విశ్వాసం : విద్యాభ్యాసానికి అర్హతలు

విశ్వాసం : విద్యాభ్యాసానికి అర్హతలు

శీలేన శోభతే విద్య... సత్ప్రవర్తనతో కూడిన విద్య మాత్రమే శోభిస్తుంది.విద్యలేని వాడు వింత పశువు.. విద్య అంటే అక్షర జ్ఞానం మాత్రమే కాదు... లౌకిక జ్ఞానం కూడా అని అర్థం. అటువంటి చదువు లేని వాడు వింత పశువుతో సమానము.దొరలు దోచలేరు, దొంగలెత్తుకు పోరు... అని విద్య గురించి చెప్తారు. నిజమైన జ్ఞాని నుండి చదువును... దొరలు కాని.. దొంగలు కాని అపహరించలేరు. కపట జ్ఞాని  అయి ఉంటే, వాడి దగ్గర నుండి అన్నీ అపహరిస్తారు.
విద్య నిగూఢ గుప్తమగు ధనంబు.. విద్య అనేది కంటికి కనపడని నిధి వంటిది అని అర్థం.
ఇలా –

విద్య గురించి ఎన్నో ఉదాహరణలు మన భారతీయ వాఙ్మయంలో కనిపిస్తాయి. అంటే విద్యకు ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలను ఒక్కో ఉదాహరణతో వివరించారు.విద్యార్థి అంటే జ్ఞాన సముపార్జన చేసినవాడు అని అర్థం. కాని ఇప్పటి పరిస్థితుల్లో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే బాలబాలికలనందరినీ విద్యార్థులు అనే అంటున్నాం.

చాలాకాలం క్రితం...

ఎవరు విద్యకు యోగ్యులు, ఎవరు అయోగ్యులు అనే విషయాన్ని పరిశీలించిన పిదపే వారికి విద్య బోధించేవారు గురువులు. విద్య నేర్చుకోవాలనుకునేవారికి కూడా కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలంటారు శ్రీరామకృష్ణపరమహంస. ఇందుకు నచికేతుడి కథ మంచి ఉదాహరణ..
‘మనసును మరలుగొల్పే ప్రియమైన విషయాలచే విచలితుడు గాక, శ్రేయోమార్గాన్నే ఎన్నుకొన్నందుకు నచికేతుడు విద్యకు యోగ్యుడు’ అని యముడు తలచాడు. 
పాఠశాలలకు వెళ్లే బాలబాలికలకు ఇతర అంశాల మీదకు మనసు పోకూడదు. అలా మనసు పోయే వారికి విద్య బోధించినప్పటికీ నిరుపయోగమే అంటారు పెద్దలు. ‘విద్యాభీప్సినం నచికేతనం మన్యే’ నచికేతా! నువ్వు విద్యను అభిలషించేవాడవని నేను తలంచుచున్నాను’ అంటాడు యముడు.

బడిలోనో, కాలేజీలోనో చదవడానికి చేరిన వాళ్లని సాధారణంగా విద్యార్థులు అంటాం. అది ఉదరపోషణార్థం చదివే చదువు’ అన్నారు శ్రీరామకృష్ణులు.
‘నచికేతుడు అటువంటి మందబుద్ధి కాదు. అక్షారాలా జ్ఞాన పిపాసి. అతడికి కావలసింది పరావిద్య. ఏ జ్ఞానముచే  అక్షర బ్రహ్మాన్ని చేరగలమో ‘తదక్షరమధిగమ్యతే’ అన్నది ముండకోపనిషత్తు. ఆ జ్ఞానం, సత్యం పట్ల గల నచికేతుడి అకుంఠిత నిష్ఠను యముడు మెచ్చుకున్నాడు. ‘సత్వా కామా బహవో అలోలుపంత’... ‘‘అనేకాలైన కామ్య విషయాలు నిన్ను ప్రలోభపెట్టలేకపోయాయి అన్నాడు యముడు ఇది విద్య గురించి మనిషికి గల ఉత్కృష్ట భావం. అర్థించే విద్య జ్ఞానానర్జన కొరకే అని భావం. సాధారణమైన లౌకిక విద్యలో కూడా తపోదీక్షలో సావధానంగా జ్ఞానం ఆర్జించే విద్యార్థికి మంచి ఫలితాలు దొరకుతాయి. 

