బెంగళూరులో నదులను తలపిస్తున్న రోడ్లు 

బెంగళూరులో నదులను తలపిస్తున్న రోడ్లు 
  • లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
  • ట్రాక్టర్లు, బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు జనం

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరును వర్షాలు మరోసారి ముంచెత్తాయి. సోమవారం కురిసిన భారీ వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌‌కు ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్లు, బోట్లు, బుల్డోజర్ల సాయంతో జనాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సిటీలోని డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇండ్లల్లోకి వరద చేరింది. సర్జాపూర్‌‌‌‌ రోడ్‌‌లోని రెయిన్‌‌బో డ్రైవ్‌‌ లేఅవుట్‌‌, సన్నీ బ్రూక్స్‌‌ లేఅవుట్‌‌ వంటి ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. ట్రాక్టర్లు, బోట్ల సాయంతో స్టూడెంట్లు స్కూళ్లు..కాలేజీలకు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లారు. ఔటర్‌‌‌‌ ఏరియాల్లో ఉన్న కాలనీలు నీట మునగడంతో పాటు ఐటీ కంపెనీలకు వెళ్లే దారులన్నీ నదులను తలపించాయి. 

సహాయక చర్యలకు సీఎం బసవరాజ్ ఆదేశం
సిటీలోని మహదేవపూర్‌‌‌‌, బొమ్మనహళ్లి ప్రాంతాలకు స్టేట్‌‌ డిజాస్టర్‌‌‌‌ రెస్పాన్స్‌‌ ఫండ్‌‌ బృందాలను నియమించాలని ఆదేశించినట్లు సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను తరలించాలని అధికారులకు సూచించానని చెప్పారు. రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపేందుకు టెంపరరీ కాల్వలు ఏర్పాటు దిశగా యోచిస్తున్నామన్నారు. మరోవైపు ఔటర్ ఏరియాల్లోని ఐటీ కంపెనీల్లో వరద చేరిందని ఆయా కంపెనీలు తెలిపాయి. దీంతో తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని సూచించినట్లు అమెజాన్‌‌, విప్రో, ప్లిప్‌‌కార్ట్‌‌ వంటి సంస్థలు వెల్లడించాయి. కాగా, ఈ నెల 1 నుంచి కురిసిన వర్షాల వల్ల తమ కంపెనీలకు రూ.225 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం బొమ్మైకు లేఖ రాశాయి.