
- నియంత్రణపై ఫోకస్ పెట్టిన జీడబ్ల్యూఎంసీ
- ట్రాన్స్ పోర్ట్ చేసిన బండ్లు కూడా సీజ్ చేసేలా ప్లాన్..
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ ఫ్రీ వైపు అడుగులు వేస్తోంది. పెరుగుతున్న కాలుష్యాన్ని కంట్రోల్ చేయడంతోపాటు నగరాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై ఫోకస్ పెట్టగా, 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, ట్రాన్స్ పోర్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఉమ్మడి జిల్లాకు ఇక్కడి నుంచే..
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా జరుగుతుండగా, నగరంలోని బీట్ బజార్, బట్టలబజార్, పిన్నవారి స్ట్రీట్, శివనగర్, ఏనుమాముల, హనుమకొండ టైలర్ స్ట్రీట్ తదితర ప్రాంతాల నుంచే ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ఇతర వస్తువులు జిల్లా అంతటా సప్లై అవుతున్నాయి. పెద్దఎత్తున ప్లాస్టిక్ ఉపయోగిస్తుండటంతో ఎక్కడ చూసినా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో అన్నీ కలిపి 26 వేలకుపైగా దుకాణాలుండగా, నగరంలో నిత్యం వెలువడుతున్న 450 టన్నుల చెత్తలో దాదాపు సగ భాగం వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటుండటం గమనార్హం.
120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ తో పొల్యూషన్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ ప్లాస్టిక్ కంట్రోల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు జరిపే షాపుల్లో అడపాదడపా తనిఖీలు నిర్వహించి, ఫైన్లు విధిస్తున్నారు. ఇలా సీజ్ చేసిన దానితోపాటు చెత్త నుంచి సేకరించిన ప్లాస్టిక్ అంతా నగరంలోని డీఆర్సీసీ సెంటర్లలో గుట్టలుగా పేరుకుపోతోంది. దీంతో మున్సిపల్ ఆఫీసర్లు ఆ ప్లాస్టిక్ ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు.
ప్లాస్టిక్ అమ్మితే లక్ష ఫైన్, దుకాణం సీజ్
పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఆఫీసర్లు ప్లాస్టిక్ నియంత్రణ వైపు అడుగులు వేస్తున్నారు. ప్లాస్టిక్ రవాణాతోపాటు వినియోగాన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మే షాపులపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు జరిపితే రూ.లక్ష ఫైన్ విధించడంతోపాటు సదరు షాపును సీజ్ చేసేలా యాక్షన్ చేపడుతున్నారు.
రూల్స్ కు విరుద్ధంగా గోదాముల్లో స్టోర్ చేసినా, ప్లాస్టిక్ ఉత్పత్తులను రవాణా చేసిన వెహికల్స్ ను సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు హోల్ సేల్, రిటైల్ దుకాణాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు ఆపేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా కంపోస్ట్ గా మారే బయో డిగ్రేడబుల్ సంచులు, జ్యూట్ బ్యాగులు వినియోగించాలని సూచిస్తున్నారు.
స్టీల్ బ్యాంక్ లు పెడితే మేలు..
సాధారణంగా పెండ్లిళ్లు, శుభకార్యాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల తీవ్ర నష్టం జరుగుతుండటంతో మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గం, హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. పెండ్లిళ్లు, ఫంక్షన్లకు ఉపయోగపడేలా దాదాపు 13 రకాల స్టీల్ వస్తువులను మహిళా సంఘాలకు పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగానికి చెక్ పడుతుందని భావిస్తున్నారు.
కాగా, నగరంలో ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువవుతుండగా, స్టీల్ బ్యాంకుల ఏర్పాటుతో పొల్యూషన్ కంట్రోల్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా చొరవ తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.