తరగతిని, గ్రంథాలయాన్ని  విడిచి, గంటల తరబడి క్యాంటిన్లలో వృథా కాలక్షేపం చేసే విద్యార్థికి ఎంత చదువు నేర్పించినా ఏం లాభం? కళాశాలలో గడిపే కొద్ది సంవత్సరాల వ్యవధిలో ఆకళించుకొనగలిగినంత జ్ఞానాన్ని గ్రహించాలి. ఆపైన, జీవితాంతం ఆ జ్ఞానం వృద్ధి అయేటట్లు క్రమశిక్షణతో వ్యవహరించాలి. ఆ జ్ఞానం శీలసంపదగా పరిణమించాలి. వికారాలకు లోనయే ఈ నశ్వర జగత్తుకు, అనాత్మకు సంబంధించిన అపరా విద్యతో విద్యారంభం జరుగుతుంది. కానీ... అక్కడ ఆగిపోకూడదు. 

మనిషిలోను విశ్వంలోను ఉన్న నిర్వికార, అమర వస్తువును తెలిపే పరావిద్య లేక ఆధ్యాత్మిక జ్ఞానం ఆర్జించడానికి అది ఉపయోగపడాలి. ఈ ఉదార దృక్పథం లేని చదువు నిరర్థకం. అది మోక్షానికి ఉపయోగపడదు. కాబట్టి అది అవిద్య’ అని ‘ఉపనిషత్తుల సందేశం’ పుస్తకం మనకు విద్య గురించి విపులంగా వివరిస్తోంది.

ఒక గురుకులంలో కొంతమంది విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటున్నారు. గురుపత్ని తయారు చేసిన భోజనం తింటుండేవారు. ఆవిడ ప్రతిరోజూ ఆముదంతో వంట చేసేది. విద్యార్థులంతా మారు మాట్లాడకుండా ఆ అన్నాన్ని తినేవారు. ఒకరోజు ఒక విద్యార్థి, ‘అమ్మా! ఈ రోజు వంట ఆముదంతో చేసినట్లున్నారు’ అని వినయంగా పలికాడు. 

అప్పుడు ఆ గురుపత్ని, ‘నీకు చదువు మీద శ్రద్ధ తగ్గింది. అందుకే ఆముదంతో చేస్తున్నాననే విషయాన్ని ఈ రోజు గమనించావు. నేను ప్రతిరోజూ ఆముదంతోనే వంట చేస్తున్నాను’ అని పలికింది. విద్యార్థి సిగ్గుతో తల వంచుకున్నాడు. చదువు మీద శ్రద్ధ ఉన్నవారికి ఇతర విషయాల మీద మనసు మళ్లే అవకాశం ఉండదు. అంతటి ధ్యానంతో చదువుకోవాలి. చదువును తపస్సులా భావించాలి’ అని పలికాడు ఆ గురువు.

దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు, అసురుల గురువైన శుక్రాచార్యుడి దగ్గరకు విద్య అభ్యసించడానికి వచ్చాడు. అతడు అందగాడు. అతడిని చూసి శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని మనసు పడింది. కానీ విద్య మీద మాత్రమే ధ్యాస ఉన్న కచుడు ఆమెను నిరాకరించాడు. మృతసంజీవని విద్యను అభ్యసించాడు. చదువు మీద నుండి దృష్టిని పక్క దారి పట్టకుండా చూసుకున్నాడు.

ఇటీవలి కాలంలో విద్యార్థుల్లో కొందరు ఇటువంటి ప్రలోభాలకు లోబడి, చదువును నిర్లక్ష్యం చేసి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అటువంటివారందరికీ ఈ కథలు కనువిప్పు కలిగించాలి.

 డా. పురాణపండ వైజయంతిఫోన్ : 80085 51232