
ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత పచారీ సరుకుల నుంచి ప్యాకేజ్డ్ వస్తువుల వరకు అనేక ఉత్పత్తులపై గతంలో ఉన్న పన్నుల స్లాబ్ రేట్లలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 22 నుంచి కొత్త పన్ను రేట్లకే ఉత్పత్తులను ప్రజలకు అమ్మాలని.. పాత రేట్లకు అమ్మెుద్దని కేంద్రం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది తమ షాపింగ్ సెప్టెంబర్ 22 తర్వాత చేద్దామనే ఆలోచనలో ఉన్నారు.
ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ పాల ఉత్పత్తుల తయారీ సంస్థ అమూల్ జీఎస్టీ రేట్ల మార్పుల వ్యవహారంపై కీలక ప్రకటన చేసింది. జీఎస్టీ మార్పుల వల్ల పాల ప్యాకెట్ల రేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని క్లారిటీ ఇచ్చింది. అంటే పాల ప్యాకెట్ల రేట్లు తగ్గవని, పాత రేట్లే కొనసాగుతాయని అర్థం. ఎందుకంటే పాల ప్యాకెట్లకు ఎప్పటి నుంచో జీఎస్టీ సున్నా శాతంగా ఉందని అందువల్ల కొత్తగా ఎలాంటి మార్పులు జీఎస్టీ వల్ల ధరల్లో రాలేదని వినియోగదారులకు చెప్పింది.
అయితే కొత్తగా జీఎస్టీ రేట్లలో మార్పుల కారణంగా కేవలం అల్ట్రా హై టెంపరేచర్ ప్రాసెస్డ్(UHT) పాల రేట్లు మాత్రమే తగ్గనున్నట్లు కంపెనీ చెబుతోంది. గతంలో ఈ UHT పాలపై 5 శాతం జీఎస్టీ ఉండేదని ప్రస్తుతం కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్ల కింద దానిని ప్రభుత్వం సున్నా శాతానికి తీసుకొచ్చినందున సెప్టెంబర్ 22 నుంచి తగ్గించబడిన రేట్లతో మార్కెట్లో వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ చెబుతోంది.
ALSO READ : ఎకరం 800 కోట్లు..
అసలు ఈ UHT పాలు అంటే ఏంటి.. మామూలు పాలకు దీనికి తేడా ఏంటి..?
UHT పాలు అల్ట్రా-హై టెంపరేచర్ ప్రాసెసింగ్‌కు లోనవుతాయి. అంటే ఈ ప్రక్రియలో పాలను కొన్ని సెకన్ల పాటు 135 డిగ్రీల వరకు వేడి చేసి దాదాపు అన్ని సూక్ష్మజీవులను తొలగిస్తారు. ఆ తర్వాత ఈ పాలను టెట్రా ప్యాక్‌ల వంటి అసెప్టిక్ ప్యాకేజింగ్‌తో నింపి విక్రయిస్తారు. UHT పాలను ఫ్రీజర్లలో స్టేర్ చేయకుండానే చాలా నెలల పాటు నిల్వ ఉంటాయి. అంటే ఇవి మనం రెగ్యులర్ గా వాడే పాల ప్యాకెట్ల మాదిరిగా కాకుండా ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ కలిగి ఉంటాయి.