ఏపీ ఎన్నికల్లో భూ కుంభకోణాలే మా అజెండా..

ఏపీ ఎన్నికల్లో భూ కుంభకోణాలే మా అజెండా..

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో  రాజకీయ వేట ఊపందుకుందని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో భూ కుంభకోణాలే తమ ఎన్నికల అజెండా అని పేర్కొన్నారు. తాము లేవనెత్తిన ఆరోపణలపై విచారణను ఎదుర్కొనే దమ్ముంటే.. సీబీఐ, జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.  వైసీపీ హయాంలో  నాలుగేళ్ళలో అవినీతి, కుంభకోణాలపై తాము చర్చలకు సిద్ధమేనని సవాల్ విసిరారు. తొమ్మిదేళ్లలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం మూడున్నర రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చిందని తెలిపారు. మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేసే పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధమా? వైసీపీకి బీజేపీ అనుకూలంగా ఉందనే భ్రమలు కలిగించే డ్రామా రాజకీయలు మానుకోవాలని సూచించారు.   ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు మానుకంటే మంచిదని హితవు పలికారు. కేంద్ర హోంమంత్రి బహిరంగ సభ ప్రసంగాల్లో.. ఏ అంశాలు ప్రస్తావించాలో సూచించడానికి రాష్ట్ర మంత్రులు ఎవరు? అని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా వ్యవహారం.. కేంద్రం రాడార్‌లో ఉందని చెప్పారు.    తమకు బీజేపీ అండ అవసరం లేదని ...  సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. 

విశాఖ భూ కుంభకోణాలపై గవర్నర్ కు ఫిర్యాదు

వైజాగ్‌లో భూ కబ్జాదారులను సీఎం జగన్ ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని జీవీఎల్ కోరారు. సిట్ నివేదికను బయటపెట్టాలని అడిగారు. విశాఖ భూ కుంభకోణాలపై తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై రాజకీయ పోరాటం చేస్తామని జీవీఎల్ వెల్లడించారు. దమ్ముంటే.. ప్రభుత్వం తన చిత్త శుద్ధిని నిరూపించుకునేందుకు ఎంక్వైరీకి సిద్ధం కావాలని అన్నారు. రాజకీయ ప్రేరేపిత చర్యగా భావించకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ న్యాయస్థానానికి వెళ్లడం లేదన్నారు. రాజకీయ ప్రచార కక్కుర్తితో.. రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా అని, పథకాలు ఆపేస్తామనే ఆలోచన కేంద్రం చేయదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు సాధించడం కోసం వేట జరుగుతోందని అన్నారు. వైసీపీ, టీడీపీలు భ్రమ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. జాతీయ పార్టీగా బీజేపీపై విమర్శలు చేసే నాయకులు.. వాళ్ల స్థాయిని తెలుసుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు