తన భూమిని తనకు ఇప్పించాలని.. సెల్ టవర్ ఎక్కిన వికలాంగుడు

 తన భూమిని తనకు ఇప్పించాలని.. సెల్ టవర్ ఎక్కిన వికలాంగుడు

నడిగూడెం (మునగాల), వెలుగు : తన భూమిని ఇప్పించాలని తహసీల్దార్​కు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సూర్యాపేట జిల్లా నడిగూడెంలో గురువారం ఓ వికలాంగుడు సెల్ టవర్ ఎక్కాడు.  గ్రామంలోని 98/ 5 సర్వే నంబర్​లో మూడు ఎకరాల 20 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో 1.5 ఎకరాలు వైకుంఠధామం కట్టేందుకు కేటాయించారు. మిగిలిన భూమిని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచారు. అయితే, ఇదే భూమిని అదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆక్రమించుకున్నారు. వీరు తరచూ తమదంటే తమదని గొడవ పడుతున్నారు. ఇందులో ఒకరైన దున్న గురవయ్య పేరుతో 2012లో నకిలీ పాస్ బుక్​ బయటకు వచ్చింది. 

దీంతో ఆఫీసర్లు ఆ భూమిని వైకుంఠధామం కిందే ఉంచారు. కానీ, ఆ భూమిని తనకు కేటాయించాలని దున్న గురువయ్య కొడుకు నాగరాజు ఆఫీసర్లను కోరగా, వారు ప్రభుత్వ భూమి కాబట్టి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో నాగరాజు గురువారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు. తహసీల్దార్ వచ్చి సమాధానం చెప్పకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు అక్కడికి వచ్చి న్యాయం చేస్తామని కిందకి దిగాలని కోరినా వినలేదు. అక్కడకు చేరుకున్న తహసీల్దార్​ భూమికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఆఫీసుకు వచ్చి ఇవ్వాలని, అలాగైతే న్యాయం చేస్తానని చెప్పడంతో కిందికి దిగాడు.