Hansika Motwani: గృహహింస కేసులో హన్సికకు చుక్కెదురు.. అసలేం జరిగిందంటే?

Hansika Motwani: గృహహింస కేసులో హన్సికకు చుక్కెదురు.. అసలేం జరిగిందంటే?

నటి హన్సిక మోత్వానీ మరో సారి వార్తల్లో నిలిచారు. ఈ సారి న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుని హాట్ టాపిక్ గా మారారు.  తనపై నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలని  బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే  న్యాయస్థానం నుంచి వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారి పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో హన్సికతో పాటు ఆమె తల్లి జ్యోతిపై కూడా తీవ్ర ఆరోపణులు ఉన్నాయి.  కుటుంబ వివాదం కోర్టు మెట్లెక్కడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 
ముస్కాన్ జేమ్స్ ఆరోపణలు..

హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ, టీవీ నటి ముస్కాన్ జేమ్స్ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే, వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2022లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే, ముస్కాన్ జేమ్స్ గృహహింస చట్టం కింద హన్సిక, ఆమె తల్లి జ్యోతి, సోదరుడు ప్రశాంత్‌పై కేసు నమోదు చేసింది. ముస్కాన్ ఆరోపణల ప్రకారం, ఆమెను అదనపు కట్నం కోసం వేధించారని, శారీరకంగా, మానసికంగా హింసించారని పేర్కొంది. అయితే, హన్సిక, ఆమె తల్లి ఈ ఆరోపణలను ఖండించారు.

కోర్టులో పోరాటం..

ఈ కేసు నమోదైన తర్వాత  ముంబై సెషన్స్ కోర్టు హన్సిక, జ్యోతిలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ వచ్చినప్పటికీ, తమపై ఉన్న కేసును పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ హన్సిక, ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, కేసు ఉద్దేశపూర్వకంగా నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వారి పిటిషన్‌ను కొట్టివేసింది. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, కాబట్టి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ పరిణామం హన్సికకు కొంత ఇబ్బందికరంగా మారనుంది. తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

►ALSO READ | మూవీ లవర్స్‌కి రిలీఫ్.. జీఎస్టీ మార్పులతో తగ్గనున్న టిక్కెట్ ధరలు..!