
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాక్సిన్ ప్రయోగాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే వీటిపై హ్యాకర్ల కన్నుపడింది. ప్రముఖ ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ పరిశోధకుల నుండి విలువైన డేటా ను చోరీ చేసేందుకు రష్యా, ఉత్తరకొరియా హ్యాకర్లు ప్రయత్నించినట్లు మైక్రోసాఫ్ట్ గుర్తించింది. దీనికి సంబంధించి ఐటి సంస్థ తన బ్లాగులో తెలిపింది. భారత్, కెనడా, దక్షిణ కొరియా, అమెరికాలోని కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను లక్ష్యంగా చేసుకొని వీరు హ్యాకింగ్‌కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్ చెప్పింది. చాలావరకు హ్యాకర్లు విఫలమయినట్లు తాము గుర్తించామని స్పష్టం చేసింది. రష్యా, మిలిటరీ ఏజెంట్స్ కు చెందిన ఫ్యాన్సీ బీర్, ఉత్తర కొరియా కు చెందిన లజారస్ గ్రూప్ వంటివి హ్యాకింగ్ కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ పరిశోధకులు లాగిన్ వివరాలను చోరీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయంది. ఈ ఏడాది జులై లో అమెరికా ప్రభుత్వం కూడా హ్యాకింగ్ ఆరోపణలు చేసింది. మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా సైబర్ దాడుల గురించి హెచ్చరించారు. సైబర్ దాడుల నుండి ప్రపంచ దేశాలు తమ ఆరోగ్య సంరక్షణా సంస్థలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని స్మిత్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రెండో దఫా విజృంభిస్తోంది. అమెరికా సహా ఐరోపా దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను ఎదుర్కొనేందుకు తమ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఫైజర్ సంస్థ ప్రకటించడం యావత్ ప్రపంచానికి కొంత ఊరట కలిగిస్తోంది.