తెలంగాణలో రెండేండ్లలో సగం డైట్ కాలేజీల మూత

తెలంగాణలో రెండేండ్లలో సగం డైట్ కాలేజీల మూత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత సర్కారు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసీ టీచర్ ఎడ్యుకేషన్ పై​కొన్నేండ్లుగా వివక్ష కొనసాగుతోంది. దీంతో ప్రతి ఏటా డిస్ట్రిక్ట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్(డైట్) కాలేజీల సంఖ్య తగ్గిపోతున్నది. రెండేండ్ల కింద వంద ప్రైవేటు కాలేజీలు ఉండగా.. ప్రస్తుతం సగం మూతపడ్డాయి. విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ అధికారుల అలసత్వం వల్ల ఉన్నవాటిలోనూ  ప్రతిఏడాది  అకాడమిక్ ఇయర్ ఆలస్యంగా మొదలవుతున్నది. దీంతో విద్యార్థులు డైట్ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. 

ఫుల్ డిమాండ్ ఉండే..

ఒకప్పుడు డీఈడీ కాలేజీల్లోని సీట్లకు ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ కోర్సు వైపు స్టూడెంట్లు చూసే పరిస్థితులు కనిపించడం లేదు. 2015లో 212 డీఈడీ ప్రైవేటు కాలేజీలు,10 ప్రైవేటు కాలేజీలు ఉండగా.. 2021 నాటికి10 సర్కారు,99 ప్రైవేటు కాలేజీలకు తగ్గిపోయింది. 2023 నాటికి ఆ సంఖ్య 45 ప్రైవేటు, 9 సర్కారు కాలేజీలకు పడిపోయింది. హైదరాబాద్ నేరేడ్ మెట్ లోని సర్కారు డైట్ కాలేజీకి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) పర్మిషన్ కూడా ఇవ్వలేదు. విద్యాశాఖ అధికారులు ఎన్సీటీఈకి ఫర్ఫార్మెన్స్ ఆప్రైజల్ రిపోర్ట్ సడ్మిట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది సర్కారు కాలేజీ  మూతపడ్డట్టు అయింది. దీనిపై ఏ ఒక్క ఆఫీసర్ నోరుమెదపడం లేదు. ప్రతిఏటా ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించడంతోనే పిల్లలు ఆయా కాలేజీల్లో చేరడం లేదని, దీంతోనే ఏటా కాలేజీల సంఖ్య తగ్గుతోందని స్టూడెంట్ యూనియన్లు చెప్తున్నాయి. 

ప్రక్షాళన అవసరం

సాధారణంగా విద్యాసంవత్సరం జులై, ఆగస్టు నెలల్లో ప్రారంభం అవుతోంది. కానీ, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో మాత్రం ఇది కొంతకాలంగా అమలు కావడం లేదు. గత విద్యాసంవత్సరం ఆగస్టులో డైట్ సెట్ ఫలితాలిస్తే.. డిసెంబర్ లో అడ్మిషన్లు నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా అదే విధానాన్ని అమలు చేశారు.  జూన్ 15న డైట్ సెట్ రిజల్ట్ ఇస్తే.. తాజాగా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జనవరిలో క్లాసులు ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. దీనంతటికి ఎస్సీఈఆర్టీ అధికారులదే నిర్లక్ష్యమని తెలుస్తోంది. కాలేజీల్లో తనిఖీలు చేసి ఆయా కాలేజీలకు గుర్తింపు ఇవ్వాల్సిన ఎస్సీఈఆర్టీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే, ఈ సమస్య ఏర్పడిందని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను తొలగించి, కొత్తవారిని నియమించి ప్రక్షాళన చేయాలని టీచర్ల సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.