కొత్త ఎలక్షన్​ కమిషనర్​లుగా .. జ్ఞానేశ్ కుమార్, సుఖ్​బీర్ సంధూ

కొత్త ఎలక్షన్​ కమిషనర్​లుగా .. జ్ఞానేశ్ కుమార్, సుఖ్​బీర్ సంధూ
  •  గెజిట్ రిలీజ్ చేసిన కేంద్ర న్యాయ శాఖ
  • ఎంపిక ప్రక్రియలో లోపాలున్నాయి: సెలక్ట్ కమిటీ మెంబర్ అధీర్ రంజన్ చౌదరి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)లో ఖాళీగా ఉన్న రెండు కమిషనర్ పదవుల్లో మాజీ ఐఏఎస్ అధికారులు జ్ఞానేశ్​కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధూ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ గెజిట్ రిలీజ్ చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల చట్టం – 2023 ప్రకారం.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వీరిని నియమించినట్లు పేర్కొంది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి వీరిద్దరు ఈసీఐలో ఎలక్షన్ కమిషనర్లుగా కొనసాగుతారని స్పష్టం చేసింది. 

అంతకుముందు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్​సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ లీడర్ అధీర్ రంజన్ చౌదరితో కూడిన సెలెక్ట్ కమిటీ కొత్త ఈసీలుగా వీరి పేర్లను ఫైనల్ చేసింది. న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్, హోంశాఖ, డీవోపీటీ సెక్రటరీలు మెంబర్లుగా ఉన్న సెర్చ్ కమిటీ 212 మంది అభ్యర్థుల నుంచి ఆరుగురి పేర్లను సెలెక్ట్​ కమిటీకి ప్రతిపాదించింది.

కొత్త ఈసీలు బాధ్యతల తర్వాతే ఎన్నికల షెడ్యూల్

లోక్ సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్​ రెడీ అవుతున్న టైమ్​లో అనూహ్యంగా ఈసీఐలో రెండు ఈసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఫిబ్రవరి 14న కమిషనర్ అనూప్ చంద్ర పాండే రిటైర్​ అయ్యారు. మరోవైపు మార్చి 8న అనూహ్యంగా మరో కమిషనర్ అరుణ్ గోయెల్  రాజీనామా చేశారు. దీంతో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ పై ప్రభావం పడింది. ఇప్పుడు కొత్తగా ఎంపికైన ఇద్దరు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఎలక్షన్ షెడ్యూల్ రానున్నట్లు సమాచారం.

సీజేఐ ఉంటే వేరుగా ఉండేది: అధీర్ రంజన్

ఇద్దరు కొత్త ఈసీల ఎంపిక ప్రక్రియలో లోపాలున్నాయని అధీర్ రంజన్  ఆరోపించారు. అభ్యర్థుల వడపోత, ఎంపికలో పాల్గొన్న ఆరుగురిలో ముగ్గురు కేంద్ర ప్రభుత్వ సభ్యులు కాగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులేనన్నారు. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన అభ్యర్థులనే ఈ పదవులకు ఎంపిక చేసిందన్నారు. ఒక్క రాత్రిలో 212 పేర్లను పరిశీలించి వారిలో అత్యంత సమర్థులను ఎంపిక చేయడం ఎట్ల సాధ్యమైతదని ప్రశ్నించారు. అలాగే సెలెక్ట్ కమిటీ మీటింగ్ కు 10 నిమిషాల ముందు ఆరుగురి పేర్లతో షార్ట్‌‌లిస్ట్ ఇచ్చారన్నారు.  ఆ ఆరుగురి పేర్లను ఎలా షార్ట్‌‌లిస్ట్ చేశారనే దానిపైనా స్పష్టత లేదన్నారు. అందుకే సెలక్ట్ కమిటీలో సీజేఐ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు.

 ఇద్దరూ 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లే

కొత్త ఈసీలుగా ఎంపికైన జ్ఞానేశ్​ కుమార్, సుఖ్‌‌బీర్ సింగ్ సంధూ ఇద్దరు కూడా 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లే. జ్ఞానేశ్ ఆర్టికల్ 370 రద్దు టైంలో కేంద్ర హోంశాఖలో కాశ్మీర్ డివిజన్ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. కోఆపరేటివ్, పార్లమెంటరీ ఎఫైర్స్ మినిస్ట్రీల్లో కూడా పని చేశారు. సుఖ్‌‌బీర్ సింగ్ సంధూ  జనవరి 31న ఉత్తరాఖండ్ సీఎస్ గా రిటైర్ అయ్యారు. గతంలో  ఎన్ హెచ్ఏఐ చైర్మన్‌‌గా పనిచేశారు.