కరోనా మరణాల్లో సగం మంది 60 ఏళ్ల లోపు వాళ్లే

కరోనా మరణాల్లో సగం మంది 60 ఏళ్ల లోపు వాళ్లే

న్యూఢిల్లీ:  మన దేశంలో కరోనా మరణాల తీరు మారిపోయింది. కొన్ని రోజుల కిందట 60 ఏండ్ల పైబడినోళ్లే ఎక్కువగా చనిపోయారు. ఇప్పుడేమో అంతకంటే తక్కువ వయసున్నోళ్ల మరణాలు కూడా దాదాపు రెట్టింపుగా పెరిగిపోయాయి. ప్రస్తుతం కరోనా మృతుల్లో 60 ఏళ్లలోపు ఉన్నవారే 48.8 శాతమని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం వెల్లడైంది.  గురువారం నాటికి దేశంలో1,075 మంది చనిపోయారు. వీరిలో దాదాపు సగం మంది 60 ఏండ్లలోపు వాళ్లే ఉన్నారు. ఏప్రిల్ 18 నాటికి 60 ఏండ్లలోపు మృతులు 25 శాతమే ఉండగా, తాజాగా వీరి సంఖ్య  48.8 శాతానికి చేరింది. మరోవైపు 75 ఏండ్లకు పైబడిన వాళ్లలో వైరస్ వల్ల చనిపోయినోళ్ల సంఖ్య ఏకంగా 42.2 శాతం నుంచి 9.2 శాతానికి పడిపోయింది. ఇక ఏప్రిల్ 18న దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 48.8. అప్పుడు మృతుల్లో 75 ఏళ్లకు పైబడినవారు 42.2 శాతం ఉన్నట్లు వెల్లడైంది. అలాగే 60–75 ఏళ్ల మధ్యవారు 33.1 శాతం, 45–60 ఏళ్ల మధ్యవారు 10.3 శాతం, 45 ఏళ్లలోపు వారు 14.4 శాతం ఉన్నారని తేలింది. మొత్తంగా అప్పుడు 60 ఏళ్లలోపువారి మరణాలు కేవలం 24.7 శాతమే ఉన్నట్లు వెల్లడైంది.

తెలంగాణలో 40 రోజులకు డబ్లింగ్

దేశవ్యాప్తంగా కేసులు రెట్టింపు (డబ్లింగ్) అయ్యేందుకు లాక్ డౌన్ కు ముందు 3.4 రోజులు పట్టగా, ఇప్పుడు ఆ టైమ్ 11 రోజులకు పెరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. తెలంగాణ, అస్సాం, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్ లలో డబ్లింగ్ కు 40 రోజులు పడుతోందని అంచనా. హిమాచల్ లో 191 రోజులు, ఢిల్లీ, యూపీ, జమ్మూకాశ్మీర్, ఒడిశా, రాజస్తాన్, తమిళనాడు, పంజాబ్ లలో 11‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–20 రోజులు, కర్నాటక, లడఖ్, హర్యానా, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాల్లో 20–40 రోజులు పడుతుందని అంచనా వేశారు.

కరోనా ఇంకో రెండేళ్లుంటది

న్యూయార్క్​: కరోనా​ పనిపట్టేందుకు సైంటిస్టులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అందుకే ఆ వైరస్​ మరింత మందికి సోకకుండా వివిధ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కరోనా​ రెండేళ్ల దాకా మనతోనే ఉంటుందని సైంటిస్టులు తాజాగా తేల్చారు. అమెరికా మినెసోటా యూనివర్సిటీలోని సెంటర్​ ఫర్​ ఇన్​ఫెక్షియస్​ డిసీజ్​ రీసెర్చ్​ అండ్​ పాలసీ (సిడ్రాప్​) సైంటిస్టులు వైరస్​ ఉనికిపై స్టడీ చేశారు. వైరస్​ ప్రభావం ఇప్పుడప్పుడే పోయే పరిస్థితి లేదని తేల్చారు. వస్తూపోతూ ఉంటుందని చెప్పారు. 2022 వరకు కరోనా తన ఉనికి చాటుకుంటుందన్నారు. 2021 నుంచి క్రమంగా తగ్గడం మొదలవుతుందని, దాని ప్రభావం కూడా తగ్గుతుందని చెప్పారు. ప్రాంతం, వైరస్​ నియంత్రణకు తీసుకునే చర్యల మీద దాని వ్యాప్తి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కాలాలకు తగ్గట్టు వైరస్​ వ్యాప్తి ఉంటుందన్నారు. ఒక్కోసారి అది పెరిగేందుకూ అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. 1918 స్పానిష్​ ఫ్లూ టైంలో ఇదే జరిగిందని చెప్పారు. అప్పుట్లో సమ్మర్​లో వైరస్​ వ్యాప్తి తక్కువగానే ఉన్నా, తర్వాతి వేవ్​లో మాత్రం అది చెలరేగి పోయిందని వివరించారు. మళ్లీ సమ్మర్​ నాటికి దాని కథ ముగిసిందన్నారు. 1957–58 పాండెమిక్​దీ అదే పరిస్థితన్నారు. ఇప్పుడు కరోనా విషయంలోనూ అదే జరుగుతుందని చెప్పారు.