- ఇంటర్లో స్టేట్ర్యాంక్స్
- 100 శాతం పాస్ పర్సంటేజ్
- మళ్లీ బాలికలదే హవా
నెట్వర్క్, వెలుగు: ఇంటర్మీడియట్ రిజల్ట్స్‌లో గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాటారు. కార్పొరేట్కాలేజీల స్టూడెంట్లకు దీటుగా మార్కులు తెచ్చుకొని రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థినిలు స్టేట్ ర్యాంకులు సాధించారు. సెకండియర్ఎంపీసీ స్టూడెంట్ప్రజ్ఞ 1000 మార్కులకు గాను 995 మార్కులు సాధించింది. కావ్య 986 మార్కులు తెచ్చుకుంది. బైపీసీలో ప్రహస్య 986 తెచ్చుకోగా చైతన్య, అంజలి, హారికలు 980 సాధించారు.
ఒకేషనల్ లో శ్రీ వర్ష 985తో సత్తా చాటింది. ఫస్టియర్‌లో ఎంపీసీలో సాయి త్రిణీత 470 మార్కులకు గాను 468 మార్కులతో ఔరా అనిపించింది. బైపీసీలో శ్వేత 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించగా స్పందన 435 మార్కులు తెచ్చుకుంది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ రమా కల్యాణి అభినందించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని తాటిపల్లి గురుకుల స్కూల్బాలికలు ప్రభంజనం సృష్టించారు.
ఫస్టియర్, సెకండియర్‌లో 99శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ఎంపీసీలో దీక్షిత, అక్షిత 467 మార్కులు తెచ్చుకున్నారు. సెకండియర్ ఎంపీసీలో రుచిత 994, బైపీసీలో ప్రణీత 992 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ మానస తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్ఎంపీసీలో ఎం.అక్షయ 458 మార్కులు సాధించగా, బైపీసీలో ఎం.అంజన్ 425 మార్కులు తెచ్చుకున్నాడు. ఉత్తమ మార్కులు సాధించిన నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీ స్టూడెంట్స్‌ను డీఈవో అశోక్ కుమార్ అభినందించి సన్మానించారు.
సెకండియర్‌లో ఆసిఫాబాద్‌కు 3వ స్థానం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా స్టూడెంట్లు సత్తా చాటారు. ఫస్టియర్ లో 9వ స్థానంలో నిలిచిన జిల్లా విద్యార్థులు.. సెకండియర్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. ఫస్టియర్‌లో 4292 మంది పరీక్షలు రాయగా 2862 మంది పాసయ్యారు. సెకండియర్ లో 3745 మంది ఎగ్జామ్స్ రాయగా 3077 మంది పాసయ్యారు. బాలురు 79.04 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 88.93 శాతం మంది పాసయ్యారు. మొత్తం 82.16 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచారు.
మెరుగైన జగిత్యాల జిల్లా ర్యాంకు
జగిత్యాల జిల్లా ఇంటర్ ఫలితాలు ఆశాజనకంగా నిలిచాయి. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగి రాష్ట్ర ర్యాంకింగ్స్‌లో ముందడుగు వేసింది. ఫస్టియర్ జనరల్‌లో 6,645 మంది పరీక్షలకు హాజరవగా 4,174 మంది ఉత్తీర్ణులయ్యారు. 62.81 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 13వ స్థానాన్ని సాధించింది. గతేడాది జిల్లా 24వ స్థానంలో ఉండగా ఇప్పుడు ర్యాంకును మెరుగుపర్చుకుంది. సెకండియర్‌లో 5,792 మందికి 4,338 మంది పాస్ కావడంతో 74.9 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దీంతో జిల్లా 18వ స్థానంలో నుంచి 10వ స్థానానికి ఎగబాకింది. వోకేషనల్ కోర్సుల్లో ఫస్టియర్ లో 59.81 శాతం, సెకండియర్ 72.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం ఫలితాల్లో బాలికలు మళ్లీ తమ ప్రతిభ చాటుకుని, బాలుర కంటే అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు.
మంచిర్యాల జిల్లా వెనుకంజ
ఇంటర్ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా వెనుకబడింది. సెకండియర్‌లో రాష్ట్రంలో 19వ స్థానం, ఫస్టియర్‌లో 21వ స్థానం సాధించి నిరాశపర్చింది. సెకండియర్‌లో 2,137 మంది బాయ్స్‌కు 1,341 మంది, 2,604 మంది గర్ల్స్‌కు 2,055 మంది పాసయ్యారు. బాయ్స్ 62.75 శాతం, గర్ల్స్ 78.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఓకేషన్‌లో జిల్లాకు పదో స్థానం దక్కింది. అలాగే ఫస్టియర్‌లో 2424 మంది బాయ్స్‌కు 1181 మంది, గర్ల్స్ 2,948 మందికి గాను 2,059 మంది పాసయ్యారు. ఫస్టియర్‌లో బాయ్స్ 48.72 శాతం, గర్ల్స్ 69.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,372 మందికి గాను 3,240 మంది పాసయ్యారు. 60.31 శాతం రిజల్ట్‌తో జిల్లాకు 21వ స్థానం దక్కింది. ఫస్టియర్ ఓకేషనల్‌లో మరింత దిగజారి 23వ ప్లేస్‌కు పరిమితమైంది.
సెకండియర్‌లో లాస్ట్.. ఫస్టియర్‌లో 32వ స్థానం
- ఆదిలాబాద్ జిల్లాలో పడిపోయిన ఫలితాలు
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా అట్టడుగున నిలిచింది. రాష్ట్రం చివరి స్థానానికి పడిపోయింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఫస్టియర్ లో 32వ స్థానంలో ఉండగా సెకండియర్ లాస్ట్ లో నిలిచింది. ఫస్టియర్‌లో గత సంవత్సరం కంటే ఐదు స్థానాలు దిగజారింది. జనరల్ కోర్సులో 7,701 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 3,910 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఉత్తీర్ణత శాతం 50.77గా నమోదైంది. సెకండియర్‌లో గతేడాదితో పోల్చితే ఏకంగా 21 స్థానాలకు పడిపోవడం విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నిస్తోంది. మొత్తం 7518 మంది పరీక్షకు హాజరు కాగా, 4699 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 62.50గా నమోదైంది.
