమాని రిలీజ్ చేశారు. 

ప్రతి పాట ఆణిముత్యమే!

సినిమా సక్సెస్‌లో మ్యూజిక్‌కి ఎప్పుడూ మేజర్ షేర్ ఉంటుంది. ఇందులోనూ అంతే. ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరపరిచిన ప్రతి పాటా ఆణిముత్యమే. వాటికి పింగళి నాగేంద్ర కూర్చిన ప్రతి మాటా అమృతతుల్యమే. కోలో కోలోయమ్మ.. ప్రేమయాత్రలకు బృందావనము.. లేచింది మహిళాలోకం.. అలిగిన వేళనె చూడాలి.. మనిషి మారలేదు.. సన్నగ వీచే చల్లగాలికి.. అన్ని పాటలూ హిట్టే. వీటిని చిత్రీకరించడంలో కొన్ని చిత్రాలు జరిగాయి. ‘కోలో కోలోయమ్మ’పాటలో హీరో హీరోయిన్లు నలుగురూ ఉండాలి. కానీ హీరోలిద్దరి డేట్స్ ఒక్కసారి దొరకలేదు. దాంతో రామారావ్, సావిత్రి జంటపై ఒకసారి.. ఏఎన్నార్, జములపై మరోసారి షూట్ చేశారు. ‘ప్రేమ యాత్రలకు’పాటని ఎక్కడ తీద్దాం అని డిస్కస్ చేస్తుంటే.. ‘విజయా గార్డెన్స్ చాలు.. ఊటీ, కశ్మీర్, కొడైకెనాల్ వరకు వెళ్లడం ఎందుకు’ అన్నారట చక్రపాణి. ఆ మాటలు విన్న పింగళి వాటినే లిరిక్స్ గా రాసేశారు. 

గుండమ్మ కథలో ఎంతో ఉంది!

ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు చాలా మంచి కుటుంబ కథా చిత్రమని,  అప్పట్లోనే పెద్ద కమర్షియల్ హిట్ అని చెబుతారందరూ. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇది అప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిన చిత్రమని అర్థమవుతుంది.  అంతర్లీనంగా అద్భుతమైన సందేశం ఉందని తెలుస్తుంది. నరసరాజు గారు రాసిన విధానం, పాత్రల చిత్రణ ఈ సినిమాని గొప్పగా నిలబెట్టాయనడంలో సందేహం లేదు. గుండమ్మ పాత్ర ఆధిపత్య ధోరణిని ఎత్తి చూపిస్తుంది. అంతేకాదు.. పిల్లల్ని సమానంగా పెంచాలి, కోడలిని సైతం కూతురిలా చూడాలి వంటి సందేశాల్ని ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులకు చేరవేశారు. ఎన్టీఆర్‌‌ పాత్ర మంచి చేయడం కోసం కొన్నిసార్లు తలవంచినా తప్పు లేదని చెబుతుంది. ‘పెద్దావిడ ఏదో అందని మనం కోపగించుకుంటే ఎట్లా? అసలు ఆశకి చావే లేదే పిచ్చిదానా’అనడంలో ఎంతో గొప్ప వ్యక్తిత్వం కనిపిస్తుంది. స్ఫూర్తినీ కలిగిస్తుంది. సావిత్రిలోని సహనం.. ఏఎన్నార్‌‌ క్యారెక్టర్‌‌లోని ఇంటెలిజెన్స్, జమున రోల్‌లోని అమాయకత్వం, డబ్బు ఎంతున్నా మంచితనం, సంస్కృతీ, సంప్రదాయం తర్వాతే ఏదైనా అనుకునే ఎస్వీఆర్‌‌ గొప్ప వ్యక్తిత్వం.. ఇవన్నీ అద్భుతంగా అనిపిస్తాయి.

అలాగే  రమణారెడ్డిది కామెడీ రోల్ అనుకుంటారు అందరూ. కానీ అతని ఆలోచనలు అడ్వాన్స్ డ్ లా ఉంటాయి. మాటలు షార్ప్ గా ఉంటాయి. పేపర్‌‌ చదువుతూ ‘పాలలో నీళ్లు కలిపినందుకు రెండు వేల రూపాయలు జరిమానా. అన్యాయం. పాలలో నీళ్లు కాకపోతే పెట్రోలు కలుపుతారా’అంటాడు. ‘ఆలోచించకుండానే అబద్ధం చెప్పేశాడు. పర్లేదు పర్లేదు.. పైకొచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి’అంటాడు ఒక సీన్‌లో. మనిషి తత్వాన్ని, సామాజిక ధోరణిని తన మాటలతో కళ్లకు కట్టేస్తాడు. ‘ఛఛఛ.. పాడు పేపరు.. అన్నీ చావు కబుర్లేనా. మొగుడితో పోట్లాడి పెళ్లాం బావిలో పడి చస్తే.. ఆకలి చావులని అబద్ధాలు. అదీ పెద్దక్షరాలతో మొదటి పేజీలో. పాడు పేపరు. డబ్బెట్టి కొనాలట’ అంటూ మీడియాని సైతం ఎండగడతాడు. అతనికి తెలియని విషయం లేదు. మాట్లాడని టాపిక్‌ లేదు. 


    

గుండమ్మగా రమ్యకృష్ణ.. 

ఇలా చెప్పుకుంటూ పోతే గుండమ్మ కథలో ఎన్నో విశేషాలున్నాయి. ఎన్నెన్నో విశిష్టతలూ ఉన్నాయి. వినోదాన్ని మాత్రమే పంచివుంటే ఇది కూడా మామూలు కమర్షియల్ సినిమాలా మిగిలిపోయేదేమో. కానీ మెచ్యూర్డ్ రైటింగ్.. స్టైలిష్ మేకింగ్.. సూపర్బ్ పర్‌‌ఫార్మెన్సెస్.. సెన్సిబుల్ డైలాగ్స్.. ఇవన్నీ కలిపి ‘గుండమ్మకథ’ని ఓ క్లాసిక్‌గా నిలబెట్టాయి. అందుకే ఈ చిత్రాన్ని మళ్లీ తీయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎన్టీఆర్‌‌, ఏఎన్నార్ వారసులైన బాలకృష్ణ, నాగార్జునలతో తీద్దామనుకున్నారు. వీలు కాకపోవడంతో తారక్, నాగచైతన్యలతో ప్లాన్ చేశారు. ప్రతిసారీ ఒక్కటే సమస్య. గుండమ్మగా రమ్యకృష్ణని తీసుకుంటారనే వార్తలూ వచ్చాయి. కానీ అవన్నీ వార్తలుగానే నిలిచిపోయాయి. కాని ఇంతవరకూ ఈ సినిమాని మళ్లీ తీయాలనే ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అయినా కొన్ని అద్భుతాలని రీక్రియేట్ చేయాలని ట్రై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అద్భుతమనేది.. ఒక్కసారే జరుగుతుంది.