తెలంగాణ కిచెన్..సపోటా... ఇట్ల కూడా తినొచ్చు

 తెలంగాణ కిచెన్..సపోటా... ఇట్ల కూడా తినొచ్చు

సపోటా పండుతో ఆరోగ్యానికి బోలెడు లాభం ఉంది. అలాగని ఎన్ని పండ్లు తింటాం అనుకునేవాళ్లు సపోటాలతో వెరైటీ రెసిపీస్​ చేసుకుని తినొచ్చు. సపోటాతో ఏం రెసిపీస్​ ఉంటాయి? మహా అయితే స్మూతీ, జ్యూస్​లాంటివి తప్ప అంటున్నారా! ఆ స్మూతీ, జ్యూస్​లతో పాటు హల్వా, డెజర్ట్​, కేక్​, రవ్వలడ్డు, కుల్ఫీ వంటివి చేయొచ్చు. అదెలాగో చదివి, చేసుకుని ఎంజాయ్​ చేయండి. 

సపోటా రవ్వ లడ్డు

కావాల్సినవి :

సపోటాలు - ఆరు 

బొంబాయి(ఉప్మా) రవ్వ - అర కప్పు

బెల్లం - పావు కప్పు

బాదం తరుగు - రెండు టేబుల్ స్పూన్లు

జీడిపప్పులు - ఒక టేబుల్ స్పూన్

ఎండుద్రాక్ష - ఒక టేబుల్ స్పూన్

నెయ్యి - రెండు టీస్పూన్లు

నూనె - ఒక టేబుల్ స్పూన్

యాలకుల పొడి - ఒక టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో బెల్లం వేసి నీళ్లు పోసి కరిగించాలి. నెయ్యి వేడిచేసి అందులో బాదం, జీడిపప్పు తరుగు, ఎండు ద్రాక్ష  వేగించాలి. తర్వాత వాటిని పక్కకు తీసి అదే పాన్​లో బొంబాయి రవ్వ వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేగించాలి. ఆ తర్వాత మిక్సీజార్​లో సపోటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని కూడా మరో పాన్​లో వేగించాలి. తరువాత అందులో బెల్లం నీళ్లు పోసి కలపాలి. ఆ మిశ్రమం దగ్గరపడ్డాక యాలకుల పొడి వేయాలి. దాంతోపాటు వేగించిన బొంబాయి రవ్వ, డ్రైఫ్రూట్స్​  వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే చిన్న ఉండలు కడితే సపోటా రవ్వ లడ్డు రెడీ. 

సపోటా డెజర్ట్

కావాల్సినవి  :

సపోటాలు - నాలుగు

కర్జూరాలు - ఆరు

పాలు - అర లీటర్

చక్కెర - రెండు వందల గ్రాములు

కార్న్ ఫ్లోర్ - ఒక టీస్పూన్

పాల పొడి - రెండు టీస్పూన్లు

తయారీ : సపోటాల తొక్క, గింజలు తీసేసి తరగాలి. కర్జూరాల గింజలు తీసి తరగాలి. కర్జూర, సపోటా ముక్కలను మిక్సీజార్​లో వేయాలి. అందులో రెండు టీస్పూన్ల పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అరలీటర్ పాలు పావు లీటర్ అయ్యేవరకు కాగబెట్టాలి. ఆ పాలలో కార్న్​ ఫ్లోర్​ కలపాలి. (కార్న్​ఫ్లోర్ బదులు కస్టర్డ్ పౌడర్​ కూడా వాడొచ్చు.) ఆ తరువాత మిల్క్​ పౌడర్ కలపాలి. మిశ్రమం దగ్గరపడేవరకు కలుపుతూనే ఉండాలి. మిశ్రమం దగ్గర పడిన తరువాత  సపోటా, కర్జూర మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి మూత పెట్టి అరగంట ఫ్రిజ్​లో పెట్టాలి. ఆ తర్వాత తింటే టేస్ట్​ చాలా బాగుంటుంది.

సపోటా స్మూతీ

కావాల్సినవి :

సపోటాలు - రెండు

బాదం తరుగు - ఒక టీస్పూన్

తేనె - ఒక టీస్పూన్

నీళ్లు - సరిపడా

పెరుగు - ఒక కప్పు

అవిసె గింజలు - ఒక టేబుల్ స్పూన్

నీళ్లు - ఒక కప్పు

తయారీ : సపోటాల తొక్క, గింజలు తీసేయాలి. తరువాత ముక్కలు తరిగి మిక్సీజార్​లో వేయాలి. వాటితోపాటు పెరుగు, అవిసె గింజలు, బాదం తరుగు, తేనె వేయాలి. తరువాత నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని గ్లాస్​లో పోసి అవిసె గింజలు, బాదం పలుకులు చల్లి, తేనెతో డెకరేట్​ చేస్తే టేస్టీ, హెల్దీ సపోటా స్మూతీ రెడీ. 

సపోటా హల్వా

కావాల్సినవి :

సపోటాలు – పదిహేను

కోవా – ఒక కప్పు

నెయ్యి – రెండున్నర టేబుల్ స్పూన్లు

చక్కెర – అర కప్పు

పాలు – రెండు టేబుల్ స్పూన్లు

కుంకుమ పువ్వు – చిటికెడు

యాలకుల పొడి – ఒక టీస్పూన్

బాదం, జీడిపప్పు తరుగు – సరిపడా

తయారీ :  సపోటాలను తొక్క తీసి, తురమాలి. పాన్​లో నెయ్యి వేడిచేసి కోవా వేయాలి. అది మెత్తగా అయ్యేవరకు ఉడికించి ఒక ప్లేట్​లోకి తీయాలి.  అదే పాన్​లో మరికాస్త నెయ్యి వేడి చేసి అందులో సపోటా గుజ్జు వేసి ఉడికించాలి. తర్వాత అందులో కోవా వేసి కలపాలి. ఒక గిన్నెలో కొన్ని పాలు పోసి కుంకుమ పువ్వు  నానబెట్టాలి. ఈ పాలను సపోటా మిశ్రమంలో పోసి కలపాలి. ఆ తర్వాత చక్కెర వేసి అది కరిగేవరకు కలపాలి. చివరిగా యాలకుల పొడి, బాదం, జీడిపప్పుల తరుగు వేసి మళ్లీ ఒకసారి కలిపితే హల్వా రెడీ. 

సపోటా కుల్ఫీ

కావాల్సినవి :

పాలు - ఒక లీటర్

సపోటాలు - ఆరు

చక్కెర - ఎనిమిది టేబుల్ స్పూన్లు

తయారీ : ఒక గిన్నెలో లీటర్ పాలు కాగబెట్టాలి. పాలు మరిగేటప్పుడు చక్కెర వేసి కలపాలి. లీటర్​ పాలు బాగా మరిగి అరలీటర్ అయ్యాక వాటిని చల్లార్చాలి. జ్యూస్ జార్​లో పాలు పోసి, సపోటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్​ చేయాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ గ్లాస్​లో పోసి, గాలి చొరబడకుండా మూతపెట్టి ఫ్రిజ్​లో పెట్టాలి. ఎనిమిది గంటల తర్వాత తీసి తింటే వారెవ్వా కుల్ఫీ అనాల్సిందే. 

సపోటా కేక్

కావాల్సినవి :

సపోటాలు - ఐదు

మైదా పిండి - ఒక కప్పు

బెల్లం (కరిగించి) - ఒక కప్పు

పాలు - అర కప్పు

నూనె - అర కప్పు

బేకింగ్ పౌడర్ - ఒక టీస్పూన్

బేకింగ్ సోడా - ఒక టీస్పూన్ 

నూనె - అర కప్పు

వెనీలా ఎసెన్స్ - పావు టీస్పూన్

తయారీ : సపోటాల తొక్క, గింజలు తీసి ముక్కలు తరగాలి. మిక్సీజార్​లో సపోటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గిన్నెలో వేసి అందులో కరిగించిన బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి కలపాలి. నూనె, పాలు, వెనీలా ఎసెన్స్​ ఒక్కోటిగా వేస్తూ అన్నీ బాగా కలిసేలా మరోసారి కలపాలి. ఒక ప్లేట్​ లేదా గిన్నెకి నెయ్యి పూసి రెడీ చేసిన మిశ్రమం అందులో వేయాలి. కేక్​ని బేక్​ చేయడం కోసం పాన్​ వేడి చేసి అందులో ఒక ప్యాకెట్ రాతి ఉప్పు వేసి పాన్​ అంతా పరవాలి. దానిపై ఒక స్టాండ్ పెట్టి అందులో కేక్ మిశ్రమం ఉన్న ప్లేట్​ పెట్టి దానిపై మూతపెట్టాలి. ముప్పావుగంట ఉడికాక కాసేపు చల్లారబెట్టాలి. ఆపై ముక్కలుగా కట్‌చేసుకుని తింటే యమ్మీగా ఉంటుంది​.