ఫేక్​ లైసెన్స్‌‌లతో గన్స్​ దందా

ఫేక్​ లైసెన్స్‌‌లతో గన్స్​ దందా

హైదరాబాద్, వెలుగు: నకిలీ గన్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లు ఇస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. ఆల్‌‌‌‌ఇండియా పర్మిట్‌‌‌‌పేరుతో జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌ అడ్డాగా సాగుతున్న దందాకు వెస్ట్‌‌‌‌జోన్ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు అడ్డుకట్ట వేశారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫేక్ లైసెన్స్‌‌‌‌ సప్లయర్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి ఫేక్ రబ్బర్ స్టాంప్స్, ఫేక్ గన్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లు, 33 బోర్ గన్స్, రివాల్వర్‌‌‌‌‌‌‌‌, 140 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్‌‌‌‌ సెక్యూరిటీ ఏజెన్సీలకు ఫేక్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జాతీయ భద్రతకు భంగం వాటిల్లేలా దందా చేస్తున్న ఈ గ్యాంగ్‌‌‌‌ వివరాలను సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ గురువారం వెల్లడించారు.

బతకడానికి వచ్చి..

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌ రాజౌరి జిల్లాకు చెందిన అల్తాఫ్ హుస్సేన్ (24).. జీవనోపాధి కోసం 2013లో హైదరాబాద్‌‌‌‌ వచ్చాడు. సికింద్రాబాద్‌‌‌‌ వెస్ట్ మారేడ్‌‌‌‌పల్లిలోని గ్రేస్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సెక్యూరిటీ సర్వీసెస్‌‌‌‌లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఎస్‌‌‌‌ఐఎస్‌‌‌‌ క్యాష్ సర్వీస్‌‌‌‌లో గన్‌‌‌‌మెన్‌‌‌‌గా చేరాడు. ఇందుకోసం జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని స్థానిక మేజిస్ట్రేట్ ఆఫీస్‌‌‌‌లో లంచం ఇచ్చి ఆల్‌‌‌‌ ఇండియా పర్మిట్‌‌‌‌ గన్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ తీసుకున్నాడు. దాంతో డబుల్ బోర్ తుపాకీని కొనుగోలు చేశాడు. గన్‌‌‌‌ లైసెన్స్ ప్రాసెస్‌‌‌‌ తెలియడంతో సికింద్రాబాద్‌‌‌‌లో గన్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లు తయారు చేసేందుకు ప్లాన్ చేశాడు. వెస్ట్‌‌‌‌ మారేడ్‌‌‌‌పల్లిలోని స్టాంప్‌‌‌‌ వెండర్‌‌‌‌‌‌‌‌ హఫీజుద్దీన్‌‌‌‌ (32) వద్ద రాజౌరీ అడిషనల్ మేజిస్ట్రేట్‌‌‌‌, రాజౌరీ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌, ఆల్‌‌‌‌ఇండయా పర్మిట్‌‌‌‌ గన్‌‌‌‌లైసెన్స్‌‌‌‌ పేరుతో రబ్బర్ స్టాంప్స్‌‌‌‌ తయారు చేశాడు.

సెక్యూరిటీ ఏజెన్సీలకు సరఫరా

వెస్ట్‌‌‌‌ మారేడ్‌‌‌‌పల్లిలోని గ్రేస్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సెక్యూరిటీ సర్వీసెస్‌‌‌‌ రీజనల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ వెంకట కొండారెడ్డి(45), జిరాక్స్‌‌‌‌ షాపు ఓనర్‌‌‌‌ ‌‌‌‌ఐ.శ్రీనివాస్‌‌‌‌(33)తో కలిసి హైదరాబాద్‌‌‌‌లోని ఏజెన్సీలకు ఫేక్ గన్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లను అల్తాఫ్ హుస్సేన్‌‌‌‌ అందిస్తున్నాడు. ఈ లైసెన్స్‌‌‌‌లతో బీహార్‌‌‌‌‌‌‌‌, యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో రూ.40 వేల నుంచి రూ.60 వేలకు గన్నులు కొనుగోలు చేశారు. వీటిని వివిధ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల గార్డులకు అమ్మారు. ఒక్కో సెక్యూరిటీ గార్డ్‌‌‌‌ నుంచి అదనంగా రూ.20 వేలు వసూలు చేశారు. సికింద్రాబాద్‌‌‌‌లోని ఏషియన్ సెక్యూరిటీ సర్వీసెస్, నందమూరిసెక్యూరిటీ అండ్‌‌‌‌ సర్వీసెస్, గ్రేస్ మేనేజ్‌‌‌‌మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ వంటి సంస్థల్లో.. ఇలాంటి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఫేక్‌‌‌‌ గన్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ల సమాచారం వెస్ట్‌‌‌‌ జోన్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులకు అందడంతో సెక్యూరిటీ ఏజెన్సీలపై నిఘా పెట్టారు. 30 సింగిల్ బోర్ వెపన్స్,3 డబుల్ బోర్ వెపన్స్, రివాల్వర్, 140 రౌండ్ల బుల్లెట్లు, 34 నకిలీ గన్‌‌‌‌ లైసెన్స్ బుక్స్, 29 ఉపయోగించని గన్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ బుక్స్‌‌‌‌, 9 గన్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లు, నకిలీ స్టాంప్‌‌‌‌తో ఉన్న 9 గన్స్‌‌‌‌, 6 రబ్బర్‌‌‌‌ ‌‌‌‌స్టాంప్స్‌‌‌‌, ఎన్‌‌‌‌ఓసీ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. 40 మంది ప్రైవేట్‌‌‌‌ సెక్యురిటీ గార్డులకు నోటీసులు ఇచ్చి, విచారించి పంపారు. ఆర్మ్స్‌‌‌‌ యాక్ట్ ప్రకారం మాత్రమే ప్రైవేట్‌‌‌‌సెక్యూరిటీ ఏజెన్సీలు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఫేక్‌‌‌‌ గన్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌లపై నిఘా పెడతామని చెప్పారు. మూడు కమిషనరేట్ల పోలీసులను అప్రమత్తం చేస్తామని తెలిపారు.