కోనేరులో కాళ్లు కడిగిన యూట్యూబర్.. అపవిత్రం అయ్యిందనీ శుద్ధి కార్యక్రమం చేపట్టిన గురువాయుర్ దేవస్థానం

కోనేరులో కాళ్లు కడిగిన యూట్యూబర్.. అపవిత్రం అయ్యిందనీ శుద్ధి కార్యక్రమం చేపట్టిన గురువాయుర్ దేవస్థానం

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సరదా కోసమో, పాపులారిటీ కోసమో లేదంటే కంటెంట్ కోసమో తీస్తున్న వీడియోలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆ మధ్య తిరుమలలో రీల్స్ చేయడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అంతకు మించిన వివాదాస్పద ఘటన కేరళలో జరిగింది. దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన గురువాయూర్ దేవస్థానంలో ప్రముఖ యూట్యూబర్ రీల్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆలయాన్ని అపవిత్రం చేశారాని.. ఏకంగా ఆరు రోజుల శుద్ధి కార్యక్రమానికి పూనుకున్నారంటే ఎంత వివాదాస్పదం అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. 

వివరాల్లోకి వెళ్తే.. మలయాళం బిగ్బాస్ కంటెస్టెంట్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జాస్మిన్ జాఫర్ చేసిన రీల్స్ తీవ్ర వివాదాస్పదం అవ్వటంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కారణం.. శ్రీకృష్ణ దేవాలయాలలో పేరుగాంచిన కేరళ గురువాయూర్ దేవస్థానంలో రీల్ చేయడం. కోనేరులో కాళ్లు ఆడిస్తూ వీడియో షూట్ చేయడంతో దేవస్థానం బోర్డుతో పాటు అక్కడి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 

పవిత్రమైన దేవస్థానం కోనేరులో కాళ్లు పెట్టి అపవిత్రం చేసిందని భగ్గుమంటున్నారు భక్తులు. హిందూ ఆచారాలను, సంప్రదాయాలను ఒక హిందువేతర వ్యక్తి అపవిత్రం చేసిందని మండిపడుతున్నారు. 

ఆరు రోజుల శుద్ధి కార్యక్రమం:

దేవస్థానం కొలనులో కాళ్లు పెట్టి అపవిత్రం చేసిందని భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఆరు రోజుల పాటు శుద్ధి కార్యక్రమం చేయనున్నట్లు ప్రకటించారు. అందులో 18 రకాల ప్రత్యేక పూజల ద్వారా సంప్రోక్షణ చేయనున్నట్లు ప్రకటించారు. మంగళవారం (ఆగస్టు 26) నుంచే శుద్ధి కార్యక్రమం మొదలుపెట్టినట్లు చెప్పారు. ఈ ఆరు రోజులు శుద్ధి కార్యక్రమాలు చేస్తున్నందున.. దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. 

దేవస్థానంలో షూట్ చేసి, ఆలయ పరిసరాలు అపవిత్రం చేశారని ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవస్థానంలో ఫోటోగ్రఫీ నిషేధిస్తూ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు. 

ఈ ఇష్యూ తీవ్ర వివాదం అవ్వడంతో జాస్మిన్ క్షమాపణ చెప్పింది. ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం లేదని.. ఫోటో గ్రఫీ నిషేధం ఉన్న సంగతి తెలియదని చెప్పింది. దేవాలయ ఆచారాలు తెలియకే రీల్ చేశానని.. క్షమాపణలు చెప్పింది.