పంటల సేకరణ  బిజినెస్​లోకి ‘హాకా’

పంటల సేకరణ  బిజినెస్​లోకి ‘హాకా’
  •     సేవల విస్తరణకు అనుమతించాలని కేంద్రానికి లేఖ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హైదరాబాద్‌‌‌‌ అగ్రికల్చరల్‌‌‌‌ కో-ఆపరేటివ్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (హాకా) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దీపావళి పటాకులు, విత్తనాలు, గవర్నమెంట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లకు అవసరమైన స్టేషనరీ  విక్రయాలు, పంపిణీలకే పరిమితమైన ఈ సంస్థ.. ఇకపై దేశవ్యాప్తంగా సేవలను విస్తరించాలని డిసైడ్​అయింది. హాకా సేవల విస్తరణలో భాగంగా కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ టెండర్లలోనూ పాల్గొనేలా అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకోవాలని  హాకా యోచిస్తోంది. దీనిపై ఇటీవల కేంద్ర సర్కారుకు లేఖ కూడా రాసింది. తక్కువ మార్జిన్‌‌‌‌తో ఎక్కువ సేవలను అందించడానికి హాకా సన్నాహాలు చేస్తోంది.  ప్రస్తుతం రూ.250 కోట్లున్న సంస్థ వార్షిక టర్నోవర్​ను, 2023-–24  ఆర్థిక సంవత్సరంకల్లా రూ.35వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హాకా చైర్మన్​ మచ్చా శ్రీనివాసరావు వెల్లడించారు.  

అన్ని రాష్ట్రాల్లోనూ పంటల సేకరణ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని హాకా భావిస్తోంది.  హాకాతో ఎంఓయూ కుదుర్చుకునే రాష్ట్రాల్లోని సివిల్ సప్లయ్స్​ విభాగాలకు రేషన్‌‌‌‌ బియ్యం, గోధుమలు, కందిపప్పు, శెనగలు, జొన్నలను తక్కువ ధరకే సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని -ప్రభుత్వ సంస్థలకు స్టేషనరీని, ఫర్నీచర్​ను కూడా సరఫరా చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు. హాకాకు ప్రస్తుతం వ్యాపార సేవల ద్వారా వస్తున్న కమీషన్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ జీతాలకే సరిపోవడం లేదు. సంస్థకు చెందిన భవనాల నుంచి వచ్చే అద్దెలతోనే ప్రస్తుతం హాకా మనుగడ సాగిస్తోంది. 

టార్గెట్‌‌‌‌ రూ.35వేల కోట్ల టర్నోవర్‌‌‌‌ : మచ్చా శ్రీనివాసరావు, చైర్మన్​, హాకా 

హాకాను పటిష్టం  చేసేందుకు నిర్దిష్టమైన ప్లాన్‌‌‌‌తో ముందుకు వెళ్తున్నాం. రూ.250 కోట్లున్న సంస్థ టర్నోవర్‌‌‌‌ను 2023–24 ఫైనాన్షియల్‌‌‌‌ ఇయర్‌‌‌‌లోగా రూ.35 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సంస్థను లాభాల్లోకి తీసుకురావాలన్నదే మా టార్గెట్​. పంటల సేకరణ, వస్తువుల సరఫరా సేవలను అందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో ఎంఓయూలు కుదుర్చుకుంటాం. అన్ని సంస్థలతో పోటాపోటీగా హాకా సేవలను విస్తరిస్తాం